
ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు శ్రీతిరుపతమ్మ అమ్మవారి పెద్ద తిరునాళ్లు మంగళవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయ ఈవో కిషోర్ కుమార్ ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అఖండ దీపం వెలిగించి తిరునాళ్లు అధికారికంగా ప్రారంభించారు. 45 రోజుల మండల దీక్షలు పూర్తి చేసిన దీక్షా స్వాములు ఇరుముడులతో ఆలయానికి తరలివచ్చి అమ్మవారికి సమర్పించారు. సోమవారం రాత్రి నుంచి వివిధ జిల్లాల నుంచి భక్తులు, దీక్షా స్వాములు పెద్ద ఎత్తున వేలాదిగా తరలివచ్చి ఆలయ పరిసరాల్లో బస చేశారు. ఆలయ పరిసరాలు భక్తులతో కిటికిటలాడుతున్నాయి. క్యూలైన్లు నిండిపోయి ఆలయం బయట వరకు భక్తులు వేచి ఉన్నారు.
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఆలయ పరిసరాల్లో 40 సీసీ కెమెరాలతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. పోలీసులు డ్రోన్ కెమెరాల సాయంతో పర్యవేక్షిస్తున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలను పార్కింగ్ ప్రదేశాలకు పంపిస్తూ ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. వేలాదిగా తరలివచ్చిన భక్తులు, దీక్షా స్వాములకు అల్పాహారం, తాగునీరు, వసతి ఏర్పాట్లు కల్పించారు. నందిగామ ఆర్టీవో బాలకృష్ణ ఆధ్వర్యంలో సబ్ డివిజన్ రెవెన్యూ పంచాయతీ అధికారులతో పాటు తిరుపతమ్మ దేవస్థానం అధికారులు, సిబ్బంది ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.





