News

రేపే అప్పన్న గిరి ప్రదక్షిణ

201views

విశాఖపట్నం శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి కొలువైన సింహగిరి ప్రదక్షిణ(గిరి ప్రదక్షిణ) బుధవారం జరగనుంది. లక్షలాది మంది భక్తులు గిరి ప్రదక్షిణ చేస్తారని అంచనావేసి కలెక్టర్‌ హరేందిర ప్రసాద్‌, దేవస్థానం ఈవో వి.త్రినాథరావు ఆధ్వర్యంలో అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లు చేస్తున్నారు. గిరి ప్రదక్షిణ మార్గంలో భక్తులు సేద తీరేందుకు 29 ప్రాంతాల్లో స్టాళ్లు, 31 చోట్ల వైద్య శిబిరాలు, 12 ప్రదేశాల్లో 17 అంబులెన్సులు, 5 ప్రదేశాల్లో పబ్లిక్‌ అడ్రసింగ్‌ సిస్టమ్‌లను ఏర్పాటు చేస్తున్నారు. ఈసారి ప్రతీ స్టాల్‌ వద్ద మెడికల్‌ క్యాంపు ఏర్పాటు చేశారు.

భక్తులు మధ్యాహ్నం 2 గంటలకు చేరుకోవాలి
కొండదిగువ స్వామి తొలిపావంచా వద్ద నుంచి బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు స్వామి మూలవిరాట్‌, ఉత్సవమూర్తులు కొలువుదీరిన ప్రచార రథం బయలుదేరుతుంది. రథంతో పాటు గిరి ప్రదక్షిణలో పాల్గొనే భక్తులంతా ఆ సమయానికి తొలిపావంచా వద్దకు చేరుకోవాల్సి ఉంటుంది.

పుష్పరథం తిరిగే మార్గం
తొలిపావంచా, అడవివరం, పైనాపిల్‌కాలనీ, సెంట్రల్‌జైల్‌, హనుమంతవాక, విశాలాక్షినగర్‌, జోడుగుళ్లపాలెం, తెన్నేటి పార్కు, అప్పుఘర్‌, ఎంవీపీ కాలనీ డబుల్‌రోడ్డు, మద్దిలపాలెం, సత్యం జంక్షన్‌, ఎన్‌ఏడీ కొత్తరోడ్డు, గోపాలపట్నం, ప్రహ్లాదపురం మీదుగా తిరిగి సింహాచలం చేరుకుంటుంది.

పబ్లిక్‌ అడ్రసింగ్‌ సిస్టంలు ఏర్పాటుచేసే ప్రదేశాలు
తొలిపావంచా, పాతగోశాల జంక్షన్‌, అడవివరం జంక్షన్‌, అప్పుఘర్‌, మాధవధార

దర్శన సమయాలు
9వ తేదీన ఉదయమే గిరి ప్రదక్షిణ ప్రారంభించి అదే రోజు రాత్రికి తిరిగి సింహాచలం చేరుకునే భక్తులకు రాత్రి 10 గంటల వరకు దర్శనాలు లభిస్తాయి. 10వ తేదీ ఉదయం 5.30 గంటల నుంచి మధ్యాహ్నం 2.30 గంటల వరకు నిర్విరామంగా దర్శనాలు కల్పిస్తారు. తిరిగి సాయంత్రం 5 నుంచి రాత్రి 7గంటల వరకు దర్శనాలు లభిస్తాయి.

10న ఆలయ ప్రదక్షిణలు
సింహగిరిపై 10న ఆలయ ప్రదక్షిణలు చేసే భక్తులను తెల్లవారుజామున 3గంటల నుంచి అనుమతిస్తారు.

ఉచిత ప్రయాణం
10వ తేదీ ఉదయం 3 గంటల నుంచి భక్తుల రద్దీ ముగిసే వరకు కొండపై నుంచి దిగువకు, దిగువ నుంచి కొండపైకి 50 ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఏర్పాటు చేశారు. దేవస్థానం బస్సులు కూడా అందుబాటులో ఉంటాయి.

స్టాళ్లు, మెడికల్‌ క్యాంపులు
స్టాళ్లు, మెడికల్‌ క్యాంపులు స్వామి తొలిపావంచా, అడవివరం గ్రౌండ్‌, పైనాపిల్‌కాలనీ, సెంట్రల్‌జైల్‌, ముడసర్లోవ పార్కు, చినగదిలి, పెదగదిలి, ఎల్‌.వి.ప్రసాద్‌ కంటి ఆస్పత్రి, జోడుగుళ్లపాలెం, తెన్నేటి పార్కు, అప్పుఘర్‌, వెంకోజీపాలెంలోని ఆంజనేయస్వామి ఆలయం, సీతమ్మధారలోని అల్లూరి సీతారామరాజు విగ్రహం, నరసింహనగర్‌, సింగాలమ్మ ఆలయం డాక్‌యార్ట్‌ క్వార్టర్స్‌, పోర్టు డీఎల్‌బి క్వార్టర్స్‌, సీఐఎస్‌ఎఫ్‌ క్వార్టర్స్‌, మురళీనగర్‌, మాధవధార వాటర్‌ఫాల్స్‌, మాధవధార, ఏపీ ఎలక్ట్రిసిటీ బోర్డు కార్యాలయం, ఆర్‌అండ్‌బి కార్యాలయం, ఎన్‌ఎస్‌టీఎల్‌ ఫ్యామిలీ గేట్‌, లక్ష్మీనగర్‌, కుమారి కల్యాణమండపం, పాత గోశాల జంక్షన్‌, అడవివరం ఆరోగ్య కేంద్రం ఏరియా, శ్రీదేవి కాంప్లెక్స్‌, సింహగిరి మెట్లమార్గంలో ఏర్పాటు చేస్తున్నారు.

ఏర్పాట్లు ఇలా..
● తొలిపావంచా వద్ద భక్తులు కొబ్బరికాయలు కొట్టేందుకు 45 క్యూలు, 100 ఇనుప గడ్డర్లు ిసిద్ధం చేస్తున్నారు. అడవివరం నుంచి హనుమంతవాక వెళ్లే బీఆర్‌టీఎస్‌ మార్గంలోని రెండో టోల్‌గేట్‌ వద్ద 20 ఇనుప గడ్డర్లు, 10 క్యూలు ఏర్పాటు చేస్తున్నారు.

● గిరి ప్రదక్షిణ మార్గంలో దాదాపు 40 ప్రాంతాల్లో 400 తాత్కాలిక మరుగుదొడ్లను జీవీఎంసీ ఏర్పాటు చేస్తోంది. దేవస్థానం ఏర్పాటు చేసే అన్ని స్టాళ్లలో జీవీఎంసీ మంచినీటి సరఫరా చేస్తోంది.

● అప్పుఘర్‌ వద్ద స్నానాలు ఆచరించే భక్తుల సౌకర్యార్థంతాత్కాలిక మరుగుదొడ్లు, వైద్యశిబిరం, రెండు జనరేటర్లు, కమాండ్‌ కంట్రోలింగ్‌ సిస్టం ఏర్పాటు చేస్తున్నారు. 60 మంది గజ ఈతగాళ్లను మూడు షిప్టుల్లో విధులు నిర్వహించే విధంగా ఏర్పాటు చేశారు.

● మాధవధార వద్ద 60 తాత్కాలిక మరుగుదొడ్లు, ఒక వైద్య శిబిరం, 50 ఎల్‌ఈడీ లైట్లు, ఒక జనరేటర్‌, పబ్లిక్‌ అడ్రసింగ్‌ సిస్టం సిద్ధం చేస్తున్నారు.

● పోలీస్‌ కమిషనర్‌ శంఖబ్రత బాగ్చీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.

● గిరి ప్రదక్షిణ మార్గంలో 9వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 10వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు మద్యం దుకాణాలను మూసివేయనున్నారు.

● 10న ఆలయ ప్రదక్షిణలకు గాను ఉత్తర రాజగోపురం, దక్షిణ రాజగోపురం వద్ద వంతెనలను సిద్ధం చేస్తున్నారు.

● 10వ తేదీన సింహగిరికి వచ్చే భక్తుల కోసం 10,800 రన్నింగ్‌ ఫీట్‌ మేర క్యూలను ఏర్పాటు చేశారు. ఒకేసారి సుమారు 9 వేల మంది క్యూల్లో వేచి ఉండవచ్చు.

● 10న కేవలం కొండపైకి మెట్లమార్గంలో వెళ్లే భక్తులను మాత్రమే అనుమతిస్తారు. స్వామి దర్శనం తర్వాత కొండదిగువకి ఉచితంగా ఏర్పాటు చేసిన బస్సుల్లో మాత్రమే వెళ్లాల్సి ఉంటుంది.

● అగ్నిమాపక శకటాలను అందుబాటులో ఉంచుతున్నారు.

● రెండో ఘాట్‌రోడ్డు వద్ద స్వామివారి నమూనా ఆలయాన్ని ఏర్పాటు చేస్తున్నారు.

● 9,10 తేదీల్లో అన్ని ఆర్జిత సేవలు రద్దు చేశారు.