ArticlesNews

వయసుకు మించిన సాహసంతో తెల్లదొరతనాన్ని భయపెట్టిన వీరుడు

8views

( 1908 ఆగస్టు 11 – ఖుదీరామ్ బోస్ వర్ధంతి )

భారత స్వాతంత్ర్య సంగ్రామంలో ఎంతోమంది యువకులు చిన్నవయసులోనే తమ ప్రాణాలు బలిపెట్టారు. అటువంటివారిలో ప్రముఖుడు ఖుదీరామ్ బోస్. భారతీయులకు అన్యాయం చేయడమే వృత్తిగా స్వీకరించిన న్యాయమూర్తిని మట్టుపెట్టే ప్రయత్నంలో ఖుదీరామ్‌ బోస్ ఉరికంబం ఎక్కాడు. 19ఏళ్ళయినా నిండకముందే దేశమాత కోసం చిరునవ్వుతో ప్రాణాన్ని తృణప్రాయంగా వదిలిపెట్టేసాడు.

ముజఫర్‌పూర్ న్యాయమూర్తి కింగ్స్‌ఫోర్డ్‌ భారతీయుల పట్ల క్రూరంగా వ్యవహరించేవాడు. చిన్న నేరాలకు సైతం పెద్ద శిక్షలు విధిస్తూండేవాడు. ఇక తెల్ల దొరతనాన్ని ఎదిరించేవారిని దారుణంగా శిక్షించేవాడు. విప్లవకారులు అతని పని పట్టాలని భావించారు.

కోల్‌కతాలో విప్లవకారుల సమావేశంలో కింగ్స్‌ఫోర్డ్ మీద దాడికి నిర్ణయం జరిగింది. ఆ సమావేశానికి హాజరైన ఖుదీరామ్ బోస్, ఆ దాడి తానే చేస్తానని పట్టుపట్టాడు. విప్లవ నాయకత్వం ఖుదీరామ్ బోస్‌, ప్రఫుల్ల కుమార్ చాకీలకు ఆ బాధ్యత ఇచ్చింది. ఇద్దరూ యువకులే. ఖుదీరామ్ బోస్ అయితే 18ఏళ్ళ కుర్రవాడే.

దాడి ప్రణాళిక సిద్ధమైంది. యువకులు ఇద్దరికీ ఒక బాంబు, మూడు పిస్తోళ్ళు, 40 తూటాలూ ఇచ్చారు. వారిద్దరూ ముజఫర్‌పూర్ చేరుకుని ఒక ధర్మసత్రంలో బసచేసారు. కొన్నిరోజుల పాటు కింగ్స్‌ఫోర్డ్ రోజువారీ కార్యక్రమాలను పరిశీలించారు. అతని రాకపోకల వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నారు. భారీ భద్రత వల్ల అతన్ని చంపడం కష్టమైన పని అని వారికి అర్ధమైంది.

ఖుదీరామ్ బోస్, ప్రఫుల్ల చాకీ తెలుసుకున్న విషయం ఏంటంటే కింగ్స్‌ఫోర్డ్ ప్రతీ సాయంత్రం ఒక ఎర్ర బగ్గీలో క్లబ్బుకు వెడతాడు. ఆ సమయంలో అతన్ని చంపాలని వారు నిర్ణయం తీసుకున్నారు. వారు 1908 ఏప్రిల్ 30న క్లబ్బు దగ్గర పొదల్లో దాగి ఉన్నారు. క్లబ్బులో వేడుకలు ముగిసాక జనాలు వెనక్కు వెడుతున్నారు. ఆ సమయంలో, ఒక ఎర్ర బగ్గీ క్లబ్బు బైటకు వచ్చింది. దాన్ని చూసిన విప్లవకారుల కళ్ళు మెరిసాయి. వారు వెనుక నుంచి బగ్గీలోకి చేరుకున్నారు. జాగ్రత్తగా బగ్గీ తెర తొలగించి, లోపల బాంబు పెట్టారు. అక్కడినుంచి వెళ్ళిపోయారు.

దురదృష్టవశాత్తు, ఆరోజు కింగ్స్‌ఫోర్డ్ ఆరోజు క్లబ్బుకు వెళ్ళలేదు. ఇద్దరు ఇంగ్లీషు మహిళలు ఆ బగ్గీలో తమ ఇంటికి వెడుతున్నారు. దురదృష్టవశాత్తు ఆ మహిళలిద్దరూ బాంబుపేలుడులో ప్రాణాలు కోల్పోయారు. ఆగ్రహోదగ్దులైన పోలీసులు, నిందితుల కోసం గాలింపు ముమ్మరం చేసారు. దాంతో ఖుదీరామ్ బోస్, ప్రఫుల్ల చాకీ ఆ రాత్రంతా పరుగులు తీస్తూనే ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తెల్లవారేసరికి కలకత్తా చేరిపోవాలన్నది వారి లక్ష్యం.

ప్రఫుల్ల చాకీ 24గంటలు ఏకధాటిగా పరుగెత్తి సమస్తిపూర్ చేరుకున్నాడు. అక్కడ కలకత్తా రైలు ఎక్కాడు. ఆ బోగీలో ఉన్న పోలీసు అధికారికి ప్రఫుల్ల చాకీ ప్రవర్తన అనుమానం కలిగించింది. మోకామా పోలీస్ స్టేషన్ దగ్గర ప్రఫుల్లను అరెస్ట్ చేయడానికి రక్షక భటులు ప్రయత్నించారు. అయితే వారికి చిక్కకూడదని భావించిన ప్రఫుల్ల చాకీ, తనను తాను పిస్తోలుతో కాల్చుకుని ఆత్మార్పణం చేసుకున్నాడు.

మరోవైపు, ఖుదీరామ్ బోస్ పరుగెత్తి పరుగెత్తి బాగా అలసిపోయాడు. కొద్దిపాటి విశ్రాంతి కోసం ఒక దుకాణం దగ్గర కూర్చున్నాడు. అక్కడ జనాలు ఇద్దరు మహిళల హత్య గురించి మాట్లాడుకుంటున్నారు. కుతూహలం ఆపుకోలేని ఖుదీరామ్… తమ లక్ష్యమైన మేజిస్ట్రేట్ కింగ్స్‌ఫోర్డ్ బతికే ఉన్నాడా అని అడిగాడు. అనుమానించిన స్థానికులు అతన్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. విచారణ జరిపిన కోర్టు అతనికి మరణశిక్ష విధించింది. 1908 ఆగస్టు 11న ఖుదీరామ్ బోస్, చేతిలో భగవద్గీత పట్టుకుని చిరునవ్వుతో ఉరికంబమెక్కాడు. ఆనాటికి అతని వయసు 18ఏళ్ళ 8నెలల 8రోజులు మాత్రమే. ఖుదీరామ్ బోస్ పట్టుబడిన పూసా రోడ్ స్టేషన్‌కు అనంతర కాలంలో ఖుదీరామ్ బోస్ పేరు పెట్టారు.