News

అక్షరాలకు ఆలయం

137views

గిరిజనులు ప్రత్యేకమైన సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలను పాటిస్తుంటారు. అందులో భాగంగా పార్వతీపురం మన్యం జిల్ల్లా భామిని మండలంలోని సతివాడ పంచాయతీ నూకాలమ్మగూడలో సవర తెగకు చెందిన గిరిజనులు అక్షరాలకు ఆలయం నిర్మించారు. వారి మాతృభాష సవర లిపిలోని అక్షరాలనే దైవంగా కొలుస్తూ, పూజలు చేస్తున్నారు. ఒడిశాలోని గజపతి జిల్లా మర్చిగూడలో 1936లో ఆ రాష్ట్రానికి చెందిన మంగై గమాంగో, మాలర్‌ మడియార్‌లు తొలుత సవర భాషకు 24 అక్షరాలతో లిపి రూపొందించి ‘అక్షరబ్రహ్మ’ పేరిట ఆలయం కట్టారు. అనంతరం సవరలు నివసించే అన్ని ప్రాంతాల్లో పర్యటించి దీన్ని వాడుకలోకి తీసుకొచ్చారు. వీరి స్ఫూర్తితో భామిని మండలం నూకాలమ్మగూడలో సవర కరువయ్య 1995-96లో అక్షరబ్రహ్మ గుడి నిర్మించారు. ఇక్కడ ప్రతి గురువారం ప్రత్యేక పూజలు చేస్తారు. మండల వాసులతోపాటు ఒడిశా నుంచి భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు. కార్తిక మాసంలో దీక్షలు చేపడతారు. ‘ఇటీవలే సవర భాషలో పుస్తకాలను రూపొందించి ప్రచురిస్తున్నాం. ఈ భాషను అధికారికంగా గుర్తించాలి’ అని సవర కరువయ్య కోరుతున్నారు.