
అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా.. ఐదు దశాబ్దాల అనంతరం మరోసారి చంద్రయానాన్ని తలపెట్టింది. కాగా, ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుకు ఓ మహిళ నాయకత్వం వహించనుండటం విశేషం. 1992లో నాసాలో చేరిన కేథీ ల్యూడర్స్ మానవ సహిత అంతరిక్ష యాత్ర కార్యక్రమానికి సారథ్యం వహించనున్న తొలి మహిళగా చరిత్ర సృష్టించనుంది. తొలిసారిగా ఓ మహిళతో సహా ఇద్దరు వ్యోమగాములను 2024 కల్లా చంద్రునిపైకి పంపే కార్యక్రమానికి నాసా ప్రణాళిక సిద్ధం చేసింది. భారీ వ్యోమనౌక ఎస్‌ఎల్‌ఎస్, ఓరియన్ క్యాప్సూల్‌ల ద్వారా సాకారం కానున్న ఈ చంద్రయాన ప్రయోగానికి… కేథీ నాయకత్వం వహించనున్నారు. ఈ మేరకు నాసా ప్రకటన విడుదల చేసింది. నాసా చేపట్టిన అనేక వాణిజ్య అంతరిక్ష ప్రయోగాల విజయంలో భాగస్వామి అయిన ల్యూడర్స్.. తమ మానవ సహిత అంతరిక్ష యాత్ర ‘హ్యుమన్ ఎక్స్‌ప్లోరేషన్ ఆండ్ ఆపరేషన్స్ మిషన్ డైరక్టరేట్’ (హెచ్‌ఈఓ)కు నాయకత్వం వహించేందుకు సరైన వ్యక్తి అని తెలిపింది.
ప్రైవేట్ భాగస్వామ్యంతో వాణిజ్య అంతరిక్ష నౌకలను తయారుచేసే కార్యక్రమానికి దశాబ్దం క్రితమే నాసా శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగా స్పేస్ ఎక్స్, బోయింగ్ తదితర సంస్థలు తయారుచేసే అంతరిక్ష నౌకలకు సంబంధించిన అత్యంత కఠినమైన పరీక్షా కార్యక్రమాల పర్యవేక్షణలో కేథీ ల్యూడర్స్‌కు అపార అనుభవం ఉంది. ఇక మే 30న కేథీ ఆధ్వర్యంలోనే జరిగిన తొలి వాణిజ్య అంతరిక్ష యాత్రలో ఇద్దరు వ్యోమగాములు విజయవంతంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరారు. దీనితో మరో ఘన విజయాన్ని ఆమె తన ఖాతాలో వేసుకున్నారు.





