
విజయవాడ: మిద్దె తోటల ద్వారా ఆరోగ్యకరమైన హరిత సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని, ప్రతి కుటుంబం తమ ఇంటి మిద్దెపై కూరగాయలు, ఆకుకూరలు, పండ్ల మొక్కలను పెంచే అలవాటు చేసుకోవాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ పిలుపునిచ్చారు. మిద్దె తోటలు కుటుంబాలకు తాజా, సురక్షితమైన పోషకాహారం అందించడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు దోహదపడతాయని ఆయన పేర్కొన్నారు.
సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్స్ (సీటీజీ)-విజయవాడ ఐదవ వార్షికోత్సవ వేడుకలు ఆదివారం విజయవాడలోని తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 450 మందికి పైగా సభ్యులు, గార్డెనింగ్ ఔత్సాహికులు, పర్యావరణ ప్రేమికులు పాల్గొన్నారు.
ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ మాట్లాడుతూ, సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్స్ చేపడుతున్న హరిత కార్యక్రమాలు అభినందనీయమన్నారు. ప్రతి ఇంట్లో మిద్దె తోటలు ఏర్పాటు చేసి సేంద్రీయ పద్ధతిలో కూరగాయలు పండించడం ద్వారా కుటుంబాలకు ఆరోగ్యకరమైన ఆహారం అందించవచ్చని చెప్పారు. చిన్నప్పటి నుంచే పిల్లల్లో మొక్కల పెంపకంపై ఆసక్తి పెంచితే ప్రకృతి పట్ల బాధ్యతతో కూడిన భావనతో పాటు ఆరోగ్యవంతమైన భవిష్యత్తుకు బాటలు వేయవచ్చని అన్నారు. హరిత సమాజ నిర్మాణంలో సీటీజీ చేస్తున్న సేవలు ప్రశంసనీయమని కొనియాడారు.
కార్యక్రమంలో ఏర్పాటు చేసిన వ్యర్థ వస్తువులతో రూపొందించిన కళాకృతులను కలెక్టర్ పరిశీలించి, వాటిని రూపొందించిన హసీనాను ప్రత్యేకంగా అభినందించారు. పాఠశాలలు, కళాశాలల్లో రీసైక్లింగ్ ఆధారిత సృజనాత్మక పోటీలను నిర్వహించడం ద్వారా విద్యార్థుల్లో సృజనాత్మకత, పర్యావరణ స్పృహ, కళాత్మక నైపుణ్యాలను ప్రోత్సహించాలని సూచించారు.
ఈ సందర్భంగా వయోవృద్ధ గార్డెనర్లు, సీటీజీ సభ్యులు బలిజేపల్లి వేణుగోపాలరావు–వరలక్ష్మి దంపతులు, పగడాల సుభాష్‌బాబు–ముత్యాల ఈశ్వరి దంపతులు, అబ్బూరి వెంకటేశ్వరరావు–విజయలక్ష్మి దంపతులు, యువ గార్డెనర్ కె. శ్రీనివాస్ తదితరులను సత్కరించారు.
కార్యక్రమంలో సీటీజీ అడ్మిన్లు పీవీడీ నాగేశ్వరరావు, షేక్ అఫ్జల్‌తో పాటు పలువురు సభ్యులు పాల్గొన్నారు.





