
కాలిఫోర్నియా విశ్వవిద్యాలయ పరిశోధన పత్రాలను దొంగిలించడానికి ప్రయత్నించడం మరియు వీసా నిబంధనల అతిక్రమణ నేరంపై యుఎస్ కస్టమ్ అధికారులు చైనా సైనిక అధికారి ఒకరిని అరెస్ట్ చేశారు.
కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం నుండి ప్రభుత్వ నిధులతో జరిగిన పరిశోధన వివరాలతో ఆదివారం యుఎస్ నుండి పారిపోవడానికి ప్రయత్నిస్తున్న చైనా సైనిక అధికారిని అరెస్టు చేసినట్లు యుఎస్ న్యాయ శాఖ సమాచారం ఇచ్చింది. జిన్ వాంగ్ గా గుర్తించిన ఆ అధికారి కూడా వీసా నిబంధనలను అతిక్రమించినట్లుగా కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
జిన్ వాంగ్ ను అరెస్టు చేసిన తరువాత ఎఫ్‌బిఐ జరిపిన దర్యాప్తులో జిన్ వాంగ్ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీలో మేజర్ పదవిని కలిగి ఉన్నారని, అలాగే పిఎల్‌ఎ అతనికి జీతం చెల్లిస్తున్నదని కూడా వెల్లడయింది. ఏదేమైనా, వాంగ్ తన వీసా దరఖాస్తులో శాన్ఫ్రాన్సిస్కో (యుసిఎస్ఎఫ్) కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో శాస్త్రీయ పరిశోధనలను నిర్వహించడం తన సందర్శన యొక్క ఉద్దేశ్యంగా పేర్కొన్నాడు.
యుఎస్ కస్టమ్ అధికారులను ప్రశ్నించినప్పుడు, వాంగ్ తన పై అధికారి అయిన చైనాలోని తన మిలిటరీ యూనివర్శిటీ ల్యాబ్ డైరెక్టర్ అమెరికాలోని యుసిఎస్ఎఫ్ ల్యాబ్ యొక్క లేఅవుట్ ను పరిశీలించి, దానిని చైనాలో ఎలా రూపొందించాలనే దానిపై సమాచారాన్ని తీసుకురావాలని తనను ఆదేశించినట్లు వెల్లడించాడు. వాంగ్ యుసిఎస్‌ఎఫ్ నుండి సేకరించిన వివరాలు తన పిఎల్‌ఎ సహోద్యోగులతో పంచుకోవడానికి ఉద్దేశించినవనే సమాచారం తమ వద్ద ఉన్నట్లు యుఎస్ కస్టమ్స్ అధికారులు తెలిపారు. అతను చైనాలోని తన ల్యాబ్‌కు ఈమెయిల్ ద్వారా పరిశోధన వివరాలని పంపినట్లుగా కూడా వారు తెలుసుకున్నారు. వాంగ్ దొంగిలించిన పరిశోధన US ఆరోగ్య, మానవ సేవల విభాగం నిధులతో చేసిన పరిశోధనకు చెందినది.
జిన్ వాంగ్ అరెస్ట్ నేపథ్యంలో అమెరికా పరిశోధనా సంస్థలు మరియు చైనా సైనిక సంస్థల మధ్య వున్న విద్యా సంబంధాలు విచ్ఛిన్నమయ్యే అవకాశాలు ఉన్నాయి. యుఎస్ లోని చైనా విద్యార్థులు చైనా సైనిక సంస్థలకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అక్రమంగా బదిలీ చేశారనే ఆరోపణల నేపథ్యంలో చైనా నుండి వచ్చే గ్రాడ్యుయేట్ విద్యార్థులు, పరిశోధకుల అమెరికా ప్రవేశాన్ని నిషేధించనున్నట్లు మే 29 న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.
వాంగ్ ప్రస్తుతం ఎఫ్బిఐ అదుపులో ఉన్నాడు. త్వరలో అతనిని కోర్టులో హాజరుపరుస్తారు. అతనికి 10 సంవత్సరాల జైలు శిక్ష తప్పనిసరి. అతను దోషిగా తేలితే అతనికి US $ 250,000 జరిమానా కూడా విధించే అవకాశం ఉంది.





