News

ఏనుగులను దైవత్వానికి ప్రతీకలుగా చూడాలి.. ఆరోగ్యం, సంరక్షణకు ప్రాధాన్యం: సుప్రీంకోర్టు

69views

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా వ్యక్తులు, ఆలయాలు, అటవీశాఖ, జంతు ప్రదర్శనశాలలు, పునరావాస కేంద్రాల ఆధీనంలో ఉన్న ఏనుగులను దైవత్వానికి ప్రతీకలుగా భావించి ఆదరించాలని సుప్రీంకోర్టు పేర్కొంది. వాటి ఆరోగ్య పర్యవేక్షణ, సంరక్షణకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది.

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ జోయ్మల్య బాగ్చి, జస్టిస్‌ వి. మెహనతో కూడిన ధర్మాసనం మంగళవారం ఓ స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది.

మతపరమైన హక్కులపై జోక్యం చేసుకోవడం లేదు
ఆలయాల్లో ఏనుగులను ఉంచవచ్చా? వాటికి సంబంధించిన మతపరమైన హక్కులు ఏమిటి? అనే అంశాలపై తాము నిర్ణయం ఇవ్వడం లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. ఏనుగులను ఎక్కడ ఉంచినా వాటి సంక్షేమం, ఆరోగ్యం, సరైన సంరక్షణే తమ ప్రధాన ఉద్దేశమని పేర్కొంది.

ప్రత్యేక సదుపాయాలతో కూడిన గజ వైద్యశాలల (ఏనుగు ఆసుపత్రుల) ఏర్పాటుకు సంబంధించి రాష్ట్రాలకు మార్గదర్శకాలు జారీ చేసేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ధర్మాసనం కోరింది.

దేశంలో 2,725 ఏనుగులు
దేశవ్యాప్తంగా వివిధ వ్యక్తులు, సంస్థల సంరక్షణలో మొత్తం 2,725 ఏనుగులు ఉన్నట్లు అదనపు సొలిసిటర్‌ జనరల్‌ ఐశ్వర్య భాటి కోర్టుకు తెలిపారు. క్యాప్టివ్‌ ఎలిఫెంట్స్‌ హెల్త్‌ కేర్‌ అండ్‌ వెల్ఫేర్‌ కమిటీ ఫిబ్రవరిలో వెల్లడించిన వివరాలను ఆమె కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.

2019 నుంచి సుమారు 300 వన్య ఏనుగులను పెంపుడు ఏనుగులుగా మార్చగా, వాటిలో దాదాపు 200 ఏనుగులు మృతి చెందినట్లు పిటిషన్‌ దాఖలు చేసిన వైల్డ్‌లైఫ్‌ రెస్క్యూ అండ్‌ రిహాబిలిటేషన్‌ సెంటర్‌ అనే స్వచ్ఛంద సంస్థ కోర్టుకు తెలిపింది.

ఏనుగుల స్థితిగతులపై సమగ్ర నివేదిక
ఏనుగులను కేవలం వన్యప్రాణులుగానే ఉంచాలని, వ్యక్తులు లేదా సంస్థల ఆధీనంలోకి తీసుకెళ్లకుండా చూడాలని పిటిషనర్‌ చేసిన విజ్ఞప్తిని ధర్మాసనం తిరస్కరించింది.

అయితే, వ్యక్తులు, సంస్థల ఆధీనంలో ఉన్న ఏనుగుల ప్రస్తుత పరిస్థితి, వాటి ఆరోగ్యం, సంరక్షణ తదితర అంశాలపై సమగ్ర నివేదికను సమర్పించాలని కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వశాఖను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఏనుగుల పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించి, వాటి సంక్షేమానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించింది.