News

బొద్దింకల్ని తరిమికొట్టిన ప్రజలు.. పాకిస్తానీలు, నక్సల్స్ అంటూ నినాదాలు..

23views

జైపూర్‌: రాజస్థాన్‌ రాజధాని జైపూర్‌లో ప్రభుత్వ పాఠశాల తనిఖీకి వెళ్లిన సీజేపీ (CJP) బృందానికి చేదు అనుభవం ఎదురైంది. పాఠశాలను పరిశీలించేందుకు వెళ్లిన బృందాన్ని కొందరు అడ్డుకోవడంతో వివాదం చెలరేగింది. మాటామాటా పెరగడంతో దాడి జరిగిందని సీజేపీ ఆరోపించింది. అనంతరం వాహనంలో తిరిగి వెళ్తున్న సమయంలో రాళ్లు రువ్వి వాహనాన్ని ధ్వంసం చేశారని పేర్కొంది. ఈ ఘటనపై అధికార, ప్రతిపక్షాల మధ్య రాజకీయ విమర్శలు తీవ్రతరమయ్యాయి.

సీజేపీ దేశవ్యాప్తంగా ‘స్కూల్‌ ఠీక్‌ కరో’ పేరుతో ఉద్యమాన్ని నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా జైపూర్‌ రాంపురా–కన్వర్‌పురా గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల పరిస్థితులను పరిశీలించేందుకు ఆ సంస్థ ప్రతినిధులు వెళ్లారు. పాఠశాలలో కొంతకాలంగా పశువుల పాక నిర్వహిస్తున్నారన్నది సీజేపీ ప్రధాన ఆరోపణ. విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు, పాఠశాలలో మౌలిక వసతులు, బోధనా పరిస్థితులను పరిశీలించడమే తమ ఉద్దేశమని సంస్థ తెలిపింది. సీజేపీ కో-కన్వీనర్‌ అశుతోష్‌ రాంకా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉంది.

అయితే బృందాన్ని కొందరు అడ్డుకుని అక్కడి నుంచి వెళ్లిపోవాలని హెచ్చరించారని సీజేపీ నేతలు తెలిపారు. అనంతరం ఘర్షణ చోటుచేసుకుందని, తమపై దాడి చేశారని ఆరోపించారు. ఈ ఘటనపై అశుతోష్‌ రాంకా స్పందిస్తూ.. తమను అడ్డుకున్నవారు గ్రామస్థులు కాదని, బీజేపీ పంపిన వ్యక్తులని ఆరోపించారు.

ప్రభుత్వ పాఠశాలల్లోని సమస్యలను వెలుగులోకి తీసుకురావడానికే తాము తనిఖీలు నిర్వహిస్తున్నామని సీజేపీ నేతలు చెప్పారు. రాజకీయ ఒత్తిళ్లతో తమ కార్యక్రమాలను అడ్డుకుంటున్నారని ఆరోపించారు. సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్‌ దీప్కే కూడా తమ కార్యకర్తలను లక్ష్యంగా చేసుకున్నారని విమర్శించారు.

స్థానికుల వాదన మరోలా..
అయితే సీజేపీ ఆరోపణలను స్థానికుల్లో కొందరు ఖండించారు. పాఠశాలను కూల్చివేసే ప్రయత్నం జరుగుతోందన్న అనుమానంతోనే తాము వ్యతిరేకించామని తెలిపారు. పాఠశాలలో 20 నుంచి 25 మంది విద్యార్థులు చదువుతున్నారని, మరమ్మతుల కోసం రూ.12 లక్షల నిధులు కూడా మంజూరయ్యాయని చెప్పారు.

గ్రామ సమస్యలను రాజకీయంగా మార్చడం తమకు ఇష్టం లేదని స్థానికులు పేర్కొన్నారు. నిరసన పేరుతో పాఠశాలకు నష్టం కలిగే అవకాశం ఉందనే ఉద్దేశంతోనే దాన్ని రక్షించేందుకు తాము నిలబడ్డామని తెలిపారు. సీజేపీ బృందంపై తాము దాడి చేశామన్న ఆరోపణల్లో వాస్తవం లేదని స్పష్టం చేశారు.

పాఠశాలల తనిఖీలపై కొత్త నిబంధనలు
ఈ వివాదానికి కొద్ది రోజుల ముందే రాజస్థాన్‌లోని బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లోకి బయటి వ్యక్తుల ప్రవేశంపై కొత్త నిబంధనలు అమలు చేసింది. పాఠశాలను సందర్శించాలంటే ప్రధానోపాధ్యాయుడి ముందస్తు అనుమతి తప్పనిసరి చేసింది. ఫొటోలు, వీడియోలు తీసేందుకు కూడా రాతపూర్వక అనుమతి తీసుకోవాలని ఆదేశించింది.

విద్యార్థుల భద్రత, గోప్యత, గౌరవాన్ని కాపాడేందుకే ఈ నిబంధనలు తీసుకొచ్చినట్లు ప్రభుత్వం వెల్లడించింది. అనధికారికంగా ఎవరూ పాఠశాల ప్రాంగణాల్లోకి ప్రవేశించకుండా చర్యలు తీసుకున్నట్లు తెలిపింది.