
తిరుపతిలోని అలిపిరికి సమీపంలో నిర్మిస్తోన్న ముంతాజ్ ఫైవ్ స్టార్ హోటల్ నిర్మాణాన్ని నూతనంగా ఏర్పడిన టీటీడీ బోర్డు వ్యతిరేకించిన సంగతి తెలిసిందే. శ్రీవారి పాదాల చెంత ముంతాజ్ హోటల్‌ను చూస్తే భక్తుల మనోభావాలు దెబ్బతింటాయని భావించిన టీటీడీ బోర్డు.. ఆ హోటల్‌కు కేటాయించిన 20 ఎకరాల స్థలాన్ని వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తామని తెలిపింది. అయితే, టీటీడీ ఒక నిర్ణయం తీసుకున్నా.. ముంతాజ్ హోటల్ మాత్రం నిర్మాణ పనులను ఆపలేదని.. రహస్యంగా పనులు జరుపుతోందని ఆరోపిస్తూ పలు హిందూ సంఘాల నాయకులు, స్వామీజీలు తిరుపతిలోని తుడా కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. ముంతాజ్ హోటల్‌కు కేటాయించిన స్థలాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని స్వామీజీలు డిమాండ్ చేశారు. శ్రీవారి పవిత్రకు భగ్నం కలిగించే నిర్మాణాలపై తక్షణం తుడా అధికారులు చర్యలు తీసుకోవాలని.. లేని పక్షంలో హిందూ ధార్మిక సంఘాలు కలిసి ఆందోళన ఉధృతం చేస్తాయని స్వామీజీలు హెచ్చరించారు
ఆధ్యాత్మిక నగరాన్ని పర్యాటకం పేరిట కూటమి ప్రభుత్వం ముంతాజ్ హోటల్ పేరు మార్చి స్థలం కేటాయించడంపై హిందూ సంఘాలు భగ్గుమన్నాయి.తిరుపతిలోని అలిపిరిలో తిరుమల తిరుపతి దేవస్థాన భవనం ఎదుట ముంతాజ్ హోటల్‌కు స్థలం కేటాయించడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ చర్యను ఖండిస్తూ.. హిందూ సంఘాలు, స్వామీజీలు ఆమరణ నిరాహార దీక్షకు దిగారు.
టీటీడీ పాలక మండలి సమావేశం ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తీర్మానం చేసినా.. ప్రభుత్వం మాత్రం స్థలాన్ని కేటాయించింది. అయితే.. ముంతాజ్ హోటల్‌కు కేటాయించిన స్థలం వెనక్కి తీసుకోవాలంటూ శ్రీనివాసానంద సరస్వతి స్వామి నేతృత్వంలో పలువురు స్వామీజీలు ఆమరణ నిరాహార దీక్ష దిగారు. తిరుమల ఏడుకొండలు రక్షించుకుందామంటూ నినాదంతో దీక్ష చేపట్టారాయన. ఈ క్రమంలో.. ప్రభుత్వాన్ని పలు ప్రశ్నలు సంధిస్తూ.. ఫోటోలతో ప్రదర్శన చేపట్టారు.





