ArticlesNews

మానవత్వానికి మరణం లేదు

1.2kviews

లాక్ డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన వలస కార్మికులు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి తమ స్వస్థలాలకు పయనమైన సంగతి పాఠకులకు విదితమే. కోట్లాది మంది కార్మికులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైళ్ళు, బస్సుల ద్వారా వారి గమ్యస్థానాలకు చేర్చాయి. కానీ అనేక కారణాల రీత్యా కొందరు కాలినడకనే తమ స్వస్థలాలకు వెళ్లడానికి సాహసించారు.

అలా బయలు దేరిన కార్మికుల బాధలు వర్ణనాతీతం. అయితే సమాజంలోని వివిధ వర్గాల ప్రజలు, సేవా సంస్థలు అడుగడుగునా వారికి బాసటగా నిలిచాయి. దారిపొడవునా వారికి కావలసిన ఆహారము, త్రాగునీరు, మజ్జిగ వంటివి అందించారు, అందిస్తున్నారు.

సమాజానికి, దేశానికి ఏ విపత్తు సంభవించినా తమ వంతు సాయాన్ని అందించడానికి సదా సిద్ధంగా ఉండే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్, సేవా భారతి,  సమరసతా సేవా ఫౌండేషన్, జన సంక్షేమ సమితి వంటి వివిధ సేవా సంస్థల కార్యకర్తలు కాలినడకన వెళుతున్న వలస కార్మికులకు సైతం బాసటగా నిలిచారు.

మన రాష్ట్రంలోనూ కార్యకర్తలు పెద్ద ఎత్తున వలస కార్మికులకు సహాయ సహకారాలను అందించారు.  దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాలకు నడిచిపోతున్న వలస కార్మికులకు ఆహారం, వారికి అవసరమైన దుస్తులు, సబ్బు బిళ్ళ లు వంటి వాటిని అందించడంతోపాటు దారిన పోతున్న వివిధ వాహనాలలో వారిని తరలించే ప్రయత్నం కూడా చేశారు.

ఈ క్రమంలో సదరు సేవా కార్యక్రమాలలో నిమగ్నమైన కార్యకర్తలకు అద్భుతమైన అనుభవాలు అనేకం ఎదురయ్యాయి. కార్యకర్తలు చేస్తున్న సేవా కార్యక్రమాలకు ప్రభావితులై సమాజంలోని వివిధ వర్గాల ప్రజలు వారికి చేదోడుగా నిలిచారు. భారతీయ సమాజంలో మానవత్వానికి మరణం లేదని చాటారు. ఆ అనుభవాలను ఒకసారి తెలుసుకుందాం….

– నడిచి పోతున్న వలస కార్మికులను కార్యకర్తలు వివిధ వాహనాలలో ఎక్కించి పంపడానికి ప్రయత్నించినప్పుడు ఆ వాహనాల డ్రైవర్లలో కేవలం పది శాతం మంది మాత్రమే వారిని తరలించడానికి డబ్బులు అడిగారు. మిగిలిన 90% మంది డ్రైవర్లు సంతోషంగా వారిని వాహనంలోకి ఎక్కించుకోవడమే కాకుండా…. డబ్బులివ్వబోయిన కార్యకర్తలతో “మాకు డబ్బులు వద్దన్నా! వారు పడుతున్న కష్టం ముందు మేం చేస్తున్న సాయం ఏ పాటిది? మేం వెళ్ళినంత దూరం వారిని క్షేమంగా తీసుకెళ్లి దించుతామన్నా” అని చెప్పుకొచ్చారు.

– ఒక చోట నడిచి పోతున్న వారి బట్టలు బాగా మురికి పట్టి ఉండడం చూసి కార్యకర్తలు వారి కోసం సబ్బు బిళ్ళలు కొనడానికి రోడ్డు పక్కనే ఉన్న ఒక షాప్ కి వెళ్లారు. అతని దగ్గర సబ్బులు తీసుకుని డబ్బులు ఇవ్వబోతే….. ” వద్దు బాబూ! మీరు మంచి పని చేస్తున్నారు. నన్ను కూడా కొంచెం సాయం చేయనివ్వండి” అంటూ ఆ షాపతను చెప్పడం కార్యకర్తలను కదిలించింది.

– చెన్నై నుంచి కారులో వెళుతున్న ఓ కుటుంబం, జాతీయ రహదారి పక్కన రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్, సేవా భారతి కార్యకర్తలు నిలబడి నడిచిపోతున్న వలస కార్మికులకు ఆహార పొట్లాలు, మంచినీరు, మజ్జిగ వంటివి అందిస్తుండడం చూచి ఆగి ” మీరు మంచి పని చేస్తున్నారు”. అంటూ ప్రశంసించి కొంత నగదును కార్యకర్తల చేతుల్లో పెట్టి “మీరు చేస్తున్న సేవా కార్యక్రమానికి ఈ మొత్తాన్ని కూడా వినియోగించండి” అని చెప్పి వెళ్ళిపోయారు.

– తన సహచర కార్యకర్తలతో కలిసి తాను చేస్తున్న సేవా కార్యక్రమాల దృశ్యాలను కార్యకర్త ఒకరు తన వాట్సప్ స్టేటస్ లో ఉంచారు. దానిని చూచి ప్రభావితుడైన ఆయన బంధువు ఒకరు జరుగుతున్న సేవా కార్యక్రమానికి తన వంతు సాయాన్ని కూడా స్వీకరించమని కోరుతూ ఆ కార్యకర్త అకౌంట్ కు ఒక చెప్పుకోదగ్గ మొత్తాన్ని ట్రాన్స్ఫర్ చేశారు.

– కార్యకర్తలు చేస్తున్న సేవను చూచి ఒక వ్యాపారి తన ఇంట్లో ప్రతిరోజూ కొంత మజ్జిగ తయారుచేసుకుని ఒక క్యాన్ లో పెట్టుకుని తన భార్య, పదేళ్ల కుమార్తెతో కలిసి జాతీయ రహదారి వద్దకు వచ్చి కార్యకర్తలతో కలిసి ఆ మజ్జిగని వితరణ చేసేవారు.

– ఒక టైర్ల షోరూమ్ యజమాని తన కారులో కొన్ని బిర్యానీ పొట్లాలు వేసుకుని రహదారి మీదకు వచ్చి నడిచి పోతున్న వారికి ఇస్తూ ఉండేవాడు. అదే రహదారిపై సేవాభారతి కార్యకర్తలు కూడా భోజన పొట్లాలు, మంచినీరు, మజ్జిగ, దుస్తులు వంటివి అందిస్తూ ఉండడం చూసి ఆ తర్వాతి రోజు నుంచి తను అందించదలచుకున్న ఆహార పొట్లాలను కూడా కార్యకర్తలకే చేర్చి వారినే వితరణ చేయమని చెప్పారు.

– కార్యకర్తలు ఇలా తాము ఆహారము వగైరాలను అందిస్తున్నామని చెప్పినప్పుడు అనేక నగరాలలోని గృహిణులు తమకు తాముగా ముందుకు వచ్చి అందుకు అవసరమైన కోడిగుడ్లు, పుల్కాలు, రోటీలు, పులిహోర, పెరుగన్నం వంటివి స్వచ్ఛందంగా సొంత ఖర్చులతో తయారు చేసిచ్చారు. అలాగే మరికొందరు పెద్ద ఎత్తున పండ్లను అందించారు. ఇవేవీ చెయ్యలేనివారు ఆర్ధిక సాయాన్ని అందించారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల్లోనూ ప్రతిరోజూ దాదాపు 30 –  40 కుటుంబాలు ఈ సహాయ కార్యకలాపాలలో పరోక్షంగా పాలు పంచుకోవడం విశేషం.

సాటి మనిషి కష్టంలో ఉంటే ఆదుకోవడానికి సమాజం ఎప్పుడూ తయారుగానే ఉంటుందని ఈ సంఘటనలన్నీ రుజువు చేస్తున్నాయి. అయితే దురదృష్టవశాత్తూ దశాబ్దాలపాటు సమాజంలో మంచితనం మృగ్యమైపోయిందని, మనిషన్న వాడెవడూ లేడని, మానవత్వం మంట కలిసి పోయిందని అనేకమంది మేథావులు తమ రచనల ద్వారా ఆక్రోశిస్తూ ఉండినారు. సినిమాలలో సైతం ఇలాంటి సన్నివేశాలే చూపుతూ వ్యక్తులకు సమాజం పట్ల, వ్యవస్థల పట్ల విశ్వాసం పోగొట్టేందుకు యధాశక్తి ప్రయత్నించారు. అలాంటి వారందరికీ ప్రజలు ఇప్పుడు కనబరుస్తున్న సేవాతత్పరత, వితరణ శీలత ఒక కనువిప్పు కావాలి.

– శ్యాంప్రసాద్ రెడ్డి కోర్శిపాటి.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.