
ప్రఖ్యాత పండితుడు, కశ్మీర్ శైవిజం తంత్ర అభ్యాసకుడు రాజనాక మార్క్ డైకోవ్స్కీ మరణంపై రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సంతాపాన్ని ప్రకటించింది. ఈయన మరణంతో తమకెంతో బాధ కలిగించిందని ఆరెస్సెస్ సర్ కార్యవాహ్ దత్తాత్రేయ హోసబళే పేర్కొన్నారు. చాలా లోతైన రచనలు చేసి, చాలా మంది అన్వేషకులకు మార్గాన్ని చూపించారని కొనియాడారు. ఆయన జ్ఞానం ఎంత ప్రకాశవంతమైందో… అంతకంటే ఎక్కువ ప్రకాశవంతంగా ఊర్ధ్వలోక గమనం సాగాలని ఆకాంక్షిస్తున్నట్లు హోసబళే ఓ ప్రకటన విడుదల చేశారు.
మార్క్ డైకోవ్స్కీ ఇంగ్లాండ్ లో జన్మించారు. అయితే తన జీవితాన్ని మాత్రం కశ్మీర్ శైవిజం, తంత్రాల అధ్యయనం, అభ్యాసం, వ్యాప్తికే అంకితం చేశారు. భారత దేశ సంప్రదాయాలు, రహస్యాలపై అనేక పరిశోధనలు చేశారు. అతని లోతైన, విస్తృతమైన పరిశోధనలు పరిశోధనా రంగంలో అతనికి ఎంతో కీర్తిని తెచ్చిపెట్టాయి. పరిశోధకులకు ఓ దిక్సూచిగా నిలిచాయి. ముఖ్యంగా సంస్కృత గ్రంథాలపై చాలా లోతైన పరిశోధనలు చేశారు. మరీ ముఖ్యంగా కశ్మీర్ శైవిజయం, తంత్రాలకి సంబంధించిన లోతైన పరిశోధనలు చేశారు.
భారత్ లోని ప్రముఖ పండితుల వద్ద, సంప్రదాయ గురువుల వద్ద విద్యాభ్యాసం చేశారు. శైవమతంపై గురువుల దగ్గర మార్గదర్శనం తీసుకున్నారు.దీంతో మెళ్లిగా ఆధ్యాత్మిక జీవనం వైపు వెళ్లారు. తాంత్రిక సిద్ధాంతాలపై పరిశోధనలు చేశారు. కామికాగామ, స్పంద కారికలు మరియు భారీ కుబ్జికా లాంటి రచనలు చేశారు. అతని మాగ్నమ్ ఓపస్, ది డాక్ట్రిన్ ఆఫ్ వైబ్రేషన్: యాన్ అనాలిసిస్ ఆఫ్ ది డాక్ట్రిన్స్ అండ్ ప్రాక్టీసెస్ ఆఫ్ కాశ్మీర్ శైవిజం, త్రిక శైవిజం అధ్యయనంలో ఒక ప్రాథమిక గ్రంథం. ఇది కశ్మీర్ శైవమతంలో దాగి వున్న కీలకమైన తాత్విక, సిద్ధాంతిక పునాదులను తెలియజేస్తుంది.





