
విదర్భ : దేశవ్యాప్తంగా సంచార మరియు డీనోటిఫైడ్ (ఘుమంతు-విముక్త) తెగలుగా పిలువబడే ఈ వర్గాలు ఒకప్పుడు జ్ఞానాన్ని పంచిపెట్టే సమాజాలుగా ఉండేవి. సమాజంతో తమ జ్ఞానాన్ని నిస్వార్థంగా పంచుకోవడానికి ఈ వర్గం దేశమంతటా సంచరించేదని ఆరెస్సెస్ సర్ సంఘచాలక్ మోహన్ భాగవత్ గుర్తు చేశారు. అయితే కాలక్రమేణా ఈ వర్గం తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
బ్రిటిష్ పాలనలో, స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నందుకు గాను మొత్తం పార్ధీ-ఆదివాసీ సమాజాన్ని ‘నేరస్తుల తెగ’గా ముద్ర వేశారు. ఇది ఆ సమాజ అభివృద్ధిపై తీవ్ర ప్రభావం చూపిందన్నారు.ఆగస్టు 8 న విదర్భలోని ఓ పాఠశాలలో పార్ధీ పిల్లల కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాగవత్ పాల్గొన్నారు.
సద్గురు రిలీజియస్ అండ్ ఛారిటబుల్ ట్రస్ట్ మరియు అమనోరా YES ఫౌండేషన్ చొరవతో పార్ధీ పిల్లల కోసం అత్యాధునిక పాఠశాల నడుస్తుండటం ఎంతో సంతోషకరమైన విషయం. దేశం నిజంగా ‘విశ్వగురువు’గా ఎదగాలంటే, సమాజంలో వెనుకబడిన వర్గాలను ప్రధాన స్రవంతిలోకి తీసుకురావడం అత్యవసరమని ఆయన అన్నారు.
ఖమ్‌గావ్‌లోని శ్రీ సద్గురు రిలీజియస్ అండ్ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుస్తున్న పార్ధీ-ఆదివాసీ ఆశ్రమ పాఠశాలలో, పూణేకు చెందిన ‘అమనోరా యెస్ ఫౌండేషన్’ (Amanora YES Foundation) చొరవతో నిర్మించిన మూడు అత్యాధునిక క్రీడా సముదాయాలతో సహా పలు సౌకర్యాలను సరసంఘచాలక్ డాక్టర్ మోహన్ భాగవత్ ప్రారంభించారు.
కార్యక్రమ ప్రారంభంలో, ‘అమనోరా YES ఫౌండేషన్’ సహకారంతో ఆశ్రమ పాఠశాలలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను సరసంఘచాలక్ పరిశీలించారు. పాఠశాలలోని అత్యాధునిక క్రీడా మైదానాలు, విద్యార్థులకు భోజనం సిద్ధం చేసే వంటగది, విద్యార్థులు స్వయంగా పెంచిన కూరగాయల తోట మరియు వసతి గృహాన్ని ఆయన పరిశీలించారు.
ఒకప్పుడు భారతీయ సమాజం అత్యంత వ్యవస్థీకృతంగా ఉండేదని, విదేశీ దాడుల కారణంగా సమాజం క్రమంగా బానిసత్వంలోకి నెట్టబడి, కాలక్రమేణా ముక్కలైపోయింది. దీనివల్ల సమాజంలో నిర్లక్ష్యానికి గురైన వర్గాల సంఖ్య పెరిగింది. అయినప్పటికీ, ఆ వర్గాలు ఎప్పుడూ బానిసత్వాన్ని అంగీకరించలేదని తేల్చి చెప్పారు.
ఘుమంతో తెగల వారు స్వాతంత్ర్యం కోసం పోరాటం కొనసాగించారు. బ్రిటిష్ పాలనలో, పార్ధి మరియు ఆదివాసీ వర్గాలను ‘నేరస్తులు’గా ప్రకటించారు. ఇది వారి అభివృద్ధికి తీవ్ర ఆటంకం కలిగించింది. సంఘ్ అనేక సంవత్సరాలుగా పార్ధి వర్గ అభివృద్ధి కోసం కృషి చేస్తోంది.అమనోరా యెస్ ఫౌండేషన్ ఈ పాఠశాలను మార్చి, దాని విద్యార్థులను స్వయం సమృద్ధిగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తోంది. ఈ పని నిస్సందేహంగా ప్రశంసనీయం. అణగారిన వర్గాలను ప్రధాన స్రవంతిలోకి తీసుకురావడం భారత్ విశ్వగురువుగా మారడానికి అత్యవసరమని భాగవత్ నొక్కి చెప్పారు.
ఈ కార్యక్రమానికి రాష్ట్ర గిరిజన అభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ అశోక్ ఉయికే, కార్మిక శాఖ మంత్రి ఆకాష్ ఫుండ్కర్, ఇండోర్‌కు చెందిన శ్రీ సద్గురు రిలీజియస్ అండ్ ఛారిటబుల్ ట్రస్ట్ ట్రస్టీ డాక్టర్ ఆయుషి దేశ్‌ముఖ్ మరియు సిటీ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ అనిరుద్ధ దేశ్‌పాండే కూడా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.





