
గోవుల సంరక్షణకు సంబంధించి ప్రభుత్వం స్పష్టమైన లిఖితపూర్వక హామీ ఇచ్చి, అధికారిక ప్రకటన చేసే వరకు తమ పోరాటం కొనసాగుతుందని యుగతులసి ఫౌండేషన్ ఛైర్మన్ కె. శివకుమార్ స్పష్టం చేశారు. గోమాత సంరక్షణ, గోవధ నివారణతో పాటు ఇతర డిమాండ్ల సాధన కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధమని ఆయన పేర్కొన్నారు.
యుగతులసి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంగళవారం రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం కొత్తగూడెం సమీపంలోని జాతీయ రహదారి 65పై ‘గో సడక్ బంద్’కు కె. శివకుమార్ పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమై నిరసన కార్యక్రమాన్ని అడ్డుకున్నారు. జాఫర్‌గూడ నుంచి ప్రదర్శనగా బయలుదేరేందుకు సిద్ధమైన శివకుమార్‌ను పోలీసులు నిలువరించారు.
అనంతరం మహేశ్వరం డీసీపీ నారాయణరెడ్డి, రంగారెడ్డి జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి అంకమరాజు తదితర అధికారులు శివకుమార్‌తో చర్చలు జరిపారు. గోవుల సంరక్షణతో పాటు ఫౌండేషన్ లేవనెత్తిన ఇతర డిమాండ్లను రంగారెడ్డి జిల్లా కలెక్టర్, రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి, అవసరమైన చర్యలు తీసుకునేలా చూస్తామని డీసీపీ హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా కె. శివకుమార్ మాట్లాడుతూ.. గోవుల సంరక్షణ అనేది కేవలం ఒక సంస్థకు సంబంధించిన అంశం కాదని, భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, ధార్మిక విశ్వాసాలతో ముడిపడిన విషయమని పేర్కొన్నారు. గోమాతను పూజించే దేశంలో గోవుల రక్షణకు ప్రభుత్వం మరింత బాధ్యతతో వ్యవహరించాలని కోరారు. తమ నిరసన శాంతియుతంగా జరుగుతున్నప్పటికీ పోలీసులు అడ్డుకోవడం సమంజసం కాదని అన్నారు.
ప్రభుత్వం తమ డిమాండ్లపై స్పష్టమైన నిర్ణయం తీసుకుని లిఖితపూర్వక హామీ ఇచ్చే వరకు గోవుల సంరక్షణ కోసం తమ ఉద్యమం కొనసాగుతుందని కె. శివకుమార్ స్పష్టం చేశారు.





