
పశుపోషకులకు చేయూతనిచ్చి పాడి పరిశ్రమను ప్రోత్సహించేందుకు రాష్ట్రవ్యాప్తంగా రైతులకు రాయితీపై మినీ గోకులాలను నిర్మించడం జరుగుతోందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కె గంగవరం మండలం శివల గ్రామంలో మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకం నిధుల ద్వారా నిర్మించిన మినీ గోకులాలను ఆయన ప్రారంబించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గ్రామాల్లో వ్యవసాయానికి అనుబంధంగా రైతులు పశుపోషణ పై ఆధారపడి జీవిస్తారని.. అటువంటి వారికి అండగా నిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకం నిధుల ద్వారా 90% రాయితీ పై మినీ గోకులాలను నిర్మించడం జరుగుతోందన్నారు. ఈ పథకంలో భాగంగా 2,4,6 పశువులు కలిగిన కలిగిన రైతులకు పశువుల షెడ్లు నిర్మించడం జరుగుతుందన్నారు. 2 పశువులకు 1,15,000 రూపాయలు, 4 పశువులకు 1,85,000 రూపాయలు, 6 పశువులకు 2,30,000 రూపాయల అంచనా తో 90 రాయితీ ప్రభుత్వమే అందిస్తూ కేవలం 10 శాతం మాత్రమే రైతులు భరించేలా పశువుల షెడ్లు నిర్మించడం జరుగుతుందన్నారు. రామచంద్రాపురం నియోజకవర్గం లో 3,63,49,798 రూపాయల ఉపాధి హామీ నిధులతో 182 పశువుల షెడ్లు మంజూరయ్యాయని వీటి లో ఇప్పటికే 44 పశువుల షెడ్ల నిర్మాణం పూర్తి చేయడం జరిగిందన్నారు.





