News

మహా కుంభమేళాకు రానున్న స్టీవ్‌ జాబ్స్‌ భార్య లారెన్‌.. కల్పవస్‌ దీక్షకు సంకల్పం

289views

కామన్‌మేన్ నుంచి కుబేరుడి దాకా ప్రపంచం మొత్తం….ఇప్పుడు ప్రయాగ్‌రాజ్‌ వైపు అడుగులు వేస్తోంది. త్రివేణి గంగలో మునకలు వేసేందుకు లక్షలాదిమంది విదేశీయులు సైతం ఉరకలు వేస్తున్నారు. యాపిల్‌ కో ఫౌండర్‌ స్టీవ్‌ జాబ్స్‌ భార్య లారెన్‌ పావెల్‌ కూడా మహా కుంభమేళాకు తరలి రానున్నారు.

మహా కుంభమేళాలో పాల్గొనేందుకు మన దేశం నుంచే కాదు…విదేశాల నుంచి కూడా భక్తులు తరలివస్తున్నారు. ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించేందుకు విదేశీయులు సైతం పెద్దఎత్తున క్యూ కడుతున్నారు. యాపిల్ సహ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ భార్య లారెన్ పావెల్ జాబ్స్ కూడా మహాకుంభ్‌లో పాల్గొని ‘కల్పవస్’ ఆధ్యాత్మిక ఆచారాన్ని పాటించబోతున్నట్లు సమాచారం. లారెన్ పావెల్ జాబ్స్ జనవరి 13న మహాకుంభ్‌కు వస్తారని తెలుస్తోంది. ఆమె నిరంజనీ అఖారాలోని మహామండలేశ్వర స్వామి కలియాశానంద శిబిరంలో జనవరి 29 వరకు బస చేస్తారు. కల్పవస్‌ అంటే నిత్యం గంగలో స్నానం ఆచరిస్తూ, ఆధ్యాత్మిక మార్గంలో పయనించడం.

ఈ నెల 13న మహా కుంభమేళా ప్రారంభం
ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణి సంగమంలో ఈ నెల 13 నుంచి వచ్చే నెల 26వ తేదీ వరకు.. 45 రోజులపాటు జరిగే ఈ మహోత్సవానికి అక్కడి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. 45 రోజుల్లో 45 కోట్ల మందికిపైగా భక్తులు పుణ్య స్నానాలు ఆచరిస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. మకర సంక్రాంతి పర్వదినం నుంచి భక్తుల సందడి ప్రారంభం కానుంది. ప్రపంచంలోనే అతి పెద్ద మతపరమైన, సాంస్కృతిక ఉత్సవంగా రికార్డులకెక్కింది ఈ మహా కుంభమేళా.