
భారత దేశ బలమంతా ఐక్యతలోనే వుందని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సరసంఘచాలక్ మోహన్ భాగవత్ తెలిపారు. ప్రపంచానికి శాంతిని అందించే హిందూ జీవన విధానమే అనేక సమస్యలకు పరిష్కార మార్గమని ఉద్ఘాటించారు. కేరళలోని వడయంపాడి పరమభట్టర కేంద్రవిద్యాలయంలో జరిగిన ఆర్‌ఎస్‌ఎస్ దక్షిణ కేరళ ప్రాంత విద్యార్ధి సాంఘిక్‌లో ఆయన మాట్లాడారు. యావత్ హిందూ సమాజాన్ని ఏకం చేయడం, ధర్మ పరిరక్షణ ద్వారా ప్రపంచానికి ఫలవంతమైన, ప్రయోజనకర పరిష్కారాలను అందించడం సంఘ్ లక్ష్యమని వివరించారు. కేవలం దైవమే సమాజంలో మార్పు తీసుకురాలేవని, తమకు తాముగా సహాయం చేసుకోని వారిని దేవుడు కూడా రక్షించడలేడన్న నానుడి మన లోకంలో వుందని గుర్తు చేశారు.
మనం భారత దేశ సంతానమేనని, లక్షలాది మంది పిల్లలున్నా.. తల్లి నిన్సహాయంగా మారితే, మన కర్తవ్యం ఏమిటని ప్రశ్నించారు. ఆ కర్తవ్యాన్ని నెరవేర్చడానికి తగిన శక్తి కావాలని, శక్తి ప్రభావవంతంగా వుండాలంటే అందరికీ క్రమశిక్షణ, జ్ఞానం అత్యావశ్యకమని వివరించారు. మన లక్ష్యంపై అచంచలమైన విశ్వాసం, దృఢ సంకల్పం, అచంచలమైన ఏకాగ్రత అవసరం అన్నారు. ఎలాంటి విపత్కర పరిస్థితుల్లోనూ ఇవి సడలిపోవద్దని సూచించారు. అలాంటి వ్యక్తులను తయారు చేయడంపైనే సంఘ్ దృష్టి సారించిందని వివరించారు.
తత్వాల అనుసరణ వల్ల సుఖం లభిస్తుందని అన్నింటిలోనూ వుందని, భౌతికవాదం, వస్తు పరిణామ సిద్ధాంతం, సంప్రదాయం… ఇలా అన్ని తత్వాలూ సుఖాన్ని ప్రసాదించడానికే పనిచేస్తున్నాయి. అప్పటి కంటే ఇప్పుడు జ్ఞానం, సౌలభ్యాలు కూడా పెరిగాయని, కానీ… మనుషులు ఆనందాన్ని మాత్రం పొందలేకపోతున్నారన్నారు. భారత్ లో కూడా పోరాటాలు జరుగుతూనే వున్నాయన్నారు. రైతులు, వినియోగదారులు, కార్మికులు, అధికార పార్టీ, ప్రతిపక్షాలు… అందరూ నిరసనల్లో మునిగిపోయారన్నారు. అలాగే యుద్ధాలు కొనసాగుతున్నాయని, పర్యావరణ విధ్వంసం కూడా జరుగుతూనే వుందన్నారు. దీంతో లెక్కలేనన్ని సమస్యలు తెరపైకి వస్తున్నాయని, అయితే…. ఈ సమస్యలన్నింటికీ పరిష్కారాలు భారత్ లోనే వున్నాయని ప్రకటించారు.
పాశ్చాత్య దేశాల్లో ప్రయాణించిన ఒక న్యూరాలజిస్ట్ చెప్పినట్లుగా, పశ్చిమ దేశాల వైఫల్యం మూలాలను మరచిపోతూ ఫలాలను వెతకడంలో ఉందని చెప్పారు.అయితే, దీనికి విరుద్ధంగా, మనం మన మూలాలను పెంచుకుంటున్నాం కానీ ఫలాలను కోరుకోలేదని, మనకు రెండూ అవసరం అని ఆయన తెలిపారు. భారత్ తత్వశాస్త్రం అందరినీ ఆలింగనం చేసుకుంటుందని పేర్కొంటూ ఇది సమాజం, వ్యక్తి, సృష్టిని పరమేష్టి వైపు ప్రయాణంలోకి సమన్వయం చేస్తుందని డా. భగవత్ వివరించారు.మనస్సు, బుద్ధి, శరీరం అన్న అమరిక ద్వారా ఆత్మ మోక్షానికి మార్గం వేస్తుందని వివరించారు.
భారత్ శక్తిమంతమైన దేశంగా మారడం ప్రపంచానికి చాలా అవసరమని, భిన్నత్వాన్ని అక్కున చేర్చుకునే మన అద్వితీయ సాంస్కృతిక ఏకత్వమే మన బలమని తెలిపారు. కాలడిలో జన్మించి, ఈ ఐక్యతను ప్రచారం చేయడానికి దేశంలోని నాలుగు మూలల్లో ధామాలను స్థాపించిన శంకరుడి భూమి ఇదని మోహన్ భాగవత్ పేర్కొన్నారు.