
( ఫిబ్రవరి 22 – ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బలిదానం )
భారతీయుల్లో జాతీయ భావం అప్పటికి సరిగా మొగ్గతొడగలేదు. ఆధునిక చరిత్రకారులు ప్రథమ భారత స్వాతంత్య్ర సంగ్రామంగా పేర్కొనే సిపాయిల తిరుగుబాటు జరగలేదు. కానీ అంతకు పదేళ్ల క్రితమే నాటి కడప జిల్లా ఉయ్యాలవాడ గ్రామానికి చెందిన ఆ వీరుడు ఆంగ్లేయులపై తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. నేటికి సరిగ్గా 177 ఏళ్ల క్రితం అంటే 1847 ఫిబ్రవరి 22న ఉరికొయ్యను ముద్దాడి ఆయన భావి భారత జాతీయోద్యమానికి స్ఫూర్తిగా, దిక్చూచిగా నిలిచారు. ఆయనే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. ఆయన తలను 1877 వరకు కోయిలకుంట్ల కోటలో ఉరికొయ్యకు వేలాడదీశారంటే ఆంగ్లేయులపై ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఏ రీతిలో పోరాటం చేశారో మనం అర్థం చేసుకోవచ్చు.
నరసింహారెడ్డి కర్నూలు జిల్లాలోని రూపనగుడి గ్రామంలో జన్మించి ఉయ్యాలవాడలో పెరిగి పెద్దవాడయ్యాడు. వీరిది జమిందారీ కుటుంబం. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి తండ్రి పేరు పెదమల్లారెడ్డి, తల్లి పేరు నీలమ్మ. చిన్నప్పటి నుంచి ఆటపాటలతో పాటు అన్నింటిలో చురుగ్గా ఉండేవారు నరసింహారెడ్డి. యుక్తవయస్సులో ఆయనకు వివాహం అయ్యింది. నరసింహారెడ్డికి ముగ్గురు భార్యలు. మొదటి భార్య సిద్దమ్మ, రెండో భార్య పేరమ్మ. మూడో భార్య ఓబులమ్మ. 18వ శతాబ్దంలో రాయలసీమలో పాలెగాళ్ల వ్యవస్థ అమలులో ఉండేది. ఆ పాలెగాళ్లలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కూడా ఒకరు. నరసింహారెడ్డి తాతగారు జయరామిరెడ్డి మరణం తర్వాత పాలెగాళ్లకు ఇచ్చే భరణాన్ని బ్రిటిషు ప్రభుత్వం రద్దు చేసింది. జయరామిరెడ్డి వారసుడైన నరసింహారెడ్డికి ఇచ్చేందుకు నిరాకరించింది. అంతేకాదు భరణం కొరకు తన అనుచరుడిని పంపిస్తే అప్పటి తహసీల్దార్ చాలా అవమానించి పంపాడు. ఆ అవమానమే నరసింహారెడ్డిలో ఉద్యమ కాంక్షను రగిలించింది.
నరసింహారెడ్డి తనతో కలిసి వచ్చిన ఇతర పాలెగాళ్లను కూడగట్టుకొని 500 మంది బోయ సైన్యముతో కలిసి 1846 జూలై 10న కోవెలకుంట్ల ట్రెజరీపై దాడి చేశాడు. తహసీల్దార్ శిరస్సు ఖండించాడు. ట్రెజరీ అధికారి థామస్ ఎడ్వర్టుకి గుండు గీయించాడు. తర్వాత ప్రొద్దుటూరు సమీపంలోని దువ్వూరు ఖజానాను సైతం నరసింహారెడ్డి దోచుకున్నాడు. ఈ ఘటనల తర్వాత 1846 జూలై 23న బ్రిటిషు సైన్యం నొస్సం కోటపై దాడి చేసింది. అప్పటికే అప్రమత్తమైన నరసింహారెడ్డి శత్రువులపై ఎదురుదాడికి దిగాడు. పక్కా ప్రణాళికలు రచించడంతో బ్రిటిషు సైన్యం చెల్లాచెదురైంది. కెప్టెన్ వాట్సన్ తల నరికి బ్రిటిషర్లకు నరసింహారెడ్డి భయాన్ని పరిచయం చేశాడు. ఆ తర్వాత నరసింహారెడ్డి తన మకాంని నల్లమల అడవుల్లోని వనదుర్గంలోకి మార్చాడు. ఆ ప్రాంతానికి చెందిన అటవీశాఖాధికారి అయిన పీటర్ ప్రజల నుంచి బలవంతంగా డబ్బులు వసూలు చేయడం, ఆడవాళ్లతో అసభ్యంగా ప్రవర్తించడం వంటి అకృత్యాలకు పాల్పడేవాడు. ఈ విషయం తెలుసుకున్న ఉయ్యాలవాడ నరసింహారెడ్డి…పీటర్‌ను వేటాడి చంపాడు.
నరసింహారెడ్డి విజృంభణతో భయకంపితులైన బ్రిటిషర్లు ప్రతీకారం కోసం వేచి చూశారు. నరసింహారెడ్డి ఆచూకీ చెప్పిన వారికి 5 వేల రూపాయలు, సజీవంగా గానీ నిర్జీవంగా గానీ పట్టిచ్చినవారికి 10 వేల రూపాయలు బహుమతిని ప్రకటించారు. అయినా నరసింహారెడ్డి ఆచూకీ తెలియకపోవడంతో ఆయన భార్యాబిడ్డలను బ్రిటిషర్లు బంధించారు. వారి చెర నుంచి తన కుటుంబాన్ని నరసింహారెడ్డి రక్షించుకోవడంతో బ్రిటిష్ సైనికులు గ్రామాలపై దాడి చేశారు. కనపడ్డ వారందరినీ హింసించారు. మహిళలపై అత్యాచారాలు చేశారు.
నరసింహారెడ్డి తన ప్రజల కోసం లొంగిపోవడానికి సిద్ధపడ్డాడు. 1856 అక్టోబరు 6న నరసింహారెడ్డి ఆచూకీని బ్రిటిషర్లు కనుగొన్నారు. నల్లమల అటవీ ప్రాంతంలోని రామభద్రునిపల్లె సమీపంలోని గుట్టపై ఉన్న జగన్నాథాలయంలో ఉన్నాడని తెలుసుకున్న బ్రిటిష్ సైన్యం దాన్ని చుట్టుముట్టారు. బ్రిటిష్ సైన్యం కొండపైకెక్కడానికి ప్రయత్నించగా నరసింహారెడ్డి సైన్యం ఎదురొడ్డింది. ఈ యుద్ధంలో కెప్టెన్ నార్టన్ మరణించగా బాగా గాయపడిన నరసింహారెడ్డిని బ్రిటిషర్లు బంధించారు. అనంతరం ఆయనకు బ్రిటిష్ ప్రభుత్వం ఉరిశిక్ష విధించింది. 1847 ఫిబ్రవరి 22న జుర్రేడు ఒడ్డున అందరూ చూస్తుండగా ఉరి తీశారు. నరసింహారెడ్డి ఉరికొయ్యలను ఎక్కి చిరునవ్వుతో మరణాన్ని స్వాగతించాడు. తిరుగుబాటుదార్లకు హెచ్చరికగా నరసింహారెడ్డి తలను కోయిలకుంట్ల కోట గుమ్మానికి ఇనుప సంకెళ్ల మధ్య వేలాడదీశారు. 1877 వరకు అంటే 3 దశాబ్దాల పాటు నరసింహారెడ్డి శిరస్సు అలా వేలాడుతూ ఉండేదని స్థానికులు చెబుతారు.
ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని రేనాటి సూర్యుడిగా ప్రజలు ఇప్పటికీ ఆరాధిస్తూనే ఉన్నారు. కోవెలకుంట్ల, నొస్సం, ఉయ్యాలవాడ, రూపనగుడి ప్రాంతాల్లో ఆయన నిర్మించిన కోటలు ఇప్పటికీ ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో ప్రజలు ఆయన గాథలను కథలు కథలుగా చెప్పుకుంటారు. బ్రిటిషర్ల వెన్నులో వణుకు పుట్టించిన తెలుగువాడిగా ఖ్యాతి గడించిన నరసింహారెడ్డి తెగువను చూసి ప్రతి ఒక్కరూ గర్వించాలి. అన్యాయాన్ని ఎదిరించాలనే ఆయన సంకల్పాన్ని ఆదర్శంగా తీసుకోవాలి.





