News

370 ఆర్టికల్ రద్దు తరవాత పుట్టుకొచ్చిన ఉగ్రమూక టీఆర్‌ఎఫ్

299views

జమ్ముకశ్మీర్ పెహల్గాం ఉగ్రదాడి తరవాత టీఆర్‌ఎఫ్ ఉగ్రసంస్థ కార్యకలాపాలు మరోసారి చర్చకు దారితీసింది. లష్కర్ ఏ తొయ్యబా సంస్థపై నిషేధం విధించడంతోపాటు, అగ్రరాజ్యం అమెరికా పాకిస్థాన్‌కు ఆర్థిక సాయం నిలిపేయడంతో దానికి అనుబంధంగా టీఆర్‌ఎఫ్ ఉగ్ర సంస్థను ఏర్పాటు చేశారు. పాకిస్థాన్ ఐఎస్ఐ సహకారంతో లష్కర్ ఏ తొయ్యబా ఉగ్రవాదులను టీఆర్‌ఎఫ్‌లో చేర్చుకుని దాడులకు పాల్పడుతున్నారు.

జమ్ము కశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తి కల్పించిన ఆర్టికల్ 370 రద్దు తరువాత టీఆర్‌ఎఫ్ ఉగ్రమూక పుట్టుకొచ్చింది. ద రెసిస్టెన్స్ ఫ్రంట్ పేరుతో ఆరేళ్లుగా ఉగ్రదాడులకు తెగబడుతోంది. కేంద్రం టీఆర్‌ఎఫ్‌ను నిషేధించింది. టీఆర్‌ఎఫ్ వ్యవస్థాపకుడు షేక్ సజ్జాద్ గుల్ మొదట ఆన్‌లైన్ వేదికగా చెలరేగిపోయాడు. తరవాత లష్కర్ ఉగ్రమూకల వద్ద శిక్షణ పొందిన సాజిద్ జాట్, సలీం రెహ్మాన్‌లను నియమించుకున్నాడు.ఈ సంస్థలో పదుల సంఖ్యలో ఉగ్రవాదులు ఉన్నట్లు కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించాయి. జమ్ము కాశ్మీర్‌లో ప్రముఖ జర్నలిస్ట్ బుఖారీ, ఆయన భద్రతా సిబ్బందిని హత మార్చడానికి 2018లో కుట్రపన్నారు. అప్పటి నుంచి టీఆర్‌ఎఫ్ కార్యకలాపాలు వెలుగులోకి వచ్చాయి.

టీఆర్‌ఎఫ్ ఉగ్రవాదులు హిందువులు, సిక్కులు, కశ్మీర్ పండిట్లు, ముస్లింలను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడుతున్నారు. 2020 ఏప్రిల్ 1న ఎల్వోసీ వెంట కుప్వారా జిల్లాలోని కేరన్ సెక్టార్‌లో నాలుగు రోజల పాటు భద్రతా దళాలతో టీఆర్‌ఎఫ్ కాల్పులకు తెగబడింది. 2020 అక్టోబరు 30 దక్షిణ కశ్మీర్ కుల్గాంలో ముగ్గురు బీజేపీ కార్యకర్తలను టీఆర్‌ఎఫ్ ఉగ్రవాదులు హతమార్చారు.

2020 నవంబరు 26న శ్రీనగర్ సమీపంలోని లాయేపోరా ప్రాంతంలో రాష్ట్రీయ రైఫిల్స్‌పై దాడికి తెగబడ్డారు. ఇద్దరు సైనికులను కాల్చి చంపారు.2023 ఫిబ్రవరి 26న పుల్వామాలో సంజయ్ శర్మ అనే కశ్మీరీ పండిట్‌ను ఉగ్రమూకలు కాల్చి చంపాయి. 2024 అక్టోబరు 20న గండేర్‌బల్‌లోని సోన్‌మార్గ్‌లో ఒక డాక్టరు, వలస కార్మికుడిని ఉగ్రవాదులు చంపేశారు. తాజాగా పహల్గాంలో టీఆర్‌ఎఫ్ ముక్కరులు చెలరేగిపోయారు. 28 మందిని పొట్టనబెట్టుకున్నారు.