
నంద్యాల జిల్లా శ్రీశైలం ఆలయంలో ఈనెల 19 నుంచి మార్చి 1వరకు బ్రహ్మోత్సవాలతో పాటు ఈ ఏడాది మహాశివరాత్రి పండుగను వైభవంగా నిర్వహించనున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. ఆయన సహచర మంత్రులు వంగలపూడి అనిత, బీసీ జనార్దన్‌రెడ్డి, అనగాని సత్యప్రసాద్, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి, దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్, కలెక్టర్ రాజకుమారి గణియా, ఎస్పీ అదిరాజ్‌సింగ్ రాణా, ఆర్‌జేసీ చంద్రశేఖర్ ఆజాద్, ఈవో శ్రీనివాసరావుతో కలిసి వేడుకల ఏర్పాట్లపై సమీక్షించారు. అనంతరం మాట్లాడుతూ ఈనెల 23న ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వం తరఫున మల్లికార్జునస్వామి, భ్రమరాంబ అమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పించనున్నట్లు చెప్పారు. 24 నుంచి 27 వరకు భక్తులందరికీ ఉచితంగా లడ్డూ ప్రసాదం ఇస్తారని, క్యూలైన్లలో ఎప్పటికప్పుడు పాలు, బిస్కట్లు, అల్పాహారం పంపిణీ చేస్తారని తెలిపారు. 25, 26 తేదీల్లో రద్దీ దృష్ట్యా టోల్ వసూళ్లను నిలిపివేయనున్నట్లు ప్రకటించారు. భద్రత, పార్కింగ్, రద్దీ నియంత్రణకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.
శ్రీశైలం వచ్చే భక్తులకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. నల్లమల ప్రాంతం నుంచి వచ్చే వారికి తాగునీరు, ఆహారం అందిస్తాం. శ్రీశైలం పార్కింగ్ నుంచి సత్రాల వద్దకు వాహనాల్లో ఉచిత ప్రయాణం. బ్రహ్మోత్సవాల్లో ప్రతి భక్తుడికీ ఉచితంగా లడ్డూ ప్రసాదం ఇస్తాం. బ్రహ్మోత్సవాల్లో ఘాట్ రోడ్లపై ట్రాఫిక్ డ్రోన్ల ద్వారా పర్యవేక్షణ ఉంటుంది. దోర్నాల ఘాట్ రోడ్డుకు మరమ్మతులు చేసి ఇబ్బంది లేకుండా చూస్తాం’’ అని మంత్రి తెలిపారు.





