
రంగు రంగుల రంగవల్లులు.. నవ ధాన్యాలు.. గొబ్బెమ్మలు.. భోగి మంటలు.. గాలి పటాల రెపరెపలు.. గంగిరెద్దుల విన్యాసాలు.. హరిదాసు సంకీర్తనలు.. యువత కోలాటాల సందడి ఒకటేమిటి ఎన్నో సంప్రదాయాల మేళవింపుగా సంబరాలు అంబరాన్నంటేలా జరుపుకొంటారు. సన్నాయి మేళాలు .. బసవన్నల తాళాలు .. పాల పొంగళ్లు .. రేగుపండ్లు.. ఆకట్టుకునే గొబ్బిళ్లు .. ఇంటికొచ్చే పాడి పంటలు.. నోరూరించే పిండి వంటలు.. బావా మరదళ్ల ముచ్చట్లు.. సంతోషాల్ని పంచుకునే కొత్త జంటలు.. చిన్నారుల చిరునవ్వులు వెరసి మూడు రోజుల సంబురాలకు వేదికగా మారే సంక్రాంతి పండుగ తెలుగింట చేసే సందడి అంతా ఇంతా కాదు. పండుగలు మన జీవన విధానానికి జీవన ప్రతీకలు. అన్ని పండుగల్లోకెల్లా సంక్రాంతికి ఎంతో విశిష్టత ఉంది. సంక్రాంతి అంటే మేలైన అభ్యుదయం అని అర్థం. కులమతాలకు అతీతంగా అందరూ ఎంతో వేడుకగా జరుపుకొనే పర్వదినం ఇది. పంటలు చేతికి వచ్చి నూతన ధాన్యంతో పొంగలి వండి దేవునికి నైవేద్యం పెట్టి పాడి పంటలు సమృద్ధిగా ఉండాలని రైతు కుటుంబాలు ప్రత్యేక పూజలు చేస్తాయి. యువత గాలి పటాల సయ్యాటలు, రంగుల రంగవల్లికలను తీర్చిదిద్దే తెలుగింటి ఆడపడచుల ఆనందోత్సాహమే ఈ సంక్రాంతి వేడుక. పుడమితల్లికి నమస్కరించే ఉత్సవంగా ఈ పండుగను జరుపుకొంటారు.
మకర సంక్రమణం..: సూర్యుడు ఒక్కో నెలలో ఒక్కో రాశిలోకి ప్రవేశిస్తాడు. జనవరిలో సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించిన రోజునే మకర సంక్రమణం అంటారు. అందుకే ఈ రోజున వచ్చే పండుగను మకర సంక్రాంతిగా పిలుస్తారు. పితృ దేవతలకు ఈ రోజున తర్పణాలు సమర్పిస్తారు. పండుగ సమయానికి కొత్త ధాన్యం ఇంటికి చేరడంతో పాటు చేతి నిండా డబ్బు కూడా అందుబాటులో ఉండటంతో ఉత్సాహంగా వేడుకలు నిర్వహిస్తారు. ఆరుగాలం శ్రమించిన రైతులు సేదతీరి ఆనందోత్సాహాలతో గడుపుతారు. కొత్త దుస్తులు, కొత్త ధాన్యం, చలి గాలులతో కలిగే నూతనోత్తేజం ఇలా అన్నింటి కలయిక ఉండటంతో భోగితో ప్రారంభమై కనుమతో వేడుకలు ముగుస్తాయి.
ముగ్గులతో వ్యాయామం..: పండుగకు పది రోజుల ముందు నుంచే వాకిళ్లలో రంగు రంగుల ముగ్గులను అలంకరిస్తాం. చుక్క చుక్కను కలిపే ముగ్గుల గీతలు వరుసలను కలుపుతాయి. చుక్కల ముగ్గు అంటేనే అందరు కలిసి ఉండటమనే అర్థాన్ని ఇస్తుంది. వసుదైక కుటుంబంగా ఆదర్శ జీవితాన్ని గడపడమే ముగ్గుల్లో దాగి ఉన్న పరమార్థం. ముగ్గు వేసేందుకు వాడే పొడి సూక్ష్మజీవులను నశింపజేస్తుంది. బియ్యం పిండితో ముగ్గు వేయడం వల్ల పక్షులు, చీమలకు ఆహారంగా ఉపయోగ పడుతుంది. ముగ్గుల అలంకరణలో శాస్త్రీయత ఇమిడి ఉంది. ఎంతో పవిత్రమైన ధనుర్మాసంలో తెల్లవారు జామున ముగ్గులు వేసే సమయంలో వంగటం, కూర్చోవటం వల్ల వ్యాయామం చేసిన ఫలితం దక్కుతుంది.





