ArticlesNews

సంఘ శాఖ : స్వయంసేవకుడు

201views

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ప్రధాన లక్ష్యం మన దేశానికి పరమ వైభవాన్ని సాధించడమే. ఆ విషయం ప్రతీరోజూ ఆలపించే సంఘ ప్రార్థనా గీతంలో చాలా స్పష్టంగా ఉంది ‘పరమ వైభవమ్ నేతుమ్ ఏతత్ స్వరాష్ట్రమ్’. ఆ పరమ వైభవాన్ని సాధించాలంటే సమాజాన్ని వ్యవస్థీకరించాలి. ఇవాళ్టి మెజారిటీ హిందూ సమాజం ఎక్కువ, తక్కువ హోదాలు అనే తప్పుడు భ్రమల్లో కూరుకుపోయి ఉన్నట్లు, ఒకరితో ఒకరు ఎలాంటి సంబంధాలు లేకుండా ఉన్నట్లూ అనిపిస్తుంది. కుల ఆధారిత వివక్ష వల్ల హిందూ సమాజం చెల్లాచెదురు అయిపోయినట్లు కనిపిస్తోంది. అంటరాని తనం వంటి దోషాలతో ముక్కలు అయిపోయినట్లు అనిపిస్తోంది. మహాత్మా జ్యోతిబా ఫూలే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, స్వాతంత్ర్య వీర సావర్కర్ వంటి సంఘ సంస్కర్తలు అందరూ హిందూ సమాజాన్ని దోషరహితంగా తీర్చిదిద్దడానికి ప్రయత్నించడానికే ప్రాధాన్యం ఇచ్చారు. వారందరికీ, హిందూ సముదాయానికి నిజమైన అర్ధంలో ‘ఒక సమాజం’ అని పిలిపించుకోడానికి… అవసరమైన గుణాలను బోధించాలి అన్నదే అతి పెద్ద ఆందోళన. హిందూ సమాజంలోని వ్యక్తులు సంకుచిత మనస్తత్వం కలిగి ఉంటారు, ఎంతసేపూ ‘నేను – నాది’ అనే భావనలో మగ్గిపోతూ ఉంటారు.

హిందూ సమాజాన్ని దోషరహితంగా చేయాలి, వ్యవస్థీకృతంగా తీర్చిదిద్దాలి అని గుర్తించడమే, దేశం పరమ వైభవాన్ని సాధించడానికి మొట్టమొదటి షరతు. ఆ పరమ వైభవంలోనే స్వేచ్ఛ, స్వతంత్రం, సమృద్ధి, సంతృప్తి నిండి ఉన్నాయి. అన్నిటికంటె ముఖ్యంగా, యావత్ హిందూ సమాజమూ కలిసి పనిచేసేలా నిర్ణయాలు తీసుకోవాలని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ నిర్ణయించింది.

‘‘సంఘం లక్ష్యం పరమ వైభవం. దానికోసం హిందూ సంఘటనం చేయడం’’. ఇక్కడ ‘హిందూ సంఘటన’ అనే పదం సంఘ సంస్కరణలకు సంబంధించిన అన్ని రకాల ఆలోచనలనూ పరిగణనలోకి తీసుకుంటుంది.

హిందూ సమాజాన్ని వ్యవస్థీకరించడం అంత సులువైన పని ఏమీ కాదు. అది ధైర్యానికి పరీక్ష. బతికున్న కప్ప బరువు తూచడం కంటె హిందూ సమాజాన్ని నిర్వహించడం కష్టమైన పని.

హిందూ సమాజం ఎంత క్లిష్టమైనదంటే మన జీవితాలు గడిచిపోయినా అందులోని విభజనలు అలాగే ఉంటాయి. ఐకమత్యం సాధించడం అనేది సుదూర లక్ష్యంగా మిగులుతుంది. నిరాశ, నిస్పృహ ఆవరించి వేస్తాయి.

అది చూడడానికి అసాధ్యంలా కనిపిస్తుంది కానీ దాన్ని చేయడం అత్యంత ఆవశ్యకమైన విషయం. దానికి మనం పూర్తిస్థాయి అంకిత భావం కలిగిన కార్యకర్తలతో కూడిన ఒక సంస్థను ఏర్పాటు చేయగలగాలి. వారు నిలకడగా ఉండాలి, ఎట్టి పరిస్థితుల్లోనూ వారిని నిరుత్సాహపరచకూడదు. వారు ఏ పనినీ మధ్యలో వదిలివేయకూడదు.

సంఘం, వ్యవస్థీకృత నైపుణ్యాలు కలిగిన కార్యకర్తలను తయారు చేయడానికే, శాఖను నిర్వహిస్తోంది. అలాంటి కార్యకర్తలకు సంఘం ‘స్వయంసేవకులు’ అనే పేరు పెట్టింది. ‘రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్’ అనే పదానికి అర్ధం ఇలా ఉంటుంది. రాష్ట్రీయ అంటే హిందూదేశానికి చెందిన అని అర్ధం. సంఘం అంటే సమాజం. హిందూ సమాజాన్ని వ్యవస్థీకరించే లక్ష్యాన్ని చేపట్టిన వారే స్వయంసేవకులు.

మొత్తం హిందూ సమాజాన్ని వ్యవస్థీకరించడం అన్న భావనను అర్ధం చేసుకోవడం అంత సులువేం కాదు. ఒక కులం, ఒక భాష మాట్లాడేవాళ్ళు, రైతులు, కార్మికులు, కాంగ్రెస్, బీజేపీ వంటి సమూహాలను వ్యవస్థీకరించడం అనే భావన సులువుగానే అవగతం అవుతుంది. అయితే అన్నిటినీ, అందరినీ కలుపుకునిపోయే హిందూ సమాజాన్ని వ్యవస్థీకరించడం అనే భావనను డాక్టర్ హెడ్గేవార్ తప్ప ఇంకెవ్వరూ ప్రతిపాదించలేదు. గ్రామీణులు, నగరవాసులు, గిరిజనులు, అడవుల్లో నివసించే వారు, ధనవంతులు, పేదవారు, వేర్వేరు భాషలు మాట్లాడే వారు, ఆరు లక్షల గ్రామాల్లో విస్తరించి ఉన్న వాళ్ళు అందరితో కూడిన ‘విరాట్’ సమాజాన్ని వ్యవస్థీకరించాలని తీర్మానించుకోవడమే ఒక అద్భుతం. డాక్టర్‌జీ దాన్ని ఒక దైవ కార్యంగా భావించారు. ఆయన తన తుది శ్వాస వరకూ అదే పనిలో నిమగ్నమైపోయారు. ఆయన ప్రవచించిన ఆదర్శాన్ని సాకారం చేయడం కోసం వందల మంది కార్యకర్తలు తమ జీవితాలను త్యాగం చేసారు. పరమ పూజనీయులైన సర్‌సంఘచాలక్‌లు శ్రీ గురూజీ, బాలాసాహెబ్ దేవరస్, ప్రొఫెసర్ రాజేంద్ర సింగ్‌జీ, సుదర్శన్‌జీ అదే ఆదర్శాన్ని అందరి ముందూ ఉంచి నడిపించారు.

సువిస్తారమైన హిందూ సమాజాన్ని వ్యవస్థీకరించడం అనే లక్ష్యం చూడడానికి అసాధ్యంలా కనిపిస్తుంది. అలాంటి లక్ష్యాన్ని సాకారం చేయడానికి స్వయంసేవకుల్లో ఎలా గుణాలు ఉండాలి అన్న విషయం గురించి సంఘ్ వ్యవస్థాపకులు డాక్టర్ కేశవ బలీరామ్ హెడ్గేవార్ చాలా తీవ్రంగా, నిశితంగా ఆలోచించే ఉంటారు. ఆయనకు ప్రజా జీవితంలో ఉన్న చాలామంది పెద్దలతో సంబంధాలు ఉన్నాయి. లోకమాన్య తిలక్, మహాత్మా గాంధీ, నేతాజీ సుభాష్ చంద్ర బోస్, మహర్షి యోగి అరొబిందో, త్రైలోక్యనాథ్ చక్రబొర్తి, భాయి పరమానంద్ వంటి వారితో ఆయనకు పరిచయాలు ఉన్నాయి.

సాధారణంగా ఏదైనా సభ లేదా సదస్సులో కార్యక్రమాలు నిర్వహించే తీరుతెన్నులను చూసుకునే వ్యక్తిని స్వయంసేవకులు అంటారు. అంటే వాలంటీర్ అన్నమాట. అయితే డాక్టర్ హెడ్గేవార్ మనసులో ఉన్న ‘స్వయంసేవకుడు’ అనే భావన పూర్తిగా వేరైనది.

— వ్యవస్థీకరణ అంటే ప్రజలతో సంబంధ బాంధవ్యాలు పెట్టుకోవడం. మనం అందరినీ కలుపుకుని పోవాలి, అంతే తప్ప విభజించకూడదు. కలుపుకుని వెళ్ళడం చాలా కష్టం. అందుకే స్వయంసేవక్ అనేవాడు నిస్వార్థంగా ఉండాలి, మొత్తం సమాజంలోని అందరితోనూ సంబంధాలు కలిగి ఉండాలి. ఎవరి గురించీ ఎలాంటి వివక్షా భావమూ వారి మనసులో ఉండకూడదు. అలాంటి వారికే తోటి మనుషులతో సంబంధ బాంధవ్యాలు పెంచుకోవడం సాధ్యమవుతుంది.

— ఒక వ్యక్తితో సంబంధం పెంచుకోవాలంటే అతని ఇంటికి వెళ్ళి కలవాలి. ఒక కొత్త వ్యక్తి ఇంటికి వెళ్ళగలిగే స్వభావాన్ని స్వయంసేవకులు అలవరచుకోవాలి.

— కొత్త వ్యక్తులను కలవడానికి ఎప్పటికప్పుడు సమయం కేటాయించుకుంటూ ఉండాలి. సంఘ్‌లో స్వయంసేవకుడు అయిన వ్యక్తి అతి తక్కువ సమయంలో తన మిగతా బాధ్యతలు అన్నీ పూర్తి చేసుకోగలగాలి. అప్పుడు మిగతా సమయం మొత్తం వ్యవస్థకు కేటాయించేయవచ్చు.

— స్వయంసేవకుడు మృదుభాషి అయి ఉండాలి, తక్కువ మాట్లాడాలి. ఇతరులు చెప్పేది వినగల సామర్థ్యం కలిగి ఉండాలి.

— ఒక నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి పని చేయగలగాలి.

హిందూ సమాజాన్ని వ్యవస్థీకరించే పని ధైర్యానికి పరీక్ష అని చెప్పుకోవాలి. ‘కార్యం వా సాధ్యాత్ దేహం వా పాతయేత్’ (పని అయినా పూర్తి అవాలి, లేక శరీరం అయినా త్యాగం చేయాలి) అనే మనఃస్థితితో నిరంతరాయంగా పని చేస్తూనే ఉండాలి.

అదే వారసత్వాన్ని తరువాతి తరాలకు కూడా అందజేయాలి. డాక్టర్ హెడ్గేవార్ తర్వాత ఐదుగురు సర్‌సంఘచాలక్‌లు వచ్చారు. సంఘ కార్యం క్రమం తప్పకుండా, నిరంతరాయంగా నడుస్తూనే ఉంది. డాక్టర్‌జీ తన మనసులో ఉన్న ‘స్వయంసేవకులు’ అనే భావనను సాకారం చేయగలిగిన ‘శాఖ’ పద్ధతికి రూపకల్పన చేసారు.

సంఘ శాఖ కార్యక్రమం భగవా (కాషాయ) ధ్వజానికి వందనం చేయడంతో ప్రారంభమవుతుంది, భారతమాతకు అర్చనతో ముగుస్తుంది. శాఖలో ఏ దైవం లేదా వ్యక్తి చిత్రపటాన్నీ ఉంచరు. కాషాయ ధ్వజానికే సమున్నత స్థానం ఉంటుంది. దాని ముందు అందరూ సమానులే. గొప్పవారు-తక్కువ వారు, చదువుకున్నవారు-చదువు లేనివారు, నగర వాసులు-గ్రామ వాసులు, ఇంకా మరే ఇతరమైన వివక్షలూ ఉండవు. అందరికీ భారతమాతే దేవత. ఆమెనే పూజిస్తారు. స్వయంసేవకుడు అంటే భారతమాత కోసం దేన్నయినా త్యాగం చేయడానికి సర్వసిద్ధంగా ఉంటాడు. స్వయంసేవకుడి కోరిక అయిన జీవితాన్ని త్యాగం చేసే ఉద్దేశం – ‘పతతు ఏష కాయః’ అనే భావం అనుదిన ప్రార్థనలో కూడా ఉంది. భారతమాతే పూజించదగిన దైవం, సమాజమే భగవంతుడు, కాషాయ ధ్వజమే ఆదర్శం. అదే సంఘ శాఖ నిర్మాణం. శాఖలో ఎలాంటి అహంభావానికీ, స్వార్థానికీ చోటు లేదు.

శాఖ కోసం ఒక గంట సమయం కేటాయిస్తారు. అందులో ప్రతీ నిమిషాన్నీ ఎలా వినియోగించాలి అన్న ప్రణాళిక జాగ్రత్తగా తయారు చేస్తారు. తనువు-మనస్సు-బుద్ధి అనే మూడింటినీ సమన్వయం చేసుకోగలిగినవాడు తన పనిలో విజయవంతం అవుతాడు. బుద్ధి ఒకవైపు, మనసు మరోవైపు, శరీరం మూడోవైపూ లాగుతుంటే అలాంటి వ్యక్తిత్వం సమీకృతంగా ఉండదు. అలాంటి వ్యక్తి ఎప్పుడూ ద్వైదీభావ మనస్థితిని కలిగి ఉంటారు.

శాఖలోని గంట వ్యవధికి ప్రణాళిక సాధారణంగా ఇలా ఉంటుంది. మొదటి ఐదు నిమిషాలూ ధ్వజ ప్రణామం చేయాలి. చివరి ఐదు నిమిషాలూ భారతమాతకు వందనం చేయాలి. ఆటలు, సూర్య నమస్కారాలు, యోగ, సమత (డ్రిల్), పథ సంచలనం (రూట్ మార్చ్‌) వంటి శారీరక వ్యాయామ కార్యక్రమాలకు 40 నిమిషాలు కేటాయిస్తారు. మిగతా పది నిమిషాలూ ‘బౌద్ధిక’ అంటే బుద్ధికి సంబంధించిన పనులు ఉంటాయి. వాటికి వారానికి సరిపడా కార్య ప్రణాళిక ఉంటుంది.

ఆటలు మనస్సును సంతోష పరుస్తాయి, కుతూహలం కలిగేలా చేస్తాయి. విజయం కోసం తాపత్రయ పడేలా చేస్తాయి. నేను గెలుస్తాను అనే భావన జీవితంలో చాలా ముఖ్యం. గెలవాలన్న ఆకాంక్ష, సమాజంలో ముందుకు వెళ్ళాలన్న కాంక్ష అందరికీ అవసరం.

స్వయంసేవకులకు క్రమశిక్షణ అలవాటు అవడానికి యోగ, సమత (డ్రిల్), పథ సంచలనం (రూట్ మార్చ్‌) వంటి వాటి ద్వారా ప్రయత్నం జరుగుతుంది. దానివల్ల శరీరానికి చెందిన ఇంద్రియ జ్ఞానాలు విచ్చలవిడిగా విశృంఖలంగా ఉండవు. శరీరం అనేది మనసు నియంత్రణలో ఉంటుంది.

సూర్య నమస్కారాలు చేయడం అన్ని విధాలుగా చక్కటి వ్యాయామం. మొత్తం శరీరానికి అంతటికీ పనికొచ్చే వ్యాయామం. అందులో ఏడు ఆసనాలు, ప్రాణాయామం కలిసి ఉంటాయి. సూర్య నమస్కారాలు ఆరోగ్యవంతమైన, చక్కటి శ్రమ చేసిన శరీరాన్ని తయారుచేస్తాయి. ‘శరీరం ఆద్యం ఖలు ధర్మ సాధనం’ – ధర్మాన్ని నిర్వర్తించడానికి మొదట శరీరం సిద్ధంగా ఉండాలి అని ఆర్షోక్తి.

శాఖలో ఇలా శరీరానికి వ్యాయామం కలిగించిన తర్వాత మేధోపరమైన కార్యక్రమాల (బౌద్ధిక్) కోసం పది నిమిషాలు కేటాయిస్తారు. హిందూ సమాజానికి విధేయంగా ఉండడం, ప్రస్తుత సమాజంలోని అలజడులు, హిందువుల్లో ఐక్యత లేకపోవడం, ప్రజల్లో సామరస్యం కలిగించే ప్రయత్నాలు, వాటికి సమయం కేటాయించడం వంటి విషయాల గురించి చర్చలు జరుపుతారు.

బౌద్ధిక కార్యక్రమాన్ని ప్రధానంగా చిన్నచిన్న ప్రేరణాత్మకమైన కథలు చెప్పే రూపంలో నిర్వహిస్తారు. ఆ కథల్లో సమాజం పట్ల సహానుభూతి, ధైర్యం, సాహసం, సేవాభావం, అంకితభావం వంటి మంచి గుణాల గురించి చెబుతారు. శాఖలో పాల్గొంటున్న అందరూ కలిసి దేశభక్తి గీతాలు ఆలపిస్తారు. ఆ సమయంలో స్వయంసేవకులు ఆ పాటల భావంలో, లయలో తన్మయులైపోతారు. నిత్య ప్రార్థన అనేది కూడా బౌద్ధిక్‌లో భాగమే. స్వయంసేవకుడు అవడానికి కావలసిన ఆలోచనను ఆ ప్రార్థన అందిస్తుంది.

శాఖను నిర్వహించే లేదా శాఖకు నాయకత్వం వహించే స్వయంసేవకుడిని ‘ముఖ్య శిక్షక్’ అంటారు. అతనికి సహాయం చేసే పెద్ద వ్యక్తిని శాఖ కార్యవాహ (శాఖ కార్యదర్శి) అంటారు. పాల్గొనే వారిలో చిన్నపిల్లలు, విద్యార్ధులు, యువకులు, వయోజనులూ ఉంటారు. వారివారి స్థాయులను బట్టి ‘గణ శిక్షకుడి’ని నియమిస్తారు. కొన్నిసార్లు ఆయా విభాగాలకు ప్రత్యేకం శాఖలు ఉంటాయి. అంటే చిన్నపిల్లలకు ఒక శాఖ, విద్యార్ధులకు, ప్రొఫెషనల్స్‌కు, వయోజనులకు వేర్వేరుగా శాఖలు నిర్వహించే అవకాశం ఉంటుంది. సాధారణంగా 5 నుంచి 7గురు స్వయంసేవకులు కలిసి శాఖ నిర్వహిస్తారు. ప్రతీ శాఖకూ ఒక నాయకుడు ఉంటారు అతన్ని ‘గట నాయక్’ అంటారు. ఆ గట నాయక్ తన శాఖలోని ప్రతీ స్వయంసేవకుడి ఇంటికీ వెడతారు, వారి ఇంటిలోని వారితో పరిచయాలు పెంచుకుంటారు. ‘గట నాయక్’ నుంచీ నిర్వహణా నైపుణ్యాలు మొదలవుతాయి.

ప్రణాళికా నైపుణ్యాలు శాఖ స్థాయిలోనే అభివృద్ధి చెందుతాయి. క్రమంగా ప్రతీ చిన్న విషయాన్నీ వివరంగా ప్రణాళికాబద్ధం చేయడం ఒక అలవాటుగా మారుతుంది.

ఆ నైపుణ్యాల వల్లా, శాఖలో అబ్బే క్రమశిక్షణ వల్లా స్వయంసేవకులు అతిపెద్ద లక్ష్యాలను కూడా చాలా సులువుగా సాధించగలుగుతారు. భూకంపాలు, వరదలు, తుపానులు, కరోనా మహమ్మారి వంటి ప్రకృతి విపత్తుల సందర్భాల్లో స్వయంసేవకులు అందించే సేవల్లో వారిలోని ఆ గుణాలు స్పష్టంగా వెల్లడి అవుతాయి.

ఒకసారి గంగా మాత – భారత మాత యాత్ర నిర్వహించారు. అందులో భాగంగా 50వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించారు. అంత మహత్తర యాత్రలో సమయ పాలన కచ్చితంగా పాటించారు. ఎక్కడా ఏర్పాట్లలో ఎలాంటి అయోమయమూ లేదు. ఆ యాత్రను ‘మిలటరీ ప్రెసిషన్’ (సైనికుల అంతటి కచ్చితత్వంతో) ఆ యాత్ర జరిగింది అని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పత్రిక రాసుకొచ్చింది. ఆ మొత్తం కార్యక్రమానికి అఖిల భారత కన్వీనర్‌గా వ్యవహరించింది గౌరవనీయ మోరోపంత్ పింగళేజీ. ఆయన బాల్యం నుంచీ స్వయంసేవక్‌గానే ఉన్నారు.

కన్యాకుమారి దగ్గర సముద్రంలో వివేకానంద శిలా స్మారకాన్ని సాకారం చేసిన వ్యక్తి, ప్రతీ అడుగులోనూ ఆత్మవిశ్వాసంతో సంచరించాలి అంటూ అందరికీ సందేశాలు ఇచ్చిన వ్యక్తి అయిన ఏకనాథ్ రానడే వ్యక్తిత్వాన్ని బాహ్య ప్రపంచానికి చాటి చెప్పింది సంఘ శాఖలోనే. ఏకనాథ్ రానడేజీ వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దింది సంఘ శాఖలోనే. కన్యాకుమారిలో వివేకానంద స్మారకం ఏర్పాటయ్యాక ఆయన నడుం జాపి కూర్చోలేదు. స్వామి వివేకానంద స్ఫూర్తితో, సామాజిక సేవకు అంకితం అయిపోయిన విద్యార్ధులకు సరైన శిక్షణ ఇవ్వడం కోసం ఆయన ఒక విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసారు. వందల మంది కార్యకర్తలు ఆ ‘వివేకానంద కేంద్ర’లో శిక్షణ పొందారు, వారు దేశవ్యాప్తంగా సమాజ ఐక్యత కోసం కృషి చేస్తున్నారు.

తొలినాళ్ళలో నాగపూర్‌తో పాటు, మహారాష్ట్రకు చెందిన ఎంతో మంది స్వయంసేవకులు తమ ఇళ్ళను వదిలేసి దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్ళి అక్కడ శాఖ పనిని విస్తరించడంలో నిమగ్నమైపోయారు. పంజాబ్‌లో రాజాభావు పాటుర్కర్, మాధవరావు మూలే… ఢిల్లీలో వసంతరావు ఓక్.. ఉత్తరప్రదేశ్‌లో భావురావు దేవరస్, నానాజీ దేశ్‌ముఖ్… బిహార్‌లో మధుసూదన్ దేవ్… ఒడిషాలో బాబూరావ్ పలాధికార్… దక్షిణాదిన దాదారావు పరమార్థ్, దత్తోపంత్ ఠేంగడే, యాదవరావు జోషీ వంటి వారు అలా శాఖ కార్యాన్ని విస్తరింపజేసిన వందల మందిలో కొన్ని ప్రధానమైన పేర్లు. వారు ఎక్కడ పడుకునేవారు? ఏం తిని బతికేవారు? వారి చాతుర్యం, ప్రణాళికా రచన, ప్రతీ వ్యక్తితోనూ కలిసిపోయే గుణం, పట్టుదల ఎంతగానో ప్రశంసించదగ్గవి. అదంతా ఒక పద్ధతి వల్లనే సాధ్యమైంది. ఆ పద్ధతి పేరే సంఘ శాఖ.

ఇవాళ దేశవ్యాప్తంగా 80వేల శాఖలు నడుస్తున్నాయి. నేటికీ అలాంటి స్వయంసేవకులను పోషించడానికి పని చేస్తున్నాయి. ‘‘అలాంటి వ్యక్తుల కోసమే నేను వెతుకుతున్నాను. మనుషులను తయారు చేసే యంత్రాల కోసం అన్వేషిస్తున్నాను’’ అని స్వామి వివేకానంద చెప్పుకొచ్చారు. ఆ మాటలు చెబుతున్నప్పుడు ఈ దేశ ప్రజల నుంచి ఆయన ఏం ఆశిస్తున్నారు? ‘‘మృత్యువు కోరల్లోకి సైతం ప్రవేశించగల బుద్ధిమంతులూ ధైర్యవంతులూ అయిన యువత నాకు కావాలి. లోతు ఎంత ఉందో తెలియని మహాసముద్రాన్ని ఈదగలిగేవారు ఎవరో నేను తెలుసుకోవాలి. వారి హృదయాల్లో ప్రజ్వరిల్లుతున్న ఆశల జ్వాలలు నాకు కావాలి. భగవంతుని పట్ల విశ్వాసం అనే పవిత్రమైన కవచం ధరించి, ఇనుప కండలు ఉక్కు నరాలతో స్పందిస్తూ సత్‌ప్రవర్తన అనే కాంతిలో వెలుగులీనుతున్న యువతరం కావాలి. అట్టడుగు వర్గాల ప్రజల కోసం ప్రగాఢమైన దయా జాలీ కరుణ కలిగిన వేలమంది యువతీ యువకులు హిమాలయాల నుంచి కన్యాకుమారి వరకూ ప్రయాణించడానికి సిద్ధంగా ఉన్నారని దృఢంగా విశ్వసిస్తున్నాను. వాళ్ళు విముక్తి కోసం, సేవ కోసం, సమాజ ఉద్ధరణ కోసం, అన్ని రకాల సమానత్వం కోసం కృషి చేస్తారు. అప్పుడే ఈ దేశం పౌరుషంతో బూడిద నుంచి లేవగలుగుతుంది’’.

దేశ పునరుజ్జీవం గురించి స్వామి వివేకానంద ఆలోచనలను సాకారం చేయడానికి సంఘం ప్రయత్నాలు చేసిందంటే అది ఎంతమాత్రం అతిశయోక్తి కాదు. ఆ ప్రయత్నాలకు రూపమే ‘శాఖ’ వ్యవస్థ. దేశమాత సేవ కోసం సామాన్య మానవులను స్వయంసేవకులుగా తీర్చిదిద్దుతోంది సంఘ శాఖ వ్యవస్థ.