
మహాకుంభ మేళా సనాతన విశ్వాసానికి, సాధువులకు, భక్తులకు నిలయం. ఇది ఫైవ్ స్టార్ సంస్కృతిని ప్రతిబింబించే గ్లామర్ కూడలి కాదు. మీడియా అటువంటి విషయాలకే ఎక్కువగా ప్రచారం కల్పించడం సరికాదు” అని మహంత్ ధర్మేంద్రదాస్ అన్నారు. ఉదాసీన్ అఖాడా అధిపతి అయిన ఈయన ఆలిండియా ఉదాసీన్ కమ్యూనల్ సంగత్ ఛైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. పీటీఐతో ధర్మేంద్రదాస్ మాట్లాడుతూ.. వీఐపీల కదలికలతో అధికారులు బిజీగా మారి, ముఖ్యమంత్రి యోగి కృషిని వ్యర్థం చేస్తున్నారన్నారు.
గత నెలలో మహాకుంభమేళా ప్రారంభమైనప్పటి నుంచి అనేక మంది సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్స్, మోడల్స్, నటులు వైరల్ అయ్యారు. ఈ ఘటనలతో అసంతృప్తికి లోనైన ధర్మేంద్ర దాస్ మహాకుంభమేళా వద్దో త్రివేణి రోడ్ స్థల్ లో మాట్లాడారు. ‘‘మహాకుంభ్ అనేది ఫైవ్ స్టార్ కల్చర్, గ్లామర్ కు కేంద్రం కాదు.
సాధువులు, భక్తుల సనాతన విశ్వాసాలకు కేంద్రం. మీడియా అనేది సాధువులకు సేవ చేయాలి. కానీ, అలాంటి వారిని ప్రోత్సహిస్తుందంటే తప్పు మీడియాదే అవుతుంది. మీడియా సంస్థలు ఎందుకు ఇలా చేస్తున్నాయి? మీరే దాని గురించి ఆలోచించాలి. విశ్వాసంతో మహాకుంభమేళాకు వచ్చిన భక్తులు నిజమైన మోక్షం పొందుతారు” అని ధర్మేంద్ర దాస్ చెప్పారు.
ప్రకృతిసేద్యంపై అవగాహన
ప్రయాగ రాజ్ లో యూపీకి చెందిన జాతీయ రైతు అవార్డు విజేత ప్రదీప్ కుమార్ దీక్షిత్ ఆవుపేడ ఆధారిత ప్రకృతి సేద్యంపై కుంభమేళా యాత్రికులకు అవగాహన కల్పిస్తున్నారు. సెక్టార్ 8లోని ఎనిమిది ఎకరాల భూమిలో ‘ప్రాకృతిక్ కిసాన్ పరివార్’ పేరుతో ఈయన ఏర్పాటుచేసిన స్టాళ్లను మేళాకు వచ్చిన రైతులు సందర్శించి వివరాలు అడిగి తెలుసుకొంటున్నారు.





