News

భారత్‌కు దీర్ఘకాలంలో చైనాతోనే ప్రధాన పోటీ: జనరల్ నరవణే

23views

న్యూఢిల్లీ: భారత్‌కు భవిష్యత్తులో చైనాతోనే ప్రధాన పోటీ ఉంటుందని ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ మనోజ్ నరవణే అభిప్రాయపడ్డారు. పాకిస్థాన్‌ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఆ దేశంపై దృష్టి పెట్టాల్సి వస్తోందని, అయితే దీర్ఘకాలంలో చైనానే భారత్‌కు ప్రధాన పోటీదారుగా ఉంటుందని పేర్కొన్నారు.

తాను రచించిన ‘ది క్యూరియస్ అండ్ క్లాసిఫైడ్: అన్‌ఎర్తింగ్ మిలిటరీ మిథ్స్ అండ్ మిస్టరీస్’ పుస్తకాన్ని విడుదల చేసిన సందర్భంగా నరవణే ఈ వ్యాఖ్యలు చేశారు. 2019 నుంచి 2022 వరకు ఆయన భారత ఆర్మీ చీఫ్‌గా సేవలందించారు.

పాకిస్థాన్‌, చైనాలతో భారత్‌ ఎదుర్కొంటున్న సవాళ్లు భిన్నమైనవని నరవణే తెలిపారు. భారత్‌-పాకిస్థాన్‌ మధ్య నాలుగు యుద్ధాలు జరిగాయని, పాక్‌ ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్నందున ఆ దేశంపై దృష్టి సారించాల్సి వస్తోందన్నారు. అదే సమయంలో చైనాను శత్రువుగా కాకుండా పోటీదారుగా చూడాల్సిన అవసరం ఉందని చెప్పారు.

చైనాతో పోటీ కేవలం సైనిక రంగానికే పరిమితం కాదని, రాజకీయాలు, ఆర్థిక వ్యవస్థ, వాణిజ్యం తదితర రంగాల్లోనూ ఇరు దేశాల మధ్య పోటీ కొనసాగుతుందని నరవణే పేర్కొన్నారు.

పోటీ ఉన్న చోట ఎంతో కొంత ఘర్షణకు అవకాశం ఉంటుందని, అయితే విభేదాలను ముందుగా దౌత్యం, చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలని సూచించారు. మరో మార్గం లేని పరిస్థితుల్లోనే బలప్రయోగానికి దిగాలని అన్నారు. ప్రత్యర్థి వెనకడుగు వేసేలా అవసరమైన సైనిక సామర్థ్యాలను భారత్‌ పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు.

భౌగోళిక రాజకీయాల్లోనైనా, వ్యక్తిగత జీవితంలోనైనా ఇరుగుపొరుగుగా ఎవరుంటారో నిర్ణయించలేమని, అందుబాటులో ఉన్న అవకాశాలను భారత్‌ పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని జనరల్ నరవణే సూచించారు.