
భారత్‌లో ఎవరినో గెలిపించడానికి గత అధ్యక్షుడు జో బైడెన్ రూ.182 కోట్ల నిధులను కేటాయించారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ఈ వ్యవహారంపై తాజాగా భారత ప్రభుత్వం స్పందించింది. ఓటింగ్‌ను పెంచడం ద్వారా భారత ఎన్నికల్లో జోక్యం చేసుకునేందుకు యూఎస్‌ఎయిడ్ ప్రయత్నించిందనే వార్తలు తీవ్ర కలవరపాటుకు గురిచేస్తున్నాయని పేర్కొంది. దీనిపై సంబంధిత విభాగాలు దృష్టి సారించాయని వెల్లడించింది.
‘‘యూఎస్ కార్యకలాపాలు, నిధులకు సంబంధించి అమెరికా ప్రభుత్వ యంత్రాంగం వెల్లడించిన సమాచారాన్ని చూశాం. అవి తీవ్ర కలవరపాటుకు గురిచేస్తున్నాయి. ముఖ్యంగా భారత అంతర్గత వ్యవహారాల్లో విదేశీ జోక్యం ఆందోళనలకు దారితీశాయి. ఈ దశలో దీనిపై బహిరంగంగా మాట్లాడటం తొందరపాటే అవుతుంది. సంబంధిత అధికారులు ఈ వ్యవహారాన్ని పరిశీలిస్తున్నారు. పూర్తి సమాచారం వచ్చిన తర్వాతే దీనిపై మరిన్ని వివరాలు వెల్లడిస్తాం’’ అని భారత విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైశ్వాల్ వెల్లడించారు.
ట్రంప్ రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత వివిధ దేశాలకు అమెరికా చేసే సాయంపై పునఃసమీక్ష చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఇందులో భాగంగా యూఎస్‌ఎయిడ్‌ను తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ క్రమంలో భారత్‌లో ఓటింగ్ శాతం పెంచేందుకు 21 మిలియన్ డాలర్లు యూఎస్‌ఎయిడ్ ఖర్చు చేసిందనే విషయాన్ని డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. ఆ దేశంలో మరెవర్నో గెలిపించేందుకు వారు (బైడెన్ ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ) ప్రయత్నించినట్లు అర్థమవుతోందన్న ఆయన.. ఈ విషయాన్ని భారత్‌కు తప్పనిసరిగా తెలియజేయాలన్నారు.





