
విశాఖపట్నం: పవిత్ర శ్రావణమాసాన్ని పురస్కరించుకుని విశాఖపట్నంలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలను నిర్వహించనున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ), హిందూ ధర్మ ప్రచార పరిషత్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఆగస్టు 14న నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
సాగర్‌నగర్‌లోని ఇస్కాన్ టెంపుల్‌లో ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యే ఈ సామూహిక వరలక్ష్మీ వ్రతాల్లో సుమారు వెయ్యి మంది మహిళలు పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నారు. స్త్రీలు, ఆధ్యాత్మికవేత్తలు, ఉపాసకుల కోసం ఉచితంగా పూజా ద్రవ్యాలను అందించనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు.
ఈ కార్యక్రమానికి సంబంధించిన గోడపత్రికను ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, సీహెచ్ వంశీకృష్ణ శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు చేపడుతున్న ఏర్పాట్లపై నిర్వాహకులతో చర్చించారు.
కార్యక్రమంలో హిందూ ధర్మ ప్రచార పరిషత్ విశాఖ సిబ్బందితో పాటు వెంకట అన్నమాచార్య సేవా ట్రస్ట్ చీఫ్ డైరెక్టర్ సునీత కొటారి, సభ్యులు మానేపల్లి లక్ష్మి, పలివెల విజయ తదితరులు పాల్గొన్నారు.
వివరాలకు సంప్రదించండి
సామూహిక వరలక్ష్మీ వ్రతాలకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం 9247784017, 8500641729 ఫోన్ నంబర్లను సంప్రదించవచ్చని విశాఖ క్లస్టర్ హిందూ ధర్మ ప్రచార పరిషత్ సూపరింటెండెంట్ తెలిపారు.





