
కప్తాన్‌గంజ్ (నేపాల్): నేపాల్-భారత్ సరిహద్దులోని సున్సరీ జిల్లా కప్తాన్‌గంజ్ గ్రామంలో ముహర్రం వేడుకల అనంతరం నాటిన జెండాలను తొలగించకపోవడం తీవ్ర వివాదానికి, తద్వారా రక్తాపాతానికి దారితీసింది. స్థానిక శివాలయ ప్రాంగణంలో ముస్లిం వర్గం నాటిన జెండాలను వేడుకలు ముగిసినా పీకేయకపోవడమే ఈ ఘర్షణలకు ప్రధాన మూలకారణంగా మారింది. ఈ వివాదం ముదిరి చోటుచేసుకున్న ఘర్షణలు, పోలీసు కాల్పుల్లో ముగ్గురు హిందూ యువకులు ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
వివాదానికి మూలకారణం:
స్థానిక ఆధారాల ప్రకారం, జూన్ 28న నయా హటియా బజార్‌లోని శివాలయం వద్ద ముహర్రం నిర్వహణ కోసం ముస్లిం వర్గం స్థానిక యంత్రాంగం నుండి అనుమతి పొందింది. ఆ సమయంలో అక్కడ 40కి పైగా మతపరమైన జెండాలను నాటారు. పండుగ ముగిసిన తర్వాత కూడా ఆ జెండాలను తొలగించకుండా అక్కడే వదిలేశారు. ఆ తర్వాత పవిత్ర శ్రావణ మాసం ప్రారంభం కావడంతో, శివాలయ సమీపంలో ఉన్న ఆ జెండాలను తొలగించాలని స్థానిక హిందువులు వార్డు కార్యాలయానికి, నిర్వాహకులకు విజ్ఞప్తి చేశారు. అయినప్పటికీ ఆ జెండాలను పీకేయకపోవడం, అధికారులు నిర్లక్ష్యం వహించడంతో స్థానికంగా తీవ్ర అసంతృప్తి నెలకొంది.
ఘర్షణ – ముగ్గురు హిందూ యువకుల మృతి:
జెండాలను తొలగించకపోవడంతో ఆగ్రహం చెందిన స్థానిక యువకులు జులై 26న వాటిని పీకేసి, హనుమాన్ జెండాలను ఏర్పాటు చేశారు. అదే రోజు రాత్రి ‘బొల్ బామ్’ యాత్రకు సిద్ధమవుతున్న యువకులు మైక్‌సెట్ల ద్వారా పాటలు వేయడంతో ఇరు వర్గాల మధ్య పుకార్లు వ్యాపించి మాటమాట పెరిగింది. రాత్రి వేళ తోపులాట జరగడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. పోలీసులతో జరిగిన ఘర్షణ, వారు జరిపిన కాల్పుల్లో ఓం ప్రకాష్ మెహతా (31), జై ప్రకాష్ మెహతా (21), గణేష్ యాదవ్ (15) అనే ముగ్గురు హిందూ యువకులు మరణించారు.
సకాలంలో ఆ జెండాలను తొలగించి ఉంటే లేదా అధికారులు ముందే స్పందించి ఉంటే ఈ రాద్దాంతం జరిగి ఉండేది కాదని, ముగ్గురు యువకుల ప్రాణాలు దక్కేవని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో భద్రతా బలగాలను మోహరించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.





