News

పహల్గాం ఉగ్రదాడికి ఏడాది పూర్తి- ఆపరేషన్ సిందూర్‌ను గుర్తుచేసిన ఆర్మీ

76views

జమ్ము కశ్మీరులోని పహల్గాంలో ఉగ్రదాడి జరిగి ఏడాది పూర్తయిన వేళ ఆపరేషన్ సిందూర్‌ను గుర్తు చేస్తూ భారత ఆర్మీ ఒక ట్వీట్ చేసింది. మానవత్వపు హద్దులు దాటినప్పుడు, ప్రతిస్పందన నిర్ణయాత్మకంగా ఉంటుందని హెచ్చరించింది. న్యాయం జరిగిందని, భారతదేశం ఐక్యంగా నిలుస్తుందని భారత సైన్యం స్పష్టం చేసింది. కొన్ని సరిహద్దులను అస్సలు దాటకూడదు, భారతదేశం మర్చిపోదు అని రాసి ఉన్న ఒక గ్రాఫిక్స్‌ను ఈ ట్వీట్‌కు భారత ఆర్మీ జతపర్చింది.

2025 ఏప్రిల్ 22న పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు పహల్గాంలోని టూరిస్టులు లక్ష్యంగా జరిపిన ఉగ్రదాడిలో 26 మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. టూరిస్టులను చంపే ముందు వారి మతం గురించీ ఉగ్రవాదులు ప్రశ్నలు అడిగినట్లు వెల్లడైంది. ఇందుకు ప్రతీకారంగా 2025 మే 7 నుంచి 10 వరకు ఆపరేషన్ సిందూర్‌ను భారత్ నిర్వహించింది. పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేయడంతో పాటు వందలాది ఉగ్రవాదులను కడతేర్చింది.

ఆపరేషన్ సిందూర్‌తో భారత్ తడాఖా
గతేడాది పహల్గాం ఉగ్రదాడి అనంతరం పాకిస్థాన్‌పై భారత్ చాలా రకాలుగా చర్యలు తీసుకుంది. ఈ క్రమంలో ఆ దేశంతో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని ఆపేసింది. గతంలో పాక్‌తో కుదిరిన సింధూ నదీజలాల ఒప్పందాన్ని రద్దు చేసింది. భారత్‌పై ఏ రకమైన ఉగ్రదాడి జరిగినా ఉపేక్షించేది లేదని అప్పట్లో ప్రధాని మోదీ పాక్‌ను తీవ్రంగా హెచ్చరించారు. ఈ నేపథ్యంలో మే 7న తెల్లవారుజామున పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీరు (పీఓకే)లలోని ఉగ్రవాద స్థావరాలపై భారత త్రివిధ దళాలు మెరుపు దాడులు చేశాయి.

లష్కరే తయ్యీబా, జైషే మహ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్‌ వంటి పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలకు చెందిన స్థావరాలను ధ్వంసం చేసింది. ఈ దాడుల్లో 100 మందికిపైగా పాక్ ఉగ్రవాదులు హతమయ్యారు. దీంతో బార్డర్‌లో కాల్పులను పాక్ తీవ్రతరం చేసింది. డ్రోన్లతో భారత సరిహద్దు ప్రాంతాలపై దాడులు చేసేందుకు యత్నించింది. వీటిని భారత గగనతల రక్షణ వ్యవస్థలు సమర్ధంగా ఎదుర్కొన్నాయి. భారత మిస్సైల్, డ్రోన్, వైమానిక దాడుల్లో పాక్‌లోని సైనిక, వైమానిక స్థావరాలు దారుణంగా దెబ్బతిన్నాయి. ఈ దుస్థితిలో మే 10న కాల్పుల విరమణకు తాము సిద్ధమని భారత్‌ను పాక్ వేడుకుంది. అందుకు వెంటనే భారత్ అంగీకారం తెలిపింది.

ఆపరేషన్ మహాదేవ్‌ : ఉగ్రవాదులు హతం
ఇక పహల్గాం ఉగ్రదాడికి పాల్పడిన ఉగ్రవాదుల ఏరివేత కోసం భారత సైన్యం 2025 జులై 28న ఆపరేషన్ మహాదేవ్‌ను నిర్వహించింది. ఉగ్రదాడిలో పాల్గొన్న ముగ్గురు లష్కరే తయ్యీబా ఉగ్రవాదులను ఈ ఆపరేషన్‌లో భారత భద్రతా బలగాలు మట్టుబెట్టాయి.