NewsProgramms

ధర్మ జాగరణ ఆధ్వర్యంలో “నిత్య సాధన”

224views

సాయంత్రం 6:00 గంటలు. ఇంట్లోని చిన్నా పెద్దా అంతా దేవుని గది ముందు కూర్చున్నారు. అందరూ భక్తిగా పద్మాసనం వేసుకుని నమస్కార స్థితిలో మూడు సార్లు ఓంకారం చెప్పారు. అనంతరం ఆ ఇంట్లోని తొమ్మిదవ తరగతి చదువుతున్న పాప హనుమాన్ చాలీసాలో మొదటి లైన్ చెప్పింది. పిల్లలు పెద్దలు అందరూ కలిసి హనుమాన్ చాలీసాని భక్తితో చదివారు. అనంతరం అదే పద్ధతిలో మృత్యుంజయ మహా మంత్రం చెప్పారు. పిల్లలు పెద్దలు అందరూ కలిసి ” శ్రీ రామ జయ రామ జయ జయ రామ” మహా మంత్రాన్ని, “ఓం నమశ్శివాయ” పంచాక్షరీ మంత్రాన్ని జపించారు. ఇంతలో ఇంటిలోని తాతగారు  “హే భజే పాండురంగ ప్రభో విఠ్ఠల” అంటూ ఓ భజన గీతాన్ని అందుకున్నారు. అలా మరో రెండు భజన గీతాలను ఆలపించిన తరువాత చివరిగా శాంతి మంత్రాన్ని పఠించి ఆనాటి ఆ “నిత్య సాధన” కార్యక్రమాన్ని ఆ కుటుంబ సభ్యులు పూర్తి చేశారు.

ఇది ఆంధ్రప్రదేశ్లోని 2689 గ్రామాలలో, 21000 కుటుంబాలలో లాక్ డౌన్ సందర్భంగా ప్రతి నిత్యమూ కనిపిస్తున్న దృశ్యం. ఆంధ్ర ప్రదేశ్ ధర్మ జాగరణ సమితి లాక్ డౌన్ సందర్భంగా రాష్ట్రంలోని ధర్మ జాగరణ కార్యకర్తలందరూ రోజూ అర్ధ గంట పాటు తమ నిత్య సాధనను కొనసాగించాలని నిర్ణయించింది. పెద్దల నిర్ణయం మేరకు  రాష్ట్రంలోని 2689 గ్రామాలలో 21000 కుటుంబాలకు సంబంధించిన 90650 మంది కుటుంబ సభ్యులు ప్రతిరోజూ “నిత్య సాధన” లో పాల్గొంటూ ఉండటం విశేషం.

ఈ విధంగా ప్రతిరోజూ నిత్య సాధనను కొనసాగిస్తూ ఉండడంవల్ల తమ కుటుంబాలలో ఎంతో ప్రశాంతత నెలకొందని, మానసిక, శారీరిక స్వస్థత చేకూరుతున్నదని ఆ కుటుంబ సభ్యులందరూ చెబుతున్నారు. పైగా ప్రతిరోజూ దీని కారణంగా కుటుంబ సభ్యులందరం ఒక చోట చేరుతూ ఉండడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తూ ఉన్నదని కూడా వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని గ్రామాలలో అయితే కరోనా దృష్ట్యా ఉన్న అత్యవసర పరిస్థితి నేపథ్యంలో అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటూనే, తగిన సామాజిక దూరాన్ని పాటిస్తూ ఆయా వాడలలోని వారు తమ సమీప దేవాలయంలో అందరూ కలిసి ఈ నిత్య సాధనను కొనసాగిస్తున్నారు. ఈ ప్రేరణతో మరి కొన్ని గ్రామాలకు, మరికొన్ని కుటుంబాలకు ఈ కార్యక్రమం విస్తరించనున్నదని, ఈ “నిత్య సాధన” లాక్ డౌన్ పూర్తయ్యేంత వరకు కొనసాగుతుందని ఆంధ్రప్రదేశ్ ప్రాంత ధర్మజాగరణ ప్రముఖ్ శ్రీ తిరుపతయ్య తెలిపారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.