
( సంక్రాంతి ప్రత్యేకం )
సంక్రాంతి అంటే మార్పు చెందడం, మారడం, గమనాన్ని మార్చుకోవడం, ప్రవేశించడం అని అర్థాలు వస్తాయి. ప్రకృతి ఆరాధన, కళాతృష్ణ, ఆరోగ్యం, సంఘటితం చేయడం వంటి ఎన్నో కోణాలు ఉన్న అందమైన పండుగ సంక్రాంతి. మరొక సామాజిక కోణం- ఇది సేద్యంతో ముడిపడి ఉన్న వేడుక. సంక్రాంతి లేదా సంక్రమణం అనే సంస్కృత పదానికి వివరణ:
సం – ఉపసర్గ పూర్వక క్రముధాతోః నిష్పన్నః- సంక్రాంతిః
క్రము అంటే గమనం.
భాస్కరస్య యథా తేజో మకరస్తస్య వర్ధతే।
తదైవ భవతాం తేజో వర్ధతామితి కామయే।।
ఏ విధంగానైతే సూర్యుడు అధిక తేజస్సు (వెలుగు), ఎక్కువ పగటికాలం ఉండే విధంగా మకరరాశిలోకి ప్రవేశిస్తాడో, అదేవిధంగా మా ఆరోగ్యం, సంపదలు వృద్ధినొందుగాక!
ఖగోళశాస్త్రం: జగత్తును వెలిగిస్తూ సకల జీవకోటిని ప్రదీప్తం చేస్తున్న సూర్యభగవానుని సంచారగతిని అనుసరించి నిర్ణయించిన సశాస్త్రీయ సామాజిక, సాంస్కృతిక, సాంఘిక, వ్యవసాయ, ఆర్థిక, కళలతో కూడిన పండగే సంక్రాంతి. మన పండుగలన్నీ తిథుల ప్రాతిపదికగా ఏర్పడినవే. కాని తిథి ప్రాతిపదికగా జరుపుకోనిది సంక్రాంతి. మిగిలిన పండుగలు చాంద్రమానం ప్రకారం, సంక్రాంతి సౌరమానం ప్రకారం జరుపుకోవడం మరొక విశేషం. ప్రకృతినీ పర్యావరణాన్నీ అనుసరిస్తూ జీవనం సాగించాలనే సర్వోత్తమ సనాతన ధర్మం హిందూత్వం.
ఏటా జనవరి 12-15 తేదీల మధ్య (గ్రెగేరియన్ కాలండర్) దేశ వ్యాప్తంగా చేసుకునే అతిపెద్ద పండుగ మకర సంక్రాంతి. ఆకాశంలో సూర్యుడు ప్రయాణం చేస్తున్నట్టు కనబడే మార్గానికి అటు ఇటూ సుమారు 16 డిగ్రీల మేర వ్యాపించి ఉండే మండలాన్ని రాశిచక్రం అంటారు. దీనిని 12 భాగాలుగా విభజించారు. అవే 12 రాశులు్గ (Zodiac). అవి- మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం, మీనం.
సూర్యుడు ఒక్కొక్క నెలలో ఒక్కొక్క రాశిలో సంచరిస్తాడు. పన్నెండు రాశులలో కలిపి 27 ప్రసిద్ధ నక్షత్రాలు (అశ్వని-రేవతి) ఉన్నాయి. ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాల చొప్పున 108 (27×4) పాదాలు ఉన్నాయి. అంటే ఒక్కొక్క రాశిలో 9 పాదాలు (108 పాదాలు/12 రాశులు = 9 పాదాలు/1 రాశికి) ఉంటాయి.
సూర్యుడు రాశి మారినప్పుడల్లా సంక్రాంతి లేదా సంక్రమణ వస్తుంది.
గోళాకారంలో ఉన్న భూమికి భూమధ్య రేఖ (Equator)పైన ఉత్తరార్ధ గోళం(Northern hemisphere) క్రింద దక్షిణార్థ గోళం (Southern hemisphere) ఉంటాయి. సూర్యుడు తన గమనం ఒక్కొక్క రాశి నుండి మార్చుకుంటూ సుమారుగా డిసెంబరు 16న ధనురాశిలోకి ప్రవేశిస్తాడు. సూర్యకిరణాలు దక్షిణార్ధ గోళంపై ప్రసరిస్తాయి. జనవరి 15న (పుష్యమాసం) అంటే జనవరి 14 అర్ధరాత్రి 2 గంటల 6 ని.లకు మకరరాశిలోకి ప్రవేశించడం ద్వారా (సంక్రమణం) తన గమనాన్ని దక్షిణం నుండి ఉత్తరం వైపునకు మార్చుకొంటాడు.
ఉత్తరాత్రయం(2)- శ్రవణం (4)-ధనిష్టార్థం(2) – మకరః అని మన పూర్వికులు నిర్వచించారు. ధనురాశిలో ఉత్తరాషాఢ నక్షత్రంలోని 2వ పాదంలోకి ప్రవేశించడమే మకర సంక్రమణం లేదా మకర (మొసలి ఆకారంలో ఉండే నక్షత్ర సముదాయం) సంక్రాంతి. ఈ విధంగా సంవత్సరంలో 12 సంక్రాంతులు వస్తాయి. కానీ వీటిలో భూమి అక్షం సూర్యుడి వైపు ఉండే కోణం, దూరాన్ని బట్టి ఉత్తరం వైపునకు (ఉత్తరాయణ) మారే సంక్రాంతికే ప్రాధాన్యం. మకర సంక్రమణం వెలుగుదారి. పగలు ఎక్కువ రాత్రి తక్కువ ఉండే దిశగా సూర్యకిరణాల ప్రసారం ప్రారంభమవుతుంది. మన దేశం ఉత్తరార్థ గోళంలో కర్కాటకరేఖ (Tropic of Cancer)కు దగ్గరగా ఉంది. చలికాలం నుండి వేసవికాలం వైపు ప్రయాణం ప్రారంభం అవుతుంది. భగవద్గీతలో చెప్పినట్లుగా దేవతలు మేల్కొనే కాలం ఉత్తరాయణం.
అగ్నిర్జ్యోతి రహః శుక్లః షణ్మాసా ఉత్తరాయణమ్
తత్ర ప్రయాతా గచ్ఛంతి బ్రహ్మ బ్రహ్మ విదో జనాః (8-24)
ఆరునెలల ఉత్తరాయణ పుణ్యకాలం మోక్ష మార్గం. ఈ ఆరుమాసాల కాలంలో వేడి, వెలుగు, శుక్లపక్షంలో పగటిపూట ఈ లోకాన్ని విడిచివెళ్లిన వారు పునర్జన్మలేని పరమపదాన్ని (మోక్షం) పొందుతారు. భీష్ముడు ఉత్తరాయణ కాలంలోనే మోక్షాన్ని పొందాడు (భీష్మఏకాదశి).
ఎటువంటి ఖగోళ దూరదర్శినులు (Telescopes) లేని ఆ కాలంలో వేలకోట్ల మైళ్ల దూరంలో సూర్య, నక్షత్ర, చంద్ర భూగమనాలను పరిశీలించి, పరిశోధించి కచ్చితంగా మన పూర్వికులు (శాస్త్రవేత్తలు) ఎలా లెక్క కట్టారో ఈనాటి ఆధునిక శాస్త్రవేత్తలే పరిశోధించాలి.
ఉత్తరాయణ, సంక్రాంతి, తిల్‌సక్రాయిట్, మఘ, మేల, మాఘి, భోగి, పొంగల్ పేర్లతో సంక్రాంతి పండుగను దేశం యావత్తు జాతీయ సమైక్యతకు ప్రతిబింబంగా స్థానిక సంస్కృతులను, గ్రామ దేవతలను, ఆచార వ్యవహారాలను తరతరాలకు ఎన్నో తరాలకు అందించే విధంగా వ్యవస్థీకరించడం విస్మయం కలుగజేస్తుంది.
భోగి : మకర సంక్రాంతి ముందురోజు వచ్చే పండుగే భోగి. ఎన్నో ఆధ్యాత్మిక వైజ్ఞానిక, సృజనాత్మక, వినోదాత్మక అంశాలతో కూడినదే భోగి.
ఆధ్యాత్మిక భోగాలను అనుభవించమని ప్రబోధించే పర్వదినం భోగి. భోగి అంటే భోగం సౌఖ్యం, భోగాన్ని అనుభవించేవాడు. పరమాత్మ పంచభూతాత్మకమయిన భోగస్వరూపమయిన ప్రకృతిని సృష్టించి, ఆ సృష్టిలోని భోగాలను ఎలా అనుభవించాలో విజ్ఞాన రూపంగా అందించిన రోజే భోగి.
గోదాదేవి (ఆండాళ్) ధనుర్మాసం నెలరోజులు మార్గళీ వ్రతాన్ని ఆచరించి తిరుప్పావై (శ్రీ-వ్రతం) పాశురాలతో (ఛందోబద్ధంగా ఉన్న పాటలు) రంగనాథ స్వామిని కీర్తించి పరమాత్మ అనుగ్రహం పొంది భోగినాడు రంగనాథ స్వామిని వివాహం చేసుకొని పరమ ఉత్తమమయిన ఆధ్యాత్మిక ఆనందాన్ని (భోగాన్ని) పొందింది. అందుకే భోగి రోజున శ్రీ గోదారంగనాథస్వామి కల్యాణం జరిపించడం సంప్రదాయం.
ఇది పితృదేవతలకు తర్పణాలు ఇచ్చేరోజు. ఆదిశంకరులు సన్యసించిన రోజు. శబరిమలైలో మకరవిలక్కు వద్ద అయ్యప్పస్వామి భక్తులు మకరజ్యోతిని దర్శించుకునే రోజు.
విష్ణుమూర్తినీ, ఇంద్రుడినీ పూజించి ఈ ప్రకృతిని మన కోసం సృష్టించిన దేవతలకు కృతజ్ఞతలు ప్రకటించుకొనే రోజు. సూర్యారాధనను కచ్చితంగా చేయవలసిన రోజు.
ప్రయాగలో మకర సంక్రాంతి రోజు జరిగే కుంభమేళా గంగానదీ స్నానాలు ప్రపంచ విదితమే.





