ArticlesNews

సాధన మార్గం సంచారం

209views

( జనవరి 25 – పర్యటన దినోత్సవం )

పర్యటనలు బుద్ధిని వికసింపచేస్తాయి. లోకాన్ని కొత్త గవాక్షంలోంచి పరిచయం చేస్తాయి. విహారయాత్రలైనా, తీర్థయాత్రలైనా.. ఆయా సంస్కృతీ సంప్రదాయాలను పరిశీలిస్తూ, నాగరికతలను అర్థం చేసుకుంటూ ముందుకు సాగాలి. చంచలత్వం నుంచి ముక్తులమై పరమ శాంతిని ప్రాప్తించుకోవటానికీ, పరిపూర్ణతను సాధించటానికీ అవి సాయపడాలి.

గడప దాటితేనే జ్ఞానోదయం
గడప దాటందే బుద్ధి వికసించదు. లోకాన్ని పరిశీలించినప్పుడే లౌకిక, పారమార్థిక జ్ఞానం సాధ్యమవుతుంది. శ్రవణ, పఠనాల కన్నా దర్శనం ద్వారానే పరిపూర్ణ అనుభూతిని పొందగలం. ఉదాహరణకు కాశీలో గంగా హారతులు, కన్యాకుమారి సాగరతీరంలో సంధ్యా సమయాలు, వెన్నెల కాంతిలో తాజ్‌మహల్‌ అందాలు, నీలగిరి కొండలపై పచ్చని తివాచీ పరచినట్లు తేయాకు తోటలు, బోధగయలో గౌతముడి జ్ఞానోదయపు ఆనవాళ్లు, బృందావనంలో శ్రీకృష్ణుడి బాల్యలీలా చిహ్నాలు, యమునానది పరవళ్లు.. ఇలాంటివన్నీ ప్రత్యక్షంగా వీక్షించినప్పుడే మనోఫలకంపై ముద్రితమై చిరకాలం నిలిచిపోతాయి. ఇలా ఏ యాత్ర చేసొచ్చినా మనసులో మధురానుభూతులు చిత్రితమౌతాయి. యథాలాపంగా ప్రయాణించటం పర్యటన కాదు.. తద్వారా స్ఫూర్తిని పొంది, దీప్తితో సాగాలి.
అనుభవాలూ అనుభూతుల దొంతర్లు

ఏకాంతాన్ని కల్పించి, అంతర్ముఖత్వానికి తోడ్పడినప్పుడే పర్యటన సార్థకమౌతుంది. దత్తాత్రేయస్వామి వంటి దైవాంశ సంభూతులు దేశమంతా పర్యటించి, తమకు ఎదురైన అనుభవాలను ఆధ్యాత్మిక పాఠాలుగా భక్తులకు బోధించారు. అలాగే స్వామి రామతీర్థ, యోగానంద లాంటి ఆధ్యాత్మికవేత్తల సంచార జీవనం వారి పారమార్థిక ఉన్నతికి ఎంతో సాయపడింది. అన్నమయ్య, త్యాగయ్య, కబీర్‌దాస్, తులసీదాస్‌ లాంటి కవులు, తాత్త్వికులు తమలో భక్తి, వైరాగ్య భావనలను ఇనుమడింప చేసుకునేందుకు పుణ్య క్షేత్రాలూ తీర్థాలను దర్శించారు. ఎందరో మహానుభావుల్ని సందర్శించుకున్నారు. స్థల మాహాత్మ్యాలకు పరవశించి పోయారు. తమ అనుభవాలూ అనుభూతుల దొంతర్లను అక్షరాల్లో పొందుపరచి, ఆ జ్ఞానసంపదను నలుగురికీ పంచిపెట్టారు.

పురాణాల్లో పర్యటనలు
వాయు, స్కాంద తదితర పురాణాలు యాత్రల ప్రాధాన్యత గురించి ప్రముఖంగా ప్రస్తావించాయి. విదురుడు లాంటి జ్ఞాని తన జీవితంలోని సంఘర్షణ సమయాల్లో దేశసంచారంతో ఉపశమనాన్ని పొందాడు. పురాణాలూ ఇతిహాసాలూ కూడా యాత్రల విశిష్టతను వివరించాయి. సంపూర్ణ విశ్వాసంతో, సంయమనంతో చేసే యాత్రలు మేధోవికాసానికి తోడ్పడతాయని వాయుపురాణం పేర్కొంది. పుణ్యప్రదేశాలు, అక్కడి మహాత్ముల దర్శనం జీవితాన్ని మలుపు తిప్పుతుందని, అల్పమైన ఆలోచనలు రూపుమాస్తాయని స్పష్టం చేసింది.

పర్యటనలు.. పరమాచార్యులు

జగద్గురువులుగా భాసించిన మహానుభావులు కూడా దేశాటనకు ప్రాధాన్యం ఇచ్చారు. శంకరాచార్యులు తన ముప్పై రెండేళ్ల జీవితంలోనే దేశంలోని ఎన్నో ప్రాంతాలు నడయాడారు. తీర్థక్షేత్రాల్లో తన ఆధ్యాత్మికశక్తిని నిక్షిప్తంచేశారు. ఆ ప్రాంతాల స్ఫూర్తితో భక్తికావ్యాలూ రచించారు. రామానుజాచార్యులు తమిళనాట శ్రీరంగంలో ఆధ్యాత్మిక సాధనల్ని కొనసాగించినా కశ్మీర్‌ వరకు పర్యటించారు. కేరళ వెళ్లారు. తిరువనంతపురం అనంతపద్మనాభస్వామిని దర్శించుకున్నారు. ఆ క్షేత్ర సమీపంలోనే విశిష్టాద్వైత మఠాన్ని స్థాపించారు. నేడది రామానుజ మఠంగా ప్రసిద్ధమైంది. కేరళ ప్రకృతి రమణీయతకు రామానుజులు ముగ్ధులయ్యారు. అనంతరం ద్వారక, మధుర దర్శించుకున్నారు. బదికాశ్రమం, నైమిశారాణ్యం, అయోధ్య, బృందావనం పర్యటించారు. కశ్మీర్‌ చేరుకొని అక్కడ విశిష్టాద్వైతాన్ని బోధించారు. తర్వాత కురుక్షేత్రం, ప్రయాగ, వారణాసి ప్రాంతాలనూ సందర్శించారు.

భక్తియానంలో నయనార్లు..
శివభక్తులైన నయనార్లు కూడా దేశసంచారం చేస్తూ మహాశివుని ప్రాభవాన్ని వ్యాప్తి చేశారు. ఉదాహరణకు మహాసుందర మూర్తి అనే శివభక్తుడు గ్రామం నుంచి గ్రామానికి, కోవెల నుంచి కోవెలకి తిరుగుతూ శివసంకీర్తనం చేసేవాడు. అలా సంచరిస్తున్న సుందరమూర్తికి మహేశ్వరుడి దర్శనం అయిందని చరిత్ర కథనం. అలాగే ఏడో శతాబ్దం నాటి అప్పర్, ఉత్తర భారతానికి చెందిన పండితుడు సుందరనాథుడు తదితరులు కదిలే కోవెలలుగా విరాజిల్లారు. సుందరనాథుడు దక్షిణభారత సంచారంలో భాగంగా తమిళనాట సాతనూరు ప్రాంతానికి వచ్చి, శివజ్ఞానయోగిగా మారి.. స్థానిక కౌముదీశ్వరస్వామి ఆలయంలో ధ్యానం చేసుకుంటూ గడిపేవాడు. మన పూర్వ జన్మల సంస్కారాల్ని అనుసరించి ఆయా క్షేత్రాలు ఆకర్షిస్తాయని తాత్త్వికులు చెబుతారు.

‘పారుతూ ఉండే నీరు స్వచ్ఛంగా ఉంటుంది, నిలిచి ఉండే నీరు పాకుడు పడుతుంది’ అన్నది నానుడి. మన మనస్తత్వమూ అంతే. లోకాన్ని చూడకుంటే బావిలో కప్పలా మిగిలిపోతాం. తన పరిమితమైన అనుభవ జ్ఞానంతో సర్వం తెలిసినట్లు అహంకరించడం సరికాదు. అందుకే పూర్వం గురుకులాల్లో గురువులు బోధనలో భాగంగా శిష్యులతో కొన్నాళ్లు దేశాటన చేయించేవారు. అలాగే ఆత్మీయులు భౌతికంగా దూరమైనప్పుడు.. దుఃఖోపశమనానికి కూడా పర్యటనలు తోడ్పడతాయి.

ప్రాంతాలు పాఠాలు నేర్పాయి..
దేశసంచారం సర్వసంగ పరిత్యాగులకే కాదు సంసారులకూ వర్తిస్తుందని సూర్యదేవర సంజీవదేవ్‌ లాంటివారు నిరూపించారు. ప్రాథమిక పాఠశాల స్థాయిలోనే చదువుకు స్వస్తి చెప్పినా, పర్యటన వల్లే జ్ఞానాన్ని సంపాదించాను అనేవారాయన. తాత్త్వికునిగా, చిత్రకారునిగా హిమాలయాల వరకూ సంచార జీవితాన్ని గడిపిన సంజీవదేవ్‌ ఎన్నో ఆశ్రమాలు సందర్శించారు. సాధు సాంగత్యంలో ఎంతో జ్ఞానాన్ని ఆర్జించారు. రవీంద్రనాథ్‌టాగోర్, ప్రేమ్‌చంద్‌ వంటి రచయితలను కలిసి సాహితీవేత్తగానూ కీర్తి సాధించారు. ‘ఎన్నెన్నో ప్రదేశాలు సందర్శిస్తూ జీవితంలో ఎదురైన బాధల నుంచి ఓదార్పు పొందాను. ఆయా ప్రాంతాల అనుభవాలు నాకు కొత్త పాఠాల్ని నేర్పాయి’ అన్నారు సంజీవదేవ్‌.