News

భారతీయులకు రూమ్‌.. పాక్‌ ఎంపీకి నో ఎంట్రీ.. యూఏఈలో షాకింగ్‌ ఘటన

2views

అంతర్జాతీయ వేదికపై పాకిస్థాన్‌ పరపతిపై మరోసారి చర్చ మొదలైంది. యూఏఈలో విమానం రద్దు కావడంతో హోటల్‌ వసతి కోసం వెళ్లిన పాకిస్థానీ ప్రయాణికులకు అవమానకర అనుభవం ఎదురైందని ఆ దేశ మాజీ నేషనల్‌ అసెంబ్లీ స్పీకర్‌, ఎంపీ అసద్‌ ఖైసర్‌ ఆరోపించారు.

తమతో పాటు భారతీయులు, అమెరికా పాస్‌పోర్టు కలిగిన ప్రయాణికులకు మాత్రమే హోటల్‌లో వసతి కల్పించేందుకు అంగీకరించారని, పాకిస్థానీ ప్రయాణికుల పట్ల హోటల్‌ సిబ్బంది వివక్ష చూపారని ఖైసర్‌ పాక్‌ పార్లమెంట్‌లో ఆవేదన వ్యక్తం చేశారు.

తమకు సన్నిహిత ముస్లిం దేశంగా భావించే యూఏఈలోనే ఇలాంటి పరిస్థితి ఎదురవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ అంశాన్ని దౌత్య మార్గాల ద్వారా యూఏఈ ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని పాక్‌ విదేశాంగ శాఖను కోరారు.

యూఏఈ అభివృద్ధిలో పాకిస్థానీయుల పాత్రను గుర్తుచేసిన ఖైసర్‌.. ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయని పలువురు పాకిస్థానీయులు తనను కలిసి ఫిర్యాదు చేశారని తెలిపారు.

యూఏఈలో భారీ సంఖ్యలో పాకిస్థానీయులు నివసిస్తున్నప్పటికీ.. తమ దేశ పౌరులకు ఇలాంటి పరిస్థితి ఎదురవడంపై పాక్‌ ఎంపీ చేసిన ఆరోపణలు ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారాయి.