
పౌరసత్వ సవరణ చట్టానికు వ్యతిరేకంగా షాహీన్‌బాగ్ నిరసనల్లో పిల్లలు పాల్గొనడాన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టింది. జనవరి 30న నిరసనలు జరుగుతున్న సమయంలో ఓ చిన్నారి మృతి చెందడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన సర్వోన్నత న్యాయస్థానం కేసును సుమోటోగా స్వీకరించింది. నిరసనల సందర్భంగా మొహ్మద్ జహాన్ అనే నాలుగు నెలల బాలుడిని తల్లిదండ్రులు ఆ ప్రాంతం వద్దకు తీసుకొచ్చారు. ఆ బాలుడు మృతి చెందాడు.
దీనిపై 12 ఏళ్ల విద్యార్థిని జెన్ గున్‌రతన్ సదావర్తె సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎస్‌ఏ బాబ్డేకు లేఖ వ్రాసింది. నిరసనల్లో చిన్నారులు పాల్గొనకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ జెన్ చీఫ్ జస్టిస్‌ను కోరింది. అంతేకాదు ఘటనపై అధికారులచే విచారణ చేయించాలని కోరింది.

పెద్ద ఎత్తున జరుగుతున్న నిరసన కార్యక్రమాలకు నెలల పిల్లలను తీసుకురావడం చాలా దారుణమని లేఖలో పేర్కొంది. వారు పొందుతున్న బాధను కూడా ఆ పిల్లలు చెప్పుకోలేరని, వాతావరణానికి తట్టుకోలేరని, ఈ క్రమంలోనే అనారోగ్యంపాలవుతారని జెన్ చీఫ్ జస్టిస్ దృష్టికి తీసుకొచ్చింది.
ఇది ఖచ్చితంగా పిల్లల హక్కులకు భంగం కలిగించడమే అవుతుందని పేర్కొంది. ప్రతిరోజూ తన బిడ్డతో ఆ తల్లి నిరసనల ప్రాంగణానికి చేరుకునేదని చెబుతూ ఓ జాతీయ పత్రికలో వచ్చిన కథనాన్ని జతచేసింది. ఓ రోజు తీవ్రమైన చలిలో బిడ్డను నిరసనలు జరిగే ప్రాంగణానికి తీసుకురాగా అక్కడే అస్వస్థకు గురై జనవరి 30న ఆ బిడ్డ ప్రాణాలు కోల్పోయాడని వెల్లడించింది. ఇక చల్లటి వాతావరణంలో చిన్నారి ఉండటంతోనే మృతి చెందాడని హాస్పిటల్ వర్గాలు ఇచ్చిన రిపోర్టును సైతం ఆ విద్యార్థి జతచేసింది. ఆల్షిఫా హాస్పిటల్‌కు తీసుకువచ్చేసరికే బిడ్డ మృతి చెందాడని వైద్యులు తెలిపిన విషయాన్ని కూడా లేఖలో ఆ విద్యార్థిని పొందుపరచింది. ఇలాంటి సమయంలో క్రిమినల్ చట్టాల ఆధారంగా చర్యలు తీసుకోవాల్సి ఉందని అయితే ఆ బిడ్డ ఏ కారణం చేత మృతి చెందాడన్న విషయాన్ని వైద్యులు డెత్ సర్టిఫికేట్‌లో పేర్కొనలేదన్న విషయాన్ని చీఫ్ జస్టిస్ దృష్టికి తీసుకొచ్చింది జెన్.





