
వ్యాధులను నయం చేసే శక్తి గోమూత్రానికి ఉందంటూ మద్రాస్ ఐఐటీ డైరెక్టర్ వి.కామకోటి చెప్పినట్లున్న ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరలవు తోంది. గోమూత్రం సేవించి తీవ్రమైన జ్వరం నుంచి బయటపడినట్లుగా ఓ ముని చెప్పిన మాటలను ఉటంకిస్తూ ఆయన.. ‘ఆవు మూత్రానికి యాంటీ బ్యాక్టీ రియల్, యాంటీ ఫంగల్, జీర్ణశక్తిని కలిగించే లక్షణాలున్నాయి. కొన్ని రకాల జీర్ణ సంబంధ వ్యాధులను ఇది నయం చేయగలదు’ అని అన్నారు. ఈ నెల 15న గో సంరక్షణ శాలలో జరిగిన కార్యక్రమంలో కామకోటి దేశీయ ఆవు జాతుల వృద్ధి, ఆర్గానిక్ వ్యవసాయం ప్రాముఖ్యంపై ప్రసంగిస్తూ పైవ్యాఖ్యలు చేశారు. ఆర్గానిక్ వ్యవసాయం దేశ ఆర్థిక రంగానికి ఎంతో మేలు చేస్తుందని చెప్పారు. ఈ వ్యాఖ్యలపై ఎప్పటిలాగే డిఎంకె సహా కొన్ని ద్రవిడ పార్టీలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయి. కాంగ్రెస్ నేత పి.చిదంబరం కామకోటి ఐఐటీ చైర్మన్ హోదాకు తగరంటూ వ్యాఖ్యానించారు. అయితే, డైరెక్టర్ కామకోటి ఎంతో విసృతార్థంలోనే గోమూత్రాన్ని కొనియాడారని, స్వయంగా ఆయన ఆర్గానిక్ వ్యవసాయం చేయిస్తున్నారని సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి.





