
‘తిరుమల బాలాజీకి దేశవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు ఉన్నారు. తిరుమలకు వచ్చే భక్తులు ఎంతో నమ్మకంగా, ఆధ్యాత్మిక చింతనతో వస్తుంటారు. అలా వచ్చే వారి మనోభావాలు గాయపడకూడదు అన్నదే నా ఆవేదన. తిరుమల లడ్డులో కల్తీ జరగడం నిజంగా దురదృష్టకరం. ఇలాంటి ఘటనలు మళ్లీ భవిష్యత్తులో జరగకూడదు అన్నదే నా బలమైన ఆకాంక్ష’ అని ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ చెప్పారు. దక్షిణ భారతదేశ ఆలయాల యాత్రకు శ్రీకారం చుట్టిన పవన్ కళ్యాణ్ గారు కేరళలోని చొట్టనిక్కరలో ఉన్న శ్రీ ఆగస్త్య మహర్షి ఆలయం, అగస్త్య ఆశ్రమం సందర్శన అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ.. “తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు కల్తీ వ్యవహారంపై ఏర్పాటు అయిన ప్రత్యేక దర్యాప్తు బృందం – ఈ వ్యవహారంలో పాత్ర ఉన్న వాళ్ళని అరెస్టు చేయడం కేసు దర్యాప్తులో భాగం. భవిష్యత్తులో కూడా తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో జాగ్రత్తలు పాటించాలి. శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదాల్లో కానీ, ఇతర వ్యవహారాల్లో తగు జాగ్రత్తలు పాటించాలి.
ఇది నా వ్యక్తిగత పర్యటన
దక్షిణాది రాష్ట్రాల ఆలయాల సందర్శన అనేది పూర్తిగా నా వ్యక్తిగత అంశం. రాజకీయాలకు సంబంధం లేదు. సుమారు నాలుగున్నర సంవత్సరాల క్రితం చెల్లించుకోవలసిన మొక్కుల నిమిత్తం…నా ఆరోగ్యం సైతం అంతగా సహకరించకున్నా రావాల్సి వచ్చింది. కేరళతో పాటు తమిళనాడులో ఉన్న ఆలయాలను దర్శించుకుంటున్నాను.
పురాతనమైన కేరళలోని తిరువల్లం శ్రీపరశురాముడి ఆలయాన్ని ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ బుధవారం దర్శించుకున్నారు. ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు అధికారులు, ప్రధాన అర్చకులు పవన్‌కల్యాణ్‌కు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. శ్రీమహావిష్ణువు దశావతారాల్లో ఆరో అవతారమైన శ్రీపరశురాముడికి ఆయన ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రధాన అర్చకులు పూజలు నిర్వహించి వేదాశీర్వచనం, తీర్థప్రసాదాలు అందించారు. మొక్కులు చెల్లించుకున్న అనంతరం ఉప ఆలయాలను దర్శించుకున్నారు. పవన్‌కల్యాణ్ వెంట ఆయన కుమారుడు అకీరానందన్, తితిదే బోర్డు సభ్యుడు ఆనంద్‌సాయి ఉన్నారు.





