
79views
సంస్కృత భాష భారత దేశపు ఆత్మ అని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ సంఘచాలక్ మోహన్ భాగవత్ అన్నారు. సంస్కృతం అంటే కేవలం ఒక భాష మాత్రమే కాదని, భారత దేశపు సంస్కృతి, సంప్రదాయం అని అభివర్ణించారు. అలాగే ప్రపంచ దృక్పథానికి మూలస్తంభం అని కూడా అభివర్ణించారు.
న్యూఢిల్లీలోని DDU మార్గ్‌లో సంస్కృత భారతి కార్యాలయ ‘ప్రణవ’ ప్రారంభోత్సవం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మోహన్ భాగవత్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంస్కృతం తెలుసుకోవడం వల్ల భారత్ ను అర్థం చేసుకోగలుగుతామని అన్నారు. అక్షయ తృతీయ లాంటి పర్వదినం రోజున ఈ నూతన కార్యాలయ ప్రారంభోత్సవం జరిగిందని, అలాగే దానికి ‘‘ప్రణవ’’ అన్న పేరు పెట్టడం శుభపరిణామమని అన్నారు. అక్షయ తృతీయ నాడు ఏ కార్యం ప్రారంభించినా, చిరస్థాయిగా నిలిచి వుంటుందని, విజయవంతం అవుతుందన్న విశ్వాసం మన సంప్రదాయంలో వుందన్నారు.
సంస్కృత భాష అనేది భారత దేశానికి జీవశక్తి వంటిదని, ఎందుకంటే భావాలు, జీవన విధానం మరియు సంస్కృతికి సంబంధించిన అత్యంత ప్రాచీనమైన, సజీవ సంప్రదాయం నేటికీ దీని ద్వారానే కొనసాగుతోందని వివరించారు. సంస్కృతం కేవలం భాష మాత్రమే కాదని, భారత దేశపు సంస్కృతి సంప్రదాయమని, ప్రపంచ దృక్పథానికి అది మూలస్తంభం అన్నారు. భారత్ ను ఉన్నది ఉన్నట్లుగా అర్థం చేసుకోవాలంటే సంస్కృతాన్ని అర్థం చేసుకోవడం అత్యావశ్యకమని, ఎందుకంటే మన మేధో వారసత్వం, తత్వశాస్త్రం, జీవన విలువలు అన్నీ సంస్కృతంలోనే నిక్షిప్తమై వున్నాయని వివరించారు.
భారతీయ భాషలన్నింటినీ అనుసంధానించే ఏకీకృత వారధిగా సంస్కృతం నిలుస్తుందని, దీని మాధ్యమంగా ఇతర భాషలను కూడా సులభంగా నేర్చుకోవచ్చని అన్నారు. సంస్కృతంలో నిక్షిప్తమై వున్న అపారమైన జ్ఞాన మరియు విజ్ఞాన సంపద సమస్త మానవాళికి ప్రయోజనకరమైనది అని పేర్కొన్నారు. ఏ పనినైనా చేపట్టడానికి కేవలం ఆసక్తి మాత్రమే సరిపోదని, దానితో పాటు ఆ పని యొక్క లక్ష్యంపై స్పష్టమైన అవగాహన, ఓపిక మరియు పట్టుదల కూడా అత్యంత ఆవశ్యకమని నొక్కి చెప్పారు. మనిషిలోని శ్వాస ప్రక్రియ ఎన్నడూ విసుగు చెందకుండా నిరంతరాయంగా సాగినట్లే, సంస్కృత సేవా కూడా ఎన్నడూ అలసట చెందకుండా అవిచ్ఛిన్నంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
సంస్కృతంలో సంభాషించడమే పరిష్కారం…
సంస్కృతం అభ్యాసం కావాలంటే సంభాషణే ఏకైక మార్గం అని, అదే సరళమైన, సమర్థవంతమైన విధానం అని మోహన్ భాగవత్ సూచించారు. సంస్కృతాన్ని సంభాషించడం ద్వారానే దానిని ఆచరణలో పెట్టగలమని, ఈ విషయంలో సంస్కృత సంభాషణా శిబిరాలు అత్యంత ప్రయోజనకరంగా వుంటాయన్నారు. అతి తక్కువ సమయంలోనే ఆ భాషలో ప్రావీణ్యం సంపాదించడానికి వీలు కల్పిస్తాయని శిబిరాల ప్రాముఖ్యతను ఈ సందర్భంగా వివరించారు.
మనం సంస్కృతానికి తిరిగి వైభవాన్ని తీసుకురావాలనుకుంటే, దానిని ప్రజల భాషగా తీర్చిదిద్దాలని సూచించారు. భారతదేశాన్ని అర్థం చేసుకోవడానికి సంస్కృతం అనివార్యమని, అన్ని భాషలను కలుపుకుంటూ ముందుకు సాగడమే ‘సంస్కృత భారతి’ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.సంస్కృత మాధ్యమం ద్వారా ఇతర భారతీయ భాషలు మరింత సుసంపన్నమవుతాయి, అలాగే సమాజంలో సాంస్కృతిక ఐకమత్య భావన పెంపొందుతుందని అన్నారు.





