
( ఫిబ్రవరి 22 – జమ్మూ కాశ్మీర్ సంకల్ప దివస్ )
ఫిబ్రవరి 22ను జమ్మూ కాశ్మీర్ సంకల్ప దివస్‌గా మనం దేశవ్యాప్తంగా జరుపుకుంటాం. ఎందుకంటే 1948లో ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ పాకిస్తాన్ ఆక్రమించుకున్న జమ్మూకశ్మీర్‌లోని భారత భూభాగాన్ని తిరిగి వెనక్కు తెచ్చుకోవాలనే ఉద్దేశం ఇందులో ఉంది. 1994 ఫిబ్రవరి 22 భారత చరిత్రలో కీలకమైన రోజు. ఆరోజు భారత పార్లమెంటు ఉభయ సభల సంయుక్త సమావేశం ఒక ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించింది. జమ్మూకశ్మీర్‌లోని కొన్ని భాగాలను పాకిస్తాన్ ఆక్రమించడం భారత్‌కు ఎంతమాత్రం అంగీకారయోగ్యం కాదు అని ఆ తీర్మానం సారాంశం. పాకిస్తాన్ అన్యాయంగా ఆక్రమించిన భూభాగాలను తిరిగి స్వాధీనం చేసుకోడానికి భారతదేశం కృతనిశ్చయంతో ఉంది అని పార్లమెంటు ఉభయ సభల సభ్యులూ నిశ్చితంగా ప్రకటించారు.
1971 యుద్ధం తర్వాత తూర్పు పాకిస్తాన్.. బంగ్లాదేశ్ అనే ప్రత్యేక దేశంగా ఏర్పడింది. అప్పుడు చేసుకున్న సిమ్లా ఒప్పందం ప్రకారం పాకిస్తాన్ జమ్మూకశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయ వేదికలపై లేవనెత్తడం మానుకోవాలి. అన్ని సమస్యలనూ ద్వైపాక్షికంగా పరిష్కరించుకోవాలి. 1994 ఫిబ్రవరి 22న భారత పార్లమెంటు చేసిన తీర్మానానికి భౌగోళిక రాజకీయ ప్రాధాన్యం ఉంది. ఆ తీర్మానాన్ని చట్టం చేయడానికి కావలసిన నేపథ్యాన్ని అర్ధం చేసుకోవాలి. ఆ తీర్మానానికి మూలాలు 1984 నుంచీ జమ్మూకశ్మీర్‌లోని కశ్మీర్‌లోయ ప్రాంతంలో చోటు చేసుకున్న దుర్మార్గపు సంఘటనల్లో ఉన్నాయి. ఆ సమయంలోనే కశ్మీర్‌లోయలో ఉగ్రవాద కార్యకలాపాలు పెచ్చుమీరిపోయాయి, ఆ ప్రాంతపు స్థానికులైన కశ్మీరీ హిందూ పండితులు అక్కణ్ణుంచి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోయే పరిస్థితులు నెలకొన్నాయి.
జమ్మూకశ్మీర్‌లో ప్లెబిసైట్ అనబడే ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలంటూ పాకిస్తాన్ పదేపదే గొడవ చేయసాగింది. నిజానికి భారత భూభాగాలలోనుంచి (అంటే పాక్ ఆక్రమిత కశ్మీర్ – గిల్గిట్ బాల్టిస్తాన్ ప్రాంతాల నుంచి)ఆ దేశం ఉపసంహరించుంటే తప్ప అక్కడ, ఎలాంటి ప్రజాభిప్రాయ సేకరణా చేపట్టే యోచన చేయరాదని ఐక్యరాజ్యసమితి తీర్మానం స్పష్టంగా చెబుతోంది. దాన్ని కూడా పాకిస్తాన్ విస్మరించి, ప్లెబిసైట్ కోసం మొండివాదనలు చేయసాగింది. పాక్ వైఖరి ఇలా ఉంటే, 1994 ఫిబ్రవరి 22న భారత పార్లమెంటు ఏకగ్రీవ తీర్మానం చేయడం పాకిస్తాన్ వాదనలను ప్రభావవంతంగా తిప్పికొట్టింది. మొత్తం జమ్మూకశ్మీర్ ప్రాంతం మీద భారతదేశానికి ఉన్న తిరుగులేని చట్టబద్ధమైన, న్యాయబద్ధమైన సార్వభౌమాధికారాన్ని పునరుద్ఘాటించింది. 2016 ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం నాడు, అప్పటి ప్రధానమంత్రి నరేంద్రమోదీ తన ఎర్రకోట సందేశంలో ప్రస్తావన ద్వారా, సుదీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉండిపోయిన పాక్ ఆక్రమిత జమ్మూకశ్మీర్, గిల్గిట్ బాల్టిస్తాన్ అంశం పైకి అంతర్జాతీయ సమాజం దృష్టిని ఆకర్షించారు. 2019 ఆగస్లు 5న భారత రాజ్యాంగంలోని 370వ అధికరణానికి సవరణ చేయడం ద్వారా జమ్మూకశ్మీర్ రాష్ట్రాన్ని జమ్మూకశ్మీర్, లద్దాఖ్ అనే రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా పునర్విభజన చేసారు. గమనించవలసిన విషయం ఏంటంటే 2019 ఆగస్టు 6న కేంద్ర హోంమంత్రి అమిత్ షా, 1994 నాటి పార్లమెంటు తీర్మానాన్ని మరొక్కసారి ప్రస్తావించి, జమ్మూకశ్మీర్ భారతదేశంలో అంతర్భాగమన్న విషయాన్ని గుర్తు చేసారు. పాక్ ఆక్రమిత ప్రాంతాలను, చైనా అధీనంలో ఉన్న అక్సాయ్‌చిన్‌నూ తిరిగి స్వాధీనం చేసుకోవాలన్న భారతదేశపు నిబద్ధతను పునరుద్ఘాటించారు.
జమ్మూకశ్మీర్ పునర్విభజన తర్వాత భారతదేశం మొట్టమొదటిసారి పాక్ ఆక్రమిత భారత భూభాగాలను జమ్మూకశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతపు మ్యాప్‌లో మీర్‌పుర్, ముజఫరాబాద్ జిల్లాలుగా అధికారికంగా ప్రకటించింది.అలాగే గిల్గిట్ బాల్టిస్తాన్ ప్రాంతాన్ని కూడా లద్దాఖ్ కేంద్రపాలిత ప్రాంతంలోని లెహ్ జిల్లాలో భాగంగా, 1901కి ముందున్న సరిహద్దులతో సహా, ప్రకటించింది. అంతేకాదు, న్యాయబద్ధమైన దౌత్యమార్గాల ద్వారా భారత భూభాగాల విషయంలో ఉన్న సమస్యలను పరిష్కరించుకోడానికి భారతదేశపు నిబద్ధతను నిష్కర్షగా ప్రకటించింది. ఏదిఏమైనా, మనం మన భూభాగాలను తిరిగి స్వాధీనం చేసుకునే వరకు ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 22న పార్లమెంటరీ తీర్మానాన్ని పునఃసమీక్షించడం చాలా ముఖ్యం. ఆక్రమిత భూభాగాలను తిరిగి స్వాధీనం చేసుకోవడంలో దాని నిబద్ధత మరియు అసంపూర్ణమైన పనిని భారత పార్లమెంటుకు గుర్తు చేయడం ప్రజల బాధ్యత. ఆక్రమణ ద్వారా భూభాగాలు కోల్పోవు, కానీ ఒక దేశం మరియు దాని ప్రజలు వాటిని మరచిపోయినప్పుడు మాత్రమే కోల్పోతారు.





