News

పార్లమెంటు ప్రాంగణంలో పూరీ జగన్నాథుని రథచక్రాలు

223views

పార్లమెంటు ప్రాంగణంలో పూరీ జగన్నాథుని రథచక్రాలు కొలువుదీరనున్నాయి. శ్రీ జగన్నాథ ఆలయ యంత్రాంగం-SJTA ఈ మేరకు చేసిన ప్రతిపాదనకు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అంగీకారం తెలిపారని ఓ సీనియర్ అధికారి వెల్లడించారు. స్పీకర్‌ ఓం బిర్లా, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌, స్థానిక ఎంపీ సంబిత్‌ పాత్ర తదితరులు పూరీ ఆలయాన్ని సందర్శించిన విషయం తెలిసిందే.

‘‘లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా పూరీ శ్రీక్షేత్రం సందర్శన సందర్భంగా.. పార్లమెంటు ప్రాంగణంలో జగన్నాథ రథచక్రాలను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించాం. దీనికి ఆయన అంగీకరించారు’’ అని ఎస్‌జీటీఏ ఒక ప్రకటనలో తెలిపింది. జగన్నాథుడు, బాలభద్రుడు, సుభద్ర రథాల్లోని ఒక్కో చక్రం చొప్పున ఢిల్లీకి తరలించనున్నట్లు వెల్లడించింది. ఒడిశా సంస్కృతి, ఆధ్యాత్మిక వారసత్వానికి చిహ్నంగా వాటిని ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొంది.

పూరీలో ఏటా ఆషాఢ మాసంలో అట్టహాసంగా రథయాత్ర నిర్వహిస్తారు. జగన్నాథుడు, సుభద్ర, బలభద్రుల కోసం మూడు రథాలను తయారుచేస్తారు. రథయాత్ర ముగిసిన అనంతరం వాటిని భాగాలుగా విడదీస్తారు. కొన్ని ముఖ్యమైన భాగాలు మినహా.. ప్రతి సంవత్సరం రథాల నిర్మాణంలో కొత్త కలపను ఉపయోగిస్తారు. విడదీసిన రథాల భాగాలను గిడ్డంగుల్లో ఉంచుతారు. చక్రాలు సహా వాటిలో కొన్నింటిని వేలం వేస్తుంటారు.