News

భాషను బలవంతంగా రుద్దడం లేదు : స్టాలిన్‌ లేఖపై కేంద్రమంత్రి పోస్టు

237views

కేంద్ర ప్రభుత్వం ఏ భాషను బలవంతంగా రుద్దడం లేదని కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ స్పష్టం చేశారు. విదేశీ భాషపై అతిగా ఆధారపడటం వల్ల విద్యార్థులు భాషాపరమైన మూలాలను తెలుసుకోకుండా పరిమితం చేసినట్లవుతుందన్నారు. జాతీయ విద్యావిధానం ద్వారా ఈ పరిస్థితిని సరిచేసే ప్రయత్నం జరుగుతోందని మంత్రి ఎక్స్ వేదికగా వెల్లడించారు. తమిళ భాష శాశ్వతమని గతంలో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యను ప్రస్తావించిన మంత్రి.. తమిళ సంస్కృతి, భాషను విశ్వవ్యాప్తం చేసేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. విద్యను రాజకీయం చేయొద్దని విజ్ఞప్తి చేశారు. మోదీకి తమిళనాడు సీఎం లేఖ రాసిన నేపథ్యంలో మంత్రి నుంచి ఈ స్పందన వచ్చింది.

సమగ్రశిక్షా పథకం కింద రాష్ట్రానికి రూ.2,152 కోట్ల నిధులను వెంటనే మంజూరు చేయాలని ప్రధాని నరేంద్రమోదీని ముఖ్యమంత్రి స్టాలిన్‌ కోరారు. ప్రధానికి రాసిన లేఖలో.. జాతీయ విద్యా విధానం-2020ని పూర్తిగా అమలు చేసి త్రిభాషా విధానాన్ని ఆమోదించే వరకు తమిళనాడుకు సమగ్ర శిక్షా పథకం కింద నిధులు మంజూరు చేయబోమని కేంద్ర విద్యాశాఖ మంత్రి ఇటీవల వెల్లడించడంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఇది రాష్ట్రంలోని విద్యార్థులు, రాజకీయ పార్టీలు, ప్రజల మధ్య ఆవేదన, ఆక్రోశం కలిగించిందని తెలిపారు. సమగ్ర శిక్షా పథకం కింద నిధులు మంజూరు చేయకపోతే ఉపాధ్యాయులకు వేతనం, విద్యార్థులకు సంక్షేమ పథకాలను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాలు దెబ్బతింటాయన్నారు. 2024-25వ ఏడాదికి రాష్ట్రానికి అందాల్సిన రూ.2,152 కోట్లను వెంటనే మంజూరు చేయడానికి చర్యలు చేపట్టాలని కోరారు.