
రాష్ట్రపతి భవన్‌లోని అతి సుందరమైన ‘అమృత్ ఉద్యాన్’ను ప్రజల సందర్శనార్థం ఈ నెల 16 నుంచి సెప్టెంబర్ 14 వరకు ప్రవేశం కల్పిస్తున్నట్లు రాష్ట్రపతి భవన్ అధికారిక వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. ఉద్యానవనంలో ప్రవేశానికి ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సందర్శకులకు అనుమతి ఇవ్వనున్నారు. నిర్వహణ నిమిత్తం అన్ని సోమవారాలు సెలవు ఉంటుందని రాష్ట్రపతి కార్యాలయ వర్గాలు తెలిపాయి. ఉద్యానవనంలో బాలవాటిక, హెర్బల్ గార్డెన్ , బోన్సాయ్ గార్డెన్ ,సెంట్రల్ లాన్, సర్క్యులర్ గార్డెన్ , లాంగ్ గార్డెన్ వంటివి సందర్శకులను ఆకర్షించనున్నాయి. అమృత్ ఉద్యాన్‌లోని ప్రతి మొక్కకు ఉన్న క్యూఆర్ కోడ్ సహాయంతో ఆ వృక్ష జాతి గురించి తెలుకోవచ్చు.
అమృత్ ఉద్యానవనాన్ని సందర్శించాలనుకునేవారు రాష్ట్రపతి భవన్ అధికారిక వెబ్‌సైట్‌లో పేర్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. 35వ ప్రవేశద్వారం వద్దకు చేరుకున్నాక కియోస్కుల ద్వారా కూడా స్లాట్‌ను బుక్ చేసుకోవచ్చు. ఇక ఉద్యానవనంలోకి సందర్శకులు కేవలం మొబైల్ ఫోన్స్, ఎలక్ట్రానిక్ కీలు, హ్యాండ్ బ్యాగ్స్, వాలెట్స్, నీళ్ల బాటిల్స్, పిల్లల పాలసీసాలు, గొడుగు వంటివి మాత్రమే లోపలికి తీసుకెళ్లాలని అధికారులు సూచించారు. ఆగస్టు 29న జాతీయ క్రీడల దినోత్సవం, సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని క్రీడాకారులకు, ఉపాధ్యాయులకు ప్రత్యేక ప్రవేశ సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు ఈ సందర్భంగా అధికారులు తెలిపారు.





