
రాష్ట్ర ప్రభుత్వం అర్చకుల సమస్యలను పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ అర్చక సమాఖ్య రాష్ట్ర మహాసభ కోరింది. నంద్యాల పట్టణం మూలమఠంలోని శివాలయంలో అర్చకులు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా సమాఖ్య అధ్యక్షుడు ఆత్రేయబాబు, ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు, కార్యనిర్వాహక కార్యదర్శి రాంబాబు మాట్లాడుతూ.. అర్చకులకు రూ.15 వేల కనీస వేతనం, దీప ధూప నైవేద్యాల కింద ఆలయాలకు నెలకు రూ.10 వేలు ఇవ్వడం పట్ల కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. వంశపారంపర్య అర్చకులకు పారితోషికాలు చెల్లించాలని, కనీస వేతనం అందేలా మ్యాచింగ్ అలవెన్సులు మంజూరు చేయాలని, సర్వీస్ ఇనాంలు అనుభవిస్తున్న వారి పేర్లను అడంగల్, రెవెన్యూ రికార్డుల్లో అనుభవదారులుగా నమోదు చేసి పాస్ పుస్తకాలు ఇవ్వాలని, అర్చక సంక్షేమ నిధి ట్రస్టు బోర్డులో ఆరుగురు అర్చక ప్రతినిధులకు స్థానం కల్పించాలంటూ ప్రభుత్వానికి విన్నవించారు. సమాఖ్య నాయకులు అనంతాచార్యులు, కడలి సత్యబాబు, నరసింహయ్య, జేఎల్బీ శాస్త్రి, వీరశైవాగం తదితరులు పాల్గొన్నారు.





