News

“రామ మందిర ప్రసాద్ ” అంటూ అమ్మకాలు.. అమెజాన్‌కు రూ. 1 లక్ష జరిమానా.!

18views

ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌కు కేంద్ర వినియోగదారుల రక్షణ సంస్థ (CCPA) భారీ షాక్ ఇచ్చింది. సాధారణ స్వీట్లను ‘శ్రీ రామ్ మందిర్ అయోధ్య ప్రసాద్’ పేరుతో తమ ప్లాట్‌ఫామ్‌పై విక్రయించేందుకు అనుమతించినందుకు అమెజాన్ సెల్లర్ సర్వీసెస్‌పై రూ.1 లక్ష జరిమానా విధించింది. ఎలాంటి అధికారిక అనుమతి లేకుండా సాధారణ స్వీట్లను రామ మందిర ప్రసాదంగా ప్రచారం చేయడం తప్పుదోవ పట్టించే ప్రకటనల కిందకు వస్తుందని CCPA స్పష్టం చేసింది.

2026 ఆగస్టు 4న జారీ చేసిన 19 పేజీల ఉత్తర్వుల్లో CCPA ఈ నిర్ణయం తీసుకుంది. అమెజాన్ ప్లాట్‌ఫామ్‌లో ‘శ్రీ రామ్ మందిర్ అయోధ్య ప్రసాద్’ పేరుతో సాధారణ స్వీట్లు విక్రయిస్తున్నట్లు గుర్తించిన బెంచ్.. రామ మందిర ట్రస్ట్ నుంచి ఎలాంటి అధికారిక అనుమతి లేకపోయినా ఇలాంటి ఉత్పత్తులను విక్రయానికి అనుమతించడాన్ని తప్పుబట్టింది. ‘శ్రీ రామ్ మందిర్ అయోధ్య ప్రసాద్’ అనే పదానికి హిందూ భక్తుల్లో ప్రత్యేకమైన అర్థం ఉందని CCPA పేర్కొంది. అయోధ్యలోని రామ మందిరంలో శ్రీరాముడికి సమర్పించి, ఆశీర్వదించిన పవిత్ర ఆహారాన్నే సాధారణంగా ప్రసాదంగా భావిస్తారని తెలిపింది. అలాంటి పదాన్ని ఎలాంటి అనుమతి లేకుండా సాధారణ మిఠాయిలకు ఉపయోగించడం తప్పుదోవ పట్టించే వాణిజ్య విధానమే కాకుండా కోట్లాది మంది వినియోగదారుల మతపరమైన భావాలను దెబ్బతీసే చర్యగా అభిప్రాయపడింది.