
వలస కూలీల తరలింపులో కొన్ని అనుకోని సంఘటనలు జరిగిన మాట వాస్తవమే అయినప్పటికీ వాటిని పదే పదే చూపిస్తున్నారని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ధర్మాసనం ముందు తన వాదనలు వినిపించారు. ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తున్నాయని, సగటున రోజుకు 187 రైళ్ల ద్వారా 50 లక్షల మందిని, రోడ్డు మార్గంలో మరో 47 లక్షల మందిని తరలించామని చెప్పారు. రవాణా ఖర్చుల విషయంలో రైల్వే ఛార్జీలను రాష్ట్రాలు భరించాయని, కొన్ని సందర్భాల్లో రీయింబర్స్ చేసినట్లు తెలిపారు. రైళ్లలో ఉచితంగా భోజనం అందించామని చెప్పారు. స్క్రీనింగ్ నిర్వహించి క్వారంటైన్‌కు, అక్కడి నుంచి వారి స్వస్థలాలకు పంపించామని తెలిపారు. మొత్తం వలస కార్మికుల తరలింపునకు ఎంత సమయం పడుతుందదని ఎస్‌జీని ధర్మాసనం ప్రశ్నించగా.. రాష్ట్రాలు నివేదిక సమర్పించాక అవగాహన వస్తుందని చెప్పారు. ఈ సందర్భంగా ఈ వ్యవహారంపై కోర్టు జోక్యం కోరిన వారిపై ఎస్‌జీ కీలక వ్యాఖ్యలు చేశారు. సోషల్‌మీడియాలో పోస్టులు, ఇంటర్వ్యూలు ఇవ్వడం తప్ప వీళ్లేం చేశారని, రాజకీయాలకు కోర్టులను వేదిక చేసుకోవడం తగదన్నారు. ఎవరు ఏ ఉద్దేశంతో ఆశ్రయించినా కోర్టు మాత్రం విచక్షణ మేరకే నడుచుకుంటుందని ధర్మాసనం స్పష్టంచేసింది.
వలసకూలీలకు వసతులు కల్పించండి : కేంద్ర, రాష్ట్రాలకు సుప్రీం ఆదేశం :
లాక్‌డౌన్ వేళ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వలస కూలీల అంశంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. వలస కూలీలప్రయాణానికి సంబంధించి ఎలాంటి రవాణా ఛార్జీలూ వసూలు చేయకూడదని పేర్కొంది. వారిని గుర్తించి, సదుపాయాలు కల్పించాలని రాష్ట్రాలకు సూచించింది. ఈ మేరకు జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎస్‌కే కౌల్, జస్టిస్ ఎంఆర్ షాతో కూడిన త్రిసభ్య దర్మాసనం కేసును సుమోటోగా తీసుకుని విచారణ జరిపింది. వలస కూలీల అంశంపై ఈ సందర్భంగా కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ప్రాథమిక నివేదికను కోర్టుకు సమర్పించారు. అన్ని రాష్ట్రాలు కూడా అఫిడవిట్ దాఖలు చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది.
వలస కూలీల అంశంపై రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు చర్యలు తీసుకుంటున్నప్పటికీ అనేక లోపాలు తమ దృష్టికి వచ్చాయని ధర్మాసనం పేర్కొంది. రవాణా కోసం రిజిస్ట్రేషన్, భోజన సదుపాయం, రైళ్ల కోసం ఎదురు చూపులు చూడడం వంటి సమస్యలు గుర్తించామంది. వారి కష్టాలు చూసి కొన్ని మధ్యంతర ఆదేశాలు ఇస్తున్నామని తెలిపింది. వలస కూలీల నుంచి బస్సు, రైలు ప్రయాణానికి ఎలాంటి ఖర్చులూ వసూలు చేయకూడదని సుప్రీం కోర్టు ఆదేశించింది. వారిని గుర్తించడం, వారికి సదుపాయాలు కల్పించడం రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత అని స్పష్టంచేసింది.
రైలు ఎక్కే వరకు అక్కడి రాష్ట్రం, ఎక్కిన తర్వాత రైల్వే శాఖ, చేరుకున్న తర్వాత అక్కడి రాష్ట్ర ప్రభుత్వం వలస కూలీలకు భోజన సదుపాయం కల్పించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. వలస కూలీల నమోదు చర్యను వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. సహాయ కేంద్రాల ద్వారా త్వరగా స్వస్థలాలకు వెళ్లే రవాణా సదుపాయం కల్పించాలంది. ఈ విషయాలు వలస కూలీలకు చేరేలా ప్రచారం చేయాలని సూచించింది. నడిచి వెళ్తున్న కూలీలు కనిపిస్తే వెంటనే వారిని శిబిరాలకు తరలించి సదుపాయాలు కల్పించాలని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వాలు రైళ్ల ఏర్పాటు కోసం వినతి పెడితే రైల్వే శాఖ ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు తన ఆదేశాల్లో పేర్కొంది. ఎంత మంది కూలీలు స్వస్థలాలకు వెళ్లేందుకు ఎదురు చూస్తున్నారు? వారి రవాణా ప్రణాళిక, రిజిస్ట్రేషన్ విధానాలతో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు శుక్రవారం నాటికి అఫిడవిట్ దాఖలు చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను జూన్ 5కు వాయిదా వేసింది.





