
భారతీయ సముద్ర జలాల్లో అనుమానాస్పదంగా సంచరిస్తున్న చైనా నౌకను మన దేశ నావికాదళం విజయవంతంగా తరిమికొట్టింది. ఈ ముఖ్య ఘటన అండమాన్ నికోబార్ దీవులలోని పోర్ట్ బ్లెయిర్ వద్ద చోటు చేసుకుంది. చైనా దేశానికి చెందిన షి యాన్ 1 అనే నౌక ఈ ప్రాంతంలోని సముద్ర జలాలలో పరిశోధనా కార్యక్రమాలను చేస్తూ ఉంది. దీనిని భారత నావికాదళ నిఘా విమానం పసికట్ట్టింది. అనంతరం పరిస్థితిని అంచనా వేయడానికి భారత్ ఒక యుద్ధ నౌకను అక్కడికి పంపింది. భారత్ కు చెందిన ప్రత్యేక వాణిజ్య జోన్‌లో, ఇతర దేశాలకు చెందిన నౌకలు పరిశోధన లేదా అన్వేషణ కార్యకలాపాలను సాగించడం నిషిద్ధం. అందువల్ల ఆ చైనా నౌకను భారతీయ జలాల్లోనుండి బయటకు వెళ్లమని మన దేశ యుద్ధనౌక హెచ్చరించింది. దీనితో ఆ నౌక భారత సముద్ర జలాల నుండి చైనా వైపు కదిలిపోయినట్టు తెలిసింది. అయితే, ఈ ఓడను చైనా గూఢచర్య కార్యకలాపాలకు కూడా వాడుతూ ఉండవచ్చని విశ్వసనీయ సమాచారం.
హిందూ మహాసముద్ర జలాలలో, ఆగ్నేయ సముద్ర ప్రాంతంలో జరిగే కార్యకలాపాలపై భారత్ ఒక కన్ను వేసి ఉంచటానికి అండమాన్ నికోబార్ ప్రాంతం కీలక పాత్ర పోషిస్తుంది. సముద్రపు దోపిడీలను నిరోధించడానికి అనే వంకతో భారత సముద్ర జలాల్లోకి తరచుగా ప్రవేశించడం చైనాకు అలవాటుగా మారింది.
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.





