
నేపాల్ యొక్క కొత్త పటంలో భారత భూభాగంలోని కాలాపానీ, లిపులేఖ్ మరియు లింపియాధూరాలను చేర్చడానికి ఉద్దేశించిన రాజ్యాంగ సవరణ బిల్లును నేపాల్ ప్రతినిధుల సభ (దిగువ సభ) శనివారం ఆమోదించింది.
ఈ క్రమంలో జరిగిన ఒక పెద్ద పరిణామంలో, నేపాల్ యొక్క అధికారిక పటంలో కాలాపానీ, లిపులేఖ్ మరియు లింపియాధూరాలను ఏకగ్రీవంగా చేర్చడానికి రాజ్యాంగ సవరణను నేపాల్ ప్రతినిధుల సభ (దిగువ సభ) శనివారం ఆమోదించింది. ఈ సమావేశాలకు నేపాల్‌లోని 275 మంది ఎంపీలకు గానూ 258 మంది హాజరయ్యారు. అందరూ సవరణకు ఆమోదం తెలుపుతూ ఓటు వేశారు. ఈ సవరణను నేపాల్ ప్రతినిధుల సభలో మంగళవారం ప్రవేశపెట్టారు.
నేపాల్ భారత భూభాగాలను కొత్త పటంలో పొందుపరుస్తుంది…..
నేపాల్ యొక్క కొత్త పటాన్ని ధృవీకరించడానికి రాజ్యాంగ సవరణ బిల్లును పరిగణనలోకి తీసుకునే ప్రతిపాదనను మంగళవారం నేపాల్ దిగువ సభ ఆమోదించింది – ఇందులో అనేక భారతీయ భూభాగాలు ఉన్నాయి. రాజ్యాంగ సవరణను నేపాల్ పార్లమెంటు ఉభయ సభలలో 2/3 వ మెజారిటీ ఆమోదించాలి. కొత్త పటాన్ని ఆమోదించడంలో కేపీ శర్మ ఓలి నేతృత్వంలోని ప్రభుత్వం ప్రధాన ప్రతిపక్ష పార్టీ నేపాలీ కాంగ్రెస్, జనతా సమాజ్ వాదీ పార్టీ-నేపాల్ మద్దతును సంపాదించడంతో ఇది ఏకగ్రీవంగా ఆమోదించబడింది.
నేపాల్ చర్యను తప్పుపట్టిన భారత విదేశీ వ్యవహారాల శాఖ
నేపాల్ చర్యపై భారత విదేశీ వ్యవహారాల శాఖ తీవ్రంగా తప్పుపట్టింది. మే 18 న నేపాల్ ప్రధాని కెపి శర్మ ఓలి భారత భూభాగాలైన కాలాపానీ, లిపులేఖ్ మరియు లింపియాధూరాలతో కూడిన నేపాల్ యొక్క కొత్త మ్యాప్‌ను నేపాల్ పార్లమెంట్ లో ప్రతిపాదించారు. కానీ నిజానికి 1816 నాటి సుగౌలీ ఒప్పందం ప్రకారం అప్పటి బ్రిటిష్ భారత ప్రభుత్వ హయాంలో నేపాల్, భారత సరిహద్దులకు సంబంధించిన ఒప్పంద పత్రాలపై ఇరుదేశాలూ సంతకం చేశారన్న విషయాన్ని గుర్తు చేస్తూ ఆ ఒప్పందం ప్రకారమే అప్పుడు నేపాల్ యొక్క కొత్త పటం రూపొందించబడిందని భారత విదేశీ వ్యవహారాల శాఖ పేర్కొంది. అయితే మే 19 న పార్లమెంటులో ప్రసంగించిన నేపాల్ ప్రధాని, భారతదేశం తన సైన్యాన్ని అక్కడ నిలుపడం ద్వారా పైన పేర్కొన్న భూభాగాలను “వివాదాస్పదంగా” మార్చిందని పేర్కొన్నారు. దౌత్య మార్గాల ద్వారా భారతదేశం నుండి ఈ భూభాగాలను తిరిగి పొందుతామని ఆయన ప్రతిజ్ఞ చేశారు.





