
( జనవరి 12 – వివేకానంద జయంతి )
స్వామి వివేకానంద, హిందూ సంస్కృతి వైభవాన్ని విశ్వ యవనిక పై ఎలుగెత్తి చాటిన మహామేధావి, యువతకు ప్రేరణ దాత, గాంధీజీ, ఠాగూర్, జగదీష్ చంద్రబోస్, జంషెడ్జీ టాటా ఇలా ఎందరో మహనీయులకు స్ఫూర్తిప్రదాత. స్వామి వివేకానంద తన మాటల ద్వారా వసుధైక కుటుంబ భావనను వ్యక్తపరిచారు. అందరూ సమానమని చాటిన సమరసతావాది, భారత సాంస్కృతిక వారధి స్వామి వివేకానంద. ఈ యుగ ప్రవక్త 1919 విక్రమ సంవత్ పౌష కృష్ణ పక్షం సప్తమి నాడు జన్మించాడు. గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం 1863 జనవరి 12 మకర సంక్రాంతి రోజున కలకత్తా నగరంలోని భువనేశ్వరి దేవి, విశ్వనాథ దత్త దంపతులకు జన్మించిన బాలునికి నరేంద్రుడు అనే నామధేయాన్ని పెట్టారు. పువ్వు పుట్టగానే పరిమళించినట్లు చిన్ననాటి నుండే దాతృత్వం, నేతృత్వం, కర్తృత్వం, సమరసత, సత్యశోధన, తాత్విక చింతన, ఏకాగ్రత, ధీరోదాత్తత వంటి సుగుణాలెన్నో మన నరేంద్రునిలో పరిఢవిల్లాయి.
స్వామి వివేకానంద తన జీవితాన్ని యువతకు సామాజిక సేవ యొక్క ప్రాముఖ్యతను తెలియజేయడానికి, వారికి మార్గనిర్దేశం చేయడానికి, యువతలో ఉన్నతమైన నాయకత్వ లక్షణాలకు పునాది వేయడానికి అంకితం చేశారు. అందుకే ఆయన పుట్టినరోజైన జనవరి 12న ప్రతి సంవత్సరం జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకుంటున్నాము.
స్వామి వివేకానంద 1893 సెప్టెంబరు 11న చికాగోలో ప్రపంచ మతాల సమ్మేళనంలో చేసిన ఉపన్యాసం వివిధ మతాలకు చెందిన వారిపై చెరగని ముద్ర వేసింది. తన హృదయాంతరాళం నుంచి పెల్లుబికిన భాతృభావంతో ‘అమెరికా సోదరీ, సోదరులారా’ అని సంబోధిస్తూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. అంతే… ఒక్కసారిగా ఉరుము ఉరిమినట్లు ప్రేక్షకుల నుంచి చప్పట్ల మోత! ‘మీరు మాకు అందించిన సాదరమైన అపురూప స్వాగతానికి మాటల్లో చెప్పలేనంత ఆనందంగా ఉంది. ప్రపంచంలోని అత్యంత పురాతనమైన సన్యాసుల తరఫునా, మతాలకే మాత అయిన మతం తరఫునా, హిందూ మతానికి చెందిన అన్ని వర్గాలూ, తెగలకు చెందిన లక్షలాదిమంది ప్రజల తరఫునా పేరు పేరునా ధన్యవాదాలు’ అన్నారు. అలాగే ‘ప్రపంచానికి సహనం, సార్వత్రిక అంగీకారం రెండింటినీ బోధించిన మతానికి చెందినవాడిగా నేను గర్వపడుతున్నాను. మేము సార్వత్రిక సహనాన్ని విశ్వసించడంతోపాటూ అన్ని మతాలనూ నిజమైనవిగా అంగీకరిస్తాం… భూమిపై ఉన్న అన్ని మతాలకూ, దేశాలకూ చెందిన బాధితులకూ, శరణార్థులకూ ఆశ్రయం కల్పించిన దేశానికి చెందినవాడిగా నేను గర్విస్తున్నాను’ అని ఎలుగెత్తి చాటారు.
‘ఎరైజ్, ఎవేక్, అండ్ స్టాప్ నాట్ అంటిల్ ది గోల్ ఈజ్ రీచ్డ్’ (లేవండి, మేల్కొనండి, లక్ష్యాన్ని చేరుకునే వరకు ఆగకండి) అని స్వామి ఇచ్చిన పిలుపు ఎంతో ప్రసిద్ధి చెందింది. అలాగే ‘మీరు లోపల నుండి ఎదగాలి. ఎవరూ మీకు బోధించరు, మిమ్మల్ని ఆధ్యాత్మికంగా మార్చరు. మీ సొంత ఆత్మ తప్ప మరొక గురువు లేడు’ అని బోధించారు. ఒక దేశ బలం, శక్తి దాని యువత చేతుల్లోనే ఉందని నొక్కి చెప్పారు. ఆయన దృష్టిలో యువత సానుకూల మార్పునకు దీపధారులు. మంచి భవిష్యత్తును రూపొందించడానికి అవసరమైన శక్తి, ఉత్సాహం, సృజనాత్మకతను కలిగి ఉండే వారు. ‘మీరు బలహీనులని భావించడం మహాపాపం… విశ్వంలోని అన్ని శక్తులూ ఇప్పటికే మనవి. కళ్లకు అడ్డుగా చేతులు పెట్టుకొని అంతా చీకటి అని ఏడ్చేదీ మనమే. మీ జీవితంలో రిస్క్ తీసుకోండి. మీరు గెలిస్తే, మీరే నాయకత్వం వహించవచ్చు; మీరు ఓడిపోతే, మీరు మార్గనిర్దేశం చేయవచ్చు’ అంటూ స్వామి ఇచ్చిన అద్భుతమైన సందేశాలు యువతకు అనుసరణీయాలు.
స్వామి వివేకానందకు హిందూ మత ఆధ్యాత్మిక రాయబారి, కర్మయోగి అని బిరుదులు ఉన్నాయి. రామకృష్ణ మిషన్, రామకృష్ణ మఠం అనే సంస్థలను స్థాపించారు. నా నరేంద్రుడు విశ్వానికి వెలుగునిచ్చే జ్ఞాన సూర్యుడు అని రామకృష్ణ పరమహంస అన్నారు. తన గురుదేవులు రామకృష్ణ పరమహంస నిర్యాణం అనంతరం సాధన చేసి, కాలినడకన దేశ పర్యటన చేసి దీన, దరిద్ర జనోద్ధరణకు పూనుకున్నారు. మీరు మీ దేశాల నుంచి బిషప్‌లను కాదు సాంకేతిక పరిజ్ఞానం ఇచ్చి మానుండి ఆధ్యాత్మిక చింతనను పొందండి అప్పుడే తూర్పు పడమర కలిసి విశ్వశాంతి లభిస్తుందని వివేకానందులవారు చెప్పడం ఆయన విశ్వమానవ తత్వానికి నిదర్శనం





