News

స్వామివారి భూములను ఎట్టి పరిస్థితుల్లోనూ అమ్మబోయేది లేదు – తితిదే చైర్మన్

790views

తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ఆస్తులు, భక్తులు స్వామివారికి సమర్పించుకున్న కానుకలను ఎట్టిపరిస్థితుల్లోనూ అమ్మబోయేది లేదని తితిదే ఛైర్మన్‌ వై.వి.సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు తితిదే పాలకమండలిలో తీర్మానించినట్లు తెలిపారు. తిరుమలలో ఆయన మీడియాతో మాట్లాడారు. తితిదే ఆస్తుల విక్రయాన్ని పూర్తిగా నిషేధించాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. తితిదే ఆస్తులు విక్రయిస్తున్నారనే దుష్ప్రచారంపై సమగ్ర విచారణ జరిపించాలని.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరినట్లు పేర్కొన్నారు.

భవిష్యత్తులో తితిదే పాలకమండలిపై ఇలాంటి ఆరోపణలు రాకుండా ఉండాలంటే సమగ్ర విచారణ జరిపించాల్సిందేనని బోర్డు తీర్మానించిందని.. ఈ మేరకు ప్రభుత్వాన్ని కోరనున్నట్లు చెప్పారు. అలాగే తితిదే పరిధిలోని అతిథి గృహాలను నిబంధనలకు విరుద్ధంగా ఎవరికీ కేటాయించలేదని స్పష్టం చేశారు. అతిథిగృహాల కేటాయింపులో పారదర్శకత ఉండాలని బోర్డు తీర్మానించినట్లు వివరించారు. ఈ మేరకు మార్గదర్శకాలు రూపొందించాలని తితిదే అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. డొనేషన్‌ స్కీమ్‌లోనూ అర్హులకే అతిథి గృహాలు ఇచ్చేలా మార్గదర్శకాలను రూపొందించనున్నట్లు వెల్లడించారు.

లాక్‌డౌన్‌ తర్వాతే దర్శనాలు..

లాక్‌డౌన్‌ నిబంధనలు సడలించాకే స్వామివారి దర్శనాన్ని కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వై.వి.సుబ్బారెడ్డి తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వం అనుమతి తీసుకొని ఏర్పాట్లు చేస్తామన్నారు. భౌతికదూరం పాటించి దర్శనాలకు అనుమతి ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు సుబ్బారెడ్డి తెలిపారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.