News

కేదార్‌నాథ్ యాత్రలో పర్యావరణ పరిరక్షణపై ఆందోళన

35views

ఉత్తరాఖండ్‌లోని పవిత్ర పుణ్యక్షేత్రం కేదార్‌నాథ్‌లో ఈ ఏడాది భక్తుల రాక సరికొత్త రికార్డు సృష్టించింది. అదే సమయంలో యాత్రికుల సంఖ్య పెరగడంతో పర్యావరణంపై వ్యర్థాల భారం కూడా భారీగా పెరిగింది. ఈ ఏడాది ఏకంగా 19.33 లక్షల మంది భక్తులు కేదార్‌నాథ్‌ క్షేత్రాన్ని దర్శించుకోగా, వారి రాకతో మొత్తం 73 టన్నుల చెత్త పేరుకుపోయింది. గత ఏడాదితో పోలిస్తే ఇది 3.4 రెట్లు అధికం కావడం పర్యావరణ ప్రేమికులను ఆందోళనకు గురిచేస్తోంది.

బదరీనాథ్ ఆలయ ద్వారాలను శీతాకాలం నేపథ్యంలో సోమవారం మూసివేయడంతో ఈ ఏడాది చార్‌ధామ్ యాత్ర ముగిసింది. ఈ సందర్భంగా కేదార్‌నాథ్‌లో పేరుకుపోయిన వ్యర్థాల వివరాలు వెలుగులోకి వచ్చాయి.

కేదార్‌నాథ్ నగర పంచాయతీ గణాంకాల ప్రకారం.. మొత్తం 73 టన్నుల వ్యర్థాల్లో 51.5 టన్నులు పొడి చెత్త కాగా, మరో 22 టన్నులు సేంద్రియ వ్యర్థాలు ఉన్నాయి. గత సంవత్సరాలతో పోలిస్తే ఈసారి చెత్త పరిమాణం గణనీయంగా పెరిగింది.

– 2026: 73 టన్నులు
– 2025: 21.40 టన్నులు
– 2024: 26.10 టన్నులు
– 2023: 32.58 టన్నులు

ప్లాస్టిక్ బాటిళ్లు, చిప్స్ ప్యాకెట్లు, ఇన్‌స్టంట్ నూడుల్స్ కవర్లు, కార్డ్‌బోర్డులు, టెట్రా ప్యాకులు పొడి వ్యర్థాల్లో ప్రధానంగా ఉన్నాయి.

సేకరించిన సేంద్రియ వ్యర్థాలను ల్యాండ్‌ఫిల్ ప్రాంతానికి తరలిస్తుండగా, పొడి చెత్తను బేలింగ్ యంత్రాల ద్వారా కుదించి ప్యాకెట్లుగా తయారు చేస్తున్నారు. అనంతరం వాటిని సోన్‌ప్రయాగ్‌కు తరలించి రీసైక్లింగ్ కోసం పంపిస్తున్నారు.

ప్రస్తుతం కేదార్‌నాథ్‌లో ఒక వేస్ట్ బేలర్ యంత్రం అందుబాటులో ఉంది. వచ్చే ఏడాది యాత్ర ప్రారంభమయ్యేలోగా మరో యంత్రాన్ని ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. అక్కడ ప్రస్తుతం 30 వేల చదరపు అడుగుల సామర్థ్యమున్న ల్యాండ్‌ఫిల్ ప్రాంతం ఉండగా, అందులో 28 వేల చదరపు అడుగులు ఖాళీగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. గత ఐదేళ్లలో నాలుగు ల్యాండ్‌ఫిల్ ప్రాంతాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

చెత్త సేకరణలో భక్తుల భాగస్వామ్యం
మరోవైపు యాత్రికుల్లో పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంచేందుకు అధికారులు చేపట్టిన కార్యక్రమం కొంతమేర సత్ఫలితాలను ఇచ్చింది. ఈ ఏడాది సేకరించిన చెత్తలో 14 టన్నులను భక్తులే స్వచ్ఛందంగా సేకరణ కేంద్రాలకు తీసుకొచ్చారు. ఈ కార్యక్రమంలో సుమారు 6 వేల మంది యాత్రికులు పాల్గొన్నారు.

జూన్ 1న ప్రారంభమైన ఈ కార్యక్రమంలో భాగంగా భక్తులు ఒకటి నుంచి ఐదు కిలోల వరకు చెత్తను సేకరించి, ఆలయానికి 1.5 కిలోమీటర్ల దిగువన ఏర్పాటు చేసిన సేకరణ కేంద్రాలకు అందించారు.