ArticlesNews

తెలుగువాడి పౌరుష ప్రతీక, సాహస పతాక టంగుటూరి ప్రకాశం పంతులు

8views

( ఆగస్టు 23 – టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి )

తెల్లవాడి తుపాకిగుండుకు గుండెను ఎదురొడ్డిన ధీరోదాత్తుడు టంగుటూరి ప్రకాశం పంతులు. ఆర్థికంగా గడ్డు పరిస్థితుల్లో పుట్టిపెరిగి, ధారాళంగా డబ్బులు సంపాదించి, వాటిని దేశసేవ కోసమే ఖర్చుపెట్టి, ఆంధ్రరాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రిగా వ్యవహరించి, చివరివరకూ దేశం కోసమే బతికిన మహనీయుడు ఆయన. తన ధైర్యంతోనే చరిత్రగా మారి, ఆంధ్రకేసరిగా నిలిచిన నాయకుడు టంగుటూరి ప్రకాశం పంతులు.

1872 ఆగస్టు 23న ఇప్పటి ప్రకాశం జిల్లా వినోదరాయునిపాలెం గ్రామంలో జన్మించిన ప్రకాశం పంతులు బాల్యం ఆర్థిక ఇబ్బందుల మధ్య సాగింది. తల్లి కష్టపడి పూటకూళ్ళ ఇల్లు నడుపుతూ పాఠశాలకు పంపించింది. తర్వాత గురువు ఇమ్మానేని హనుమంతరాయుడు ప్రకాశాన్ని తనతోపాటు రాజమండ్రి తీసుకువెళ్ళి చదివించారు. ఆయనే మద్రాసులో న్యాయవిద్య కూడా చదివించారు. పెండ్లి అయిన తర్వాత ప్రకాశం కొంతకాలం ఒంగోలు, రాజమండ్రిల్లో న్యాయవాదిగా పనిచేసారు. రాజమండ్రిలో పురపాలక సంఘానికి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు కూడా. 1904లో ఇంగ్లండ్ వెళ్ళి బారిస్టర్ విద్య అభ్యసించారు. అప్పుడే జాతీయవాద భావాలు పెరిగాయి.

1907లో స్వదేశానికి తిరిగి వచ్చిన ప్రకాశం, మదరాసు హైకోర్టులో ప్రాక్టీస్ చేపట్టారు. ఆ సమయంలోనే బిపిన్ చంద్రపాల్ ఉపన్యాసాలు విని దేశసేవనే మార్గం చేసుకోవాలని భావించారు. 1921లో ప్రత్యక్షంగా స్వాతంత్ర్య సంగ్రామంలోకి అడుగుపెట్టారు. అప్పుడే ఇంగ్లీషు, తెలుగు, తమిళ భాషల్లో స్వరాజ్య పత్రిక నడిపారు. జాతీయ పాఠశాలను, ఖాదీ ఉత్పత్తి కేంద్రాన్నీ కూడా నిర్వహించారు. 1921 డిసెంబర్‌లో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. పంజాబ్, ముల్తాన్, కేరళ వంటి చోట్ల అలజడులు, కల్లోలాలూ జరిగినప్పుడు పర్యటించి అల్లర్లను తగ్గించే ప్రయత్నాలు చేసారు.

1928లో సైమన్ కమిషన్ వ్యతిరేక ఉద్యమం ప్రకాశం ధైర్యసాహసాలకు నిదర్శనం. బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశ భవిష్యత్తుపై నిర్ణయాలు తీసుకునేందుకు నియమించిన సైమన్ కమిషన్‌లో ఒక్క భారతీయుడికీ స్థానం లేకపోవడం దేశవ్యాప్తంగా ఆగ్రహాన్ని రేకెత్తించింది. మద్రాసులో జరిగిన నిరసనలో బ్రిటిష్ పోలీసులు కాల్పులకు సిద్ధమయ్యారు. ఆ సమయంలో ప్రకాశం పంతులు తుపాకీకి ఎదురొడ్డి ఛాతీని చూపించారు. ఆ సాహసమే ఆయనకు ఆంధ్రకేసరి బిరుదు తెచ్చిపెట్టింది. ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీకగా ఆ సంఘటన నిలిచిపోయింది.

స్వతంత్ర సమరంలో భాగంగా ప్రకాశం సహాయ నిరాకరణోద్యమం, ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. మరోవైపు మద్రాస్ ప్రెసిడెన్సీ రాజకీయాల్లోనూ కీలక పాత్ర పోషించారు. 1937లో రాజాజీ మంత్రివర్గంలో రెవెన్యూ మంత్రిగా పనిచేసారు. 1946లో మదరాసు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎన్నికై 13నెలలు ఆ పదవిలో కొనసాగారు. 1952లో కాంగ్రెస్ నుంచి బైటకు వచ్చి ప్రజాపార్టీ స్థాపించారు. 1953లో ప్రత్యేక ఆంధ్రరాష్ట్రం ఏర్పడినప్పుడు దానికి మొదటి ముఖ్యమంత్రి ప్రకాశం పంతులుగారే. తిరుపతి శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం స్థాపన, సేద్యపు నీటి ప్రాజెక్టుల నిర్మాణం, విజయవాడ దగ్గర కృష్ణానదిపై బ్యారేజీ నిర్మాణం ఆయన కృషి ఫలితాలే. కమ్యూనిస్టుల మద్దతు ఉపసంహరణతో ఆయన ప్రభుత్వం 14 నెలలకే పతనమైంది.

ప్రకాశం పంతులుగారు 1957 మే 20న తుదిశ్వాస విడిచారు. ఆయన జ్ఞాపకార్థం 1972లో ఆంధ్రప్రదేశ్‌లో ప్రకాశం జిల్లా ఏర్పాటయింది. ఆయన ధైర్యసాహసాలు ఆంధ్రులకే కాదు, భారతీయులందరికీ చిరస్మరణీయాలు.