ArticlesNews

నవ్యకాంతుల సిరి సంక్రాంతి

248views

( సంక్రాంతి ప్రత్యేకం )

తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతి. ఏటా పుష్యమాస బహుళ పక్షంలో వచ్చే ఈ పండుగ సమాజంలోని అన్ని వర్గాలకు ఆనందదాయకమైనది. ఇది అందరికీ పండుగే అయినా కర్షకులకు అతి ముఖ్యమైనది. రైతులకు సిరులు కురిపించి వారి కళ్లలో ఆనందకాంతులు నింపే పండుగ. సకల జీవరాశుల మేలు కోరే అన్నదాతలు పశుపక్ష్యాదుల పట్ల ఉదారతను కనబరుస్తారు. చేలలో వరిని కోసినప్పుడు కొన్ని కంకులను పక్షులకు ఆహారంగా ఇళ్ల చూరులకు వేలాడదీస్తారు. తనకు దక్కిన దానిలో కొంతయినా తిరిగి ప్రకృతికి చెందాలను కోవడం ‘బతుకు`బతికించు’ అనే దానికి నిదర్శనం. సంక్రాంతి నాలుగు రోజుల పండుగ భోగి, మకర సంక్రాంతి, కనుమ, ముక్కనుమ అనే పేర్లతో ఘనంగా జరుపుకుంటారు. ఈసారి ముక్కోటి ఏకాదశి భోగి ముందు రోజు రావడం విశేషం.

సంక్రాంతి ఆనందానికి, ఆరోగ్యానికి, ఐశ్వర్యానికి ప్రతీక. ‘సం’ అంటే మిక్కిలి, ‘క్రాంతి’ అంటే ప్రగతి పూర్వక మార్పు. ‘సంక్రమణం’ అంటే ‘చక్కగా క్రమించడం’ అంటే ‘నడవడం’ అని భావం. సూర్యుడు ఒకరాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశించ డమే సంక్రాంతి. అలా నెలకొకసారి వచ్చే దానిని ‘మాస సంక్రాంతి’గా వ్యవహరిస్తారు. సర్వసాక్షి, సమస్త ప్రాణులకు జీవప్రదాత సూర్యభగవానుడు పుష్యమాసంలో మరకరాశిలో ప్రవేశించడమే మకర సంక్రాంతి. ఆనాడు సూర్యారాధనకు ప్రత్యేక ప్రాధాన్యమిస్తారు. దక్షిణాయనానికి వీడ్కోలు పలుకుతూ ఉత్తరాయణానికి స్వాగతం పలుకుతుంది. దక్షిణాయణం పితృదేవతలకు, ఉత్తరాయణం దేవతలకు ముఖ్యమని, కనుక ఉత్తరాయణాన్ని పుణ్యకాలమని చెబుతారు. దక్షిణాయనంలో మరణించిన వారికి ఉత్తమగతి ఉండదని, భీష్ముడు కురుక్షేత్రంలో దక్షిణాయనంలోనే అంపశయ్యపై ఒరిగినా ‘ఇచ్ఛా మరణం’ వరంతో ఉత్త రాయణం వరకు ప్రాణం నిలుపుకున్నారని పురాణ గాథ. అంపశయ్యపై ఉన్నప్పుడే పాండుసుతాదులకు విష్ణు సహస్ర నామాలను బోధించారు.

సూర్యుడు మకరరాశిలో ప్రవేశించిన ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభంతో ఉష్ణోగ్రతలలోనూ మార్పులు వస్తాయి. సూర్యకిరణాల్లో తీక్షణ హెచ్చుతుంది.

సూర్యుడు నెలకు ఒక రాశి వంతున ఏడాదిలో పన్నెండు రాశులలో ప్రవేశిస్తాడు. ఈ ప్రక్రియను సంక్రమణం లేదా సంక్రాంతి అంటారు. అయితే పుష్య మాసంలో సూర్యుడు మకరరాశిలో ప్రవేశించే సంక్రాంతినే పర్వదినంగా జరుపుకుంటున్నారు. ఈ పండుగను తప్ప ఇతర పండుగలన్నిటిని తిథుల (చాంద్రమానం) ప్రకారం జరుపుకుంటారు. దీనిని మాత్రమే ‘సంక్రాంతి’ అని వ్యవహరిస్తారు. ఆ రోజే ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది. అప్పటి వరకు భూమధ్య రేఖకు దక్షిణ దిక్కులో ఉన్న సూర్యుడు ఉత్తర దిక్కుకు మారతాడు. కనుకనే దీనిని ఉత్తరాయణం అంటారు. మకర సంక్రాంతితో ఆరంభమయ్యే ఉత్తరాయణంలో వాతావరణంలో మార్పులు వస్తాయి. పగటి వేళలు పెరుగుతాయి. అప్పటి వరకు సుదీర్ఘంగా ఉండే రాత్రి వేళలు సంక్రాంతి తర్వాత తగ్గుతాయి. ఆకాశం ఆహ్లాదమవుతుంది.

సంక్రాంతిని పెద్దల పండుగ, పంటల పండుగ, పశువుల పండుగ అంటారు. ఆ రోజున పితృ దేవతలను స్మరిస్తూ దానధర్మాలు చేస్తారు. మకరరాశికి శని అధిపతి కనుక శని ప్రీతి కోసం తిలదానం ఆచారంగా వస్తోంది. తన పూర్వికులను పునీతులను చేసేందుకు భగీరథుడు గంగానదిని మకర సంక్రాంతి రోజున భువికి రప్పించాడని ప్రతీతి. వామనుడికి బలి చక్రవర్తి మూడడుగుల నేలను దానమివ్వగా, హరి రెండడుగులతో బ్రహ్మాండమంతా వ్యాపించి మూడవ అడుగుగా పాదాన్ని బలి శిరస్సున మోపి పాతాళానికి పంపినది ఈ మకర సంక్రమణ పుణ్యకాలంలోనే. సృష్టి ఆరంభంలో శ్రీమన్నారాయణుడు మకరరాశిలోని శ్రవణ నక్షత్రంలోనే బ్రహ్మకు అనంత పద్మనాభస్వామిగా సాక్షాత్కరించాడట. సంక్రాంతి నాడు పంచసూక్త సహితంగా శివుడికి ఘృతాభిషేకం (నేతితో) చేయడం వల్ల మాఘపుణ్యఫలితం దక్కుతుందని పెద్దలు చెబుతారు.

సంక్రాంతి అనగానే పల్లెలో మొదట స్ఫురించేది కోడిపందేలు. వీటిపై నిషేధం ఉన్నా అనధికారికంగా జరుగుతూనే ఉంటాయి. పండుగకు కొన్ని నెలల ముందే పందెం రాయుళ్లు కోడి పుంజుల పెంపకం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపుతారు. వాటి రంగులను బట్టి డేగ, నెమలి, కాకి లాంటి పేర్లతో పిలుస్తారు.